అన్ని కాలనీలకు మిషన్‌ భగీరథ పైపులు వేయాలి

– ప్రతిరోజు తాగునీరు అందించాలి
– సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్‌
నవతెలంగాణ-మహబూబాబాద్‌
మహబూబాబాద్‌ పట్టణంలో ప్రతి కాలనీకి మిషన్‌ భగీరథ కొత్త పైపులైను వేసి ప్రతిరోజు నీరు అందించాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు. గురువారం పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్‌ ఆఫీస్‌ ముందు ఖాళీ బిందెలతో నిరసన చేపట్టి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సాధుల శ్రీనివాస్‌ మాట్లాడుతూ మిషన్‌ భగీరథ ప్రారంభించి ఆరు సంవత్సరాలు కావస్తున్నా ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇప్పటికీ పనులు పూర్తి కాలేదని విమర్శించారు. ప్రతి సంవత్సరం వేసవి వచ్చిందంటే ప్రభుత్వం ప్రజా ప్రతినిధులు మాయమాటలు చెప్పి కాలయాపన చేస్తున్నారన్నారు. శాశ్వత పరిష్కారం చూపకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని అన్నారు. పట్టణంలో 50 సంవత్సరాల క్రితం వేసిన పాత పైప్‌ లైనుకు మిషన్‌ భగీరథ పైపులైనుకు లింకు చేస్తే నీటి ప్రవాహానికి ఎక్కడికక్కడ పైపులైన్‌ పగిలి రోడ్లు గుంతలమయంగా మారుతున్నాయని అన్నారు. వెంటనే కొత్త పైపు లైన్‌ వేయాలని డిమాండ్‌ చేశారు. నున్న నారాయణ కాలనీ, జ్యోతిబాస్‌ నగర్‌కాలనీ, గుండ్లకుంట హనుమంతరావునగర్‌, ఎల్బీజీ నగర్‌ కాలనీలలో పైప్‌ లైన్లు వేసి నల్లాలు బిగించినా నీరు రాక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. వెంటనే మిషన్‌ భగీరథ నీరు ప్రతిరోజు విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. మాణిక్య నగర్‌, తోట బిక్షంనగర్‌, పాత కలెక్టర్‌ ఆఫీస్‌ వద్ద పైప్‌లైన్‌ వేసి పీరు అందించాలని డిమాండ్‌ చేశారు. మాణిక్య నగర్‌ కాలనీకి సిసి రోడ్డు, తోట బిక్షం నగర్‌కు బీటి రోడ్డు వేయాలని డిమాండ్‌ చేశారు. లేదంటే ప్రజలను సమీకరించి మున్సిపాలిటీని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సుర్ణపు సోమయ్య, జిల్లా కమిటీ సభ్యులు సమ్మెట రాజమౌళి, పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు చీపిరి యాకయ్య, హేమా నాయక్‌, పట్టణ కమిటీ సభ్యులు యమ గాని వెంకన్న, తోట శ్రీనివాస్‌, కుమ్మరి కుంట్ల నాగన్న, బానోతు వెంకన్న, తాజ్జు. సావిత్ర, ఉపేంద్ర, కళావతి, అనిత, రెహనా అనూష, షేర్ల శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Spread the love