మంత్రులకూ తెలవదట!

Ministers do not know!– ఇక ప్రతిపక్షాల మొర ఆలకించేదెవరు?
– పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలపై గందరగోళం
–  మితిమీరిన గోప్యత పాటిస్తున్న మోడీ, షా సర్కార్‌
‘పాత పార్లమెంట్‌ భవనానికి వీడ్కోలు పలకడానికేనా?’… పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాల గురించి రెండు రోజుల క్రితం ఓ పత్రిక ప్రచురించిన వార్త శీర్షిక ఇది. ఇది చూడడానికి హాస్యాస్పదంగానే ఉన్నప్పటికీ అసలు ఐదు రోజుల పాటు ప్రత్యేక సమావేశాలను ఎందుకు నిర్వహిస్తున్నారో తెలిసింది చాలా కొద్ది మందికి మాత్రమే. చివరికి క్యాబినెట్‌ మంత్రులకు కూడా విషయమేమిటో తెలియదట. మోడీ ప్రభుత్వం అంత గోప్యంగా వ్యవహారాన్ని నడుపుతోంది.
న్యూఢిల్లీ : పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాల గురించి తొలుత ఆగస్ట్‌ 31న ప్రకటన వెలువడింది. వర్షాకాల సమావేశాలు ముగిసింది ఆగస్ట్‌ 11వ తేదీనే. అలాంటప్పుడు మరోసారి ఇంత త్వరగా ఉభయసభలను సమావేశపరచాల్సిన అవసరం ఏమొచ్చిందన్న విషయంపై ఊహాగానాలు మొదలయ్యాయి. పైగా శీతాకాల సమావేశాలు నవంబర్‌లో ప్రారంభం కావాల్సి ఉంది. కొందరేమో దేశం పేరును ఇండియా నుంచి భారత్‌కు మార్చేందుకే ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారని చెబుతున్నారు. పేరు మార్పులో ఎలాంటి తప్పిదం లేదని మంత్రులు కూడా ఢంకా బజాయించి మరీ చెప్పారు. మరికొందరేమో మహిళా రిజర్వేషన్‌ బిల్లును ఆమోదించడానికేనని అంటున్నారు. వాస్తవానికి ఈ బిల్లును 2008లోనే రాజ్యసభ ఆమోదించింది. అయితే ఈ బిల్లుకు తగిన మద్దతు లభించకపోవడం, మహిళల కేటగిరీలో వెనుకబడిన వర్గాలకు ఉప-రిజర్వేషన్లకు సంబంధించి డిమాండ్లు రావడంతో పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైంది. ఒకవేళ మహిళా రిజర్వేషన్‌ బిల్లు ఆమోదానికే ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేస్తే చట్టసభలలో మహిళలకు మూడో వంతు సీట్లు రిజర్వు అవుతాయి. కానీ అందుకోసమే ఈ సమావేశాలా? అనేది మిలియన్‌ డాలర్ల ప్రశ్న.
ముందస్తు ఎన్నికల కోసమా?
మరో ఊహాగానం ఏమంటే.. ప్రభుత్వం లోక్‌సభకు ముందుగానే ఎన్నికలు జరపబోతోందని మీడియాలో వచ్చిన కథనాలు. షెడ్యూల్‌ ప్రకారం అయితే లోక్‌సభకు వచ్చే ఏడాది ఏప్రిల్‌-మేలో ఎన్నికలు జరగాల్సి ఉంది. అంటే మరో ఏడెనిమిది నెలల సమయం ఉంది. 2004లో వాజ్‌పేయి ప్రభుత్వం చేసినట్లు గానే ఈ ఎన్నికలను కొంచెం ముందుకు జరపాలని ప్రభుత్వం భావిస్తోందని వార్తలు వస్తున్నాయి. అయితే వీటిని చాలా మంది నమ్మడం లేదు. ఎందుకంటే ముందస్తు ఎన్నికలకు వెళ్లిన వాజ్‌పేయి సర్కారుకు భంగపాటే ఎదురైంది.
జమిలికి ఎన్నికలకా?
ఇక మరో ఊహాగానం….ఒకే దేశం ఒకే ఎన్నిక. అంటే జమిలి ఎన్నికలు. దీని ప్రకారం ప్రతి ఐదు సంవత్సరాలకు లోక్‌సభకు, రాష్ట్రాల శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు జరుగుతాయి. వీటిలో స్థానిక ఎన్నికలను కూడా కలుపుతారా అనేది ఇంకా తేలడం లేదు. పైగా ఉప ఎన్నికల సంగతి ఏమిటి? అన్ని ఎన్నికలకూ కలిపి అవసరమైన ఈవీఎంలను ఎలా సమకూరుస్తారు? ఈ ప్రశ్నలకు ఇప్పటికీ సమాధానాలు లేవు. వీటిని అధ్యయనం చేసేందుకే మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నేతృత్వంలో ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. కానీ ఈ కమిటీ ప్రత్యేక సమావేశాల లోగా ఎలా నివేదిక ఇస్తుందన్నది ఇంకా తెలియదు.
పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలపై వస్తున్నవన్నీ ఊహాగానాలే. ప్రత్యేక సమావేశాల గురించి మరో ఊహాగానం కూడా వినిపిస్తోంది. ఓబీసీ రిజర్వేషన్లలో ఉప కులాల వర్గీకరణను పరిశీలించేందుకు 2017లో ఓ కమిషన్‌ ఏర్పడింది. దానిని గురించి చర్చించేందుకే ప్రత్యేక సమావేశాలను నిర్వహిస్తున్నారని చెబుతున్నారు.
సమిష్టి బాధ్యతకు తూట్లు
ప్రభుత్వ ఉద్దేశమేమిటో ఎవరికీ తెలియదు. పార్లమెంటరీ తరహా ప్రజాస్వామ్య వ్యవస్థలో సమిష్టి బాధ్యతకు ఉన్న ప్రాధాన్యత తెలిసిందే. కానీ మోడీ ప్రభుత్వం దానిని విస్మరించింది. కనీసం క్యాబినెట్‌ సహచరులకు కూడా దేనిపైనా సమాచారం ఉండడం లేదు. రహస్యాలు, ప్రధాన నిర్ణయాల గురించి క్యాబినెట్‌కు ముందుగా తెలియజేయకపోవడం మున్ముందు కూడా కొనసాగవచ్చు. అందుకే ప్రత్యేక సమావేశాలపై ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. కేబినెట్‌కు కూడా ఏమీ తెలియదంటే ప్రత్యేక సమావేశాలలో దేనిపై చర్చిస్తారు? దేనిని ఆమోదిస్తారు? అంతా అయోమయమే. ఇక ప్రతిపక్షాల మొర ఆలకించేదెవరు?

Spread the love