నవతెలంగాణ – హైదరాబాద్
సీఎం కేసీఆర్ అధ్యక్షతన హైదరాబాదులోని నూతన సచివాలయంలో తొలిసారి నిర్వహించిన తెలంగాణ క్యాబినెట్ సమావేశం ముగిసింది. ఈ సమావేశం 3 గంటలకు పైగా సాగింది. సీఎం కేసీఆర్, మంత్రులతో పాటు, సీఎస్ శాంతి కుమారి, ఇతర ఉన్నతాధికారులు కూడా ఈ క్యాబినెట్ సమావేశానికి హాజరయ్యారు. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలు, వీఆర్ఏల అంశం, పలు ఇతర కీలక అంశాలను ఈ సమావేశంలో చర్చించి ఆమోదం తెలిపారు. క్యాబినెట్ భేటీ ముగిసిన అనంతరం మంత్రి హరీశ్ రావు మీడియాతో మాట్లాడారు. తెలంగాణ విజయాలను రాష్ట్రవ్యాప్తంగా 21 రోజుల పాటు నిర్వహించాలని క్యాబినెట్ నిర్ణయించినట్టు వెల్లడించారు. వివిధ రంగాల్లో సాధించిన విజయాలను రాష్ట్ర ప్రజలందరికీ తెలిసేలా ఉత్సవాలు ఉండాలని సీఎం కేసీఆర్ నిర్దేశించారని తెలిపారు.
క్యాబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయాలు హరీశ్ రావు ఏమన్నారంటే…
– వీఆర్ఏలను క్రమబద్ధీకరించాలని క్యాబినెట్ నిర్ణయించింది. వీఆర్ఏలను వివిధ విభాగాల్లో సర్దుబాటు చేయడం జరుగుతుంది.
– కులవృత్తులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేస్తున్నాం.
– రజక, మేదరి, నాయీబ్రాహ్మణులు, విశ్వబ్రాహ్మణులు తదితర వర్గాల సాయానికి ఈ సబ్ కమిటీ మార్గరదర్శకాలు రూపొందిస్తుంది. ఒక్కొక్కరికి రూ.1 లక్ష అందించాలని క్యాబినెట్ నిర్ణయించింది.
– జీవో నెం.111ని పూర్తిగా ఎత్తివేయాలని క్యాబినెట్ నిర్ణయించింది.
– ఈ జీవో ఎత్తివేత వలల 84 గ్రామాలకు మేలు జరుగుతుంది.
– హెచ్ఎండీఏ భూములకు వర్తించే విధానాలే 111 జీవో భూములకు వర్తిస్తాయి.
– 111 జీవో ప్రాంతంలోని రహదారుల విస్తరణకు క్యాబినెట్ నిర్ణయించింది.
– కాళేశ్వరం జలాలతో హిమాయత్ సాగర్, గండిపేట జలాశయాల అనుసంధానానికి నిర్ణయం.
– హుస్సేన్ సాగర్ ను గోదావరి జలాలలో అనుసంధానానికి నిర్ణయం.
– అన్ని జిల్లాల్లో డీఎంహెచ్ఓ పోస్టుల మంజూరుకు క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది.
– జీహెచ్ఎంసీ పరిధిలోని ఆరు జోన్లకు డీఎంహెచ్ఓలను మంజూరు చేస్తాం.
– 40 మండలాల్లో పీహెచ్ సీలు మంజూరుకు క్యాబినెట్ నిర్ణయం.
– అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లలో శాశ్వత ఉద్యోగుల నియామకాలకు నిర్ణయం తీసుకున్నాం.
– వ్యవసాయ సంస్కరణల కోసం సబ్ కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించడం జరిగింది.
– యాసంగి పంటను నెలరోజులు ముందుకు జరిపే అంశాన్ని సబ్ కమిటీ పరిశీలిస్తుంది.
– నకిలీ విత్తనాలపై ఉక్కుపాదం మోపాలని క్యాబినెట్ నిర్ణయించింది.
– 15 రోజుల్లో రెండో విడత గొర్రెల పంపిణీ చేపడతాం.
– వనపర్తిలో జర్నలిస్ట్ భవన్ కోసం 10 కుంటల భూమి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం.
– ఖమ్మం జిల్లాలో జర్నలిస్ట్ భవన్, ఇళ్ల స్థలాల కోసం 23 ఎకరాల కేటాయింపు.
– మైనారిటీ కమిషన్ జైన్ వర్గ ప్రతినిధిని కూడా చేర్చాలని క్యాబినెట్ నిర్ణయించింది.
– టీఎస్ పీఎస్ సీలో కొత్తగా 10 పోస్టుల మంజూరు.