సుప‌రిపాల‌న‌లో తెలంగాణ దేశానికే దిక్సూచి : మంత్రి హ‌రీశ్‌రావు

నవతెలంగాణ సంగారెడ్డి: స్వ‌ప‌రిపాల‌న‌లో సుప‌రిపాల‌న అందిస్తున్న తెలంగాణ దేశానికే ఆద‌ర్శంగా నిలిచింద‌ని రాష్ట్ర ఆర్థిక‌, వైద్యారోగ్య శాఖ మంత్రి హ‌రీశ్‌రావు అన్నారు.  తెలంగాణ రాష్ట్రావ‌త‌ర‌ణ ద‌శాబ్ది ఉత్స‌వాల్లో భాగంగా ఇవాళ సంగారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వ‌హించిన సుప‌రిపాల‌న దినోత్స‌వంలో మంత్రి పాల్గొని ప్ర‌సంగించారు. తెలంగాణ ఇస్తే.. నక్సలైట్ల రాజ్యం వస్తుంద‌ని.. ప్రతి రోజూ కర్ఫ్యూ ఉంటుంద‌ని ఉద్య‌మ స‌మ‌యంలో మాట్లాడిన వారికి 9 ఏండ్ల కేసీఆర్ పాల‌న‌తో స‌మాధానం చెప్పామ‌న్నారు. తెలంగాణ వ్యతిరేక శక్తుల ఆరోపణల తప్పు అని కేసీఆర్ నిరూపించారని తెలిపారు. అన్ని రంగాల్లో 24 గంటల విద్యుత్‌తో తెలంగాణ వెలిగిపోతుంద‌న్నారు. అభివృద్ధిని పరుగులు పెట్టిస్తూ సుపరిపాలన అందించడంలో తెలంగాణ నేడు దేశానికే దిక్సూచిగా నిలిచింద‌న్నారు. తెలంగాణలో అవలంభిస్తున్న విధానాలు, అమలు చేస్తున్న పథకాలు దేశం మొత్తం అమలు చేస్తున్నారు. నిరంత‌ర క‌రెంట్ స‌ర‌ఫ‌రాతో ప‌రిశ్ర‌మ‌లు భారీగా త‌ర‌లివ‌స్తున్నాయ‌న్నారు. తెలంగాణ పేరు ఇవాళ దేశ వ్యాప్తంగా మార్మోగోతుంద‌న్నారు. మన మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ వంటి పథకాలు దేశానికి రోల్ మోడల్ అయ్యాయని పేర్కొన్నారు. చిన్న జిల్లాలు ఏర్పాటు, కలెక్టర్లు పెరగడం వల్ల ప్రజలకు మంచి సేవలు అందుతున్నాయని హ‌రీశ్‌రావు తెలిపారు. సంగారెడ్డి జిల్లాగా ఏర్ప‌డిన త‌ర్వాత 769 మంది కొత్త అధికారులు ఒక్క సంగారెడ్డి జిల్లాలోనే వ‌చ్చార‌ని గుర్తు చేశారు. ఏండ్ల తరబడి కొట్లాడినా మండలాలు ఇవ్వలేదు. కానీ సీఎం కేసీఆర్ 9 కొత్త మండ‌లాలు ఇచ్చారు. 190 కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసుకున్నామ‌ని మంత్రి హ‌రీశ్‌రావు తెలిపారు.

Spread the love