ఆయకట్టు చివరి భూములకు సాగునీరు అందాలి: ఎమ్మెల్యే దనసరి సీతక్క

నవతెలంగాణ-గోవిందరావుపేట
కాలువల మరమ్మతుకై కోటి రూపాయల పనులకు భూమి పూజ లక్నవరం చెరువు ప్రధాన కాలువల ఆయకట్టు చివరి భూములకు కూడా సాగునీరు సమృద్ధిగా అందాలని ములుగు ఎమ్మెల్యే దనసరి సీతక్క అన్నారు. గురువారం మండలంలోని గాంధీ నగర్ నీటిపారుదల శాఖ డి ఈ సిహెచ్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో రాంపూర్ కాలువ మన త్తు పనులను పూజా కార్యక్రమాలతో ఎమ్మెల్యే సీతక్క ప్రారంభించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ లక్నవరం ప్రధాన కాలువలైన శ్రీరాంపతి, కోట, ప్రాజెక్ట్, నర్సింహుల కాలువలు నీటి ఉధృతి తట్టుకోలేక గండ్లు పడి, కాలువల పక్కన ఉన్న పంట పొలాలను తడిపేస్తూ వరదల వలన పంట నష్టం వాటిల్లిందని, అలాగే దూరాన ఉన్న పంట పొలాలకు గండ్లు పడి సాగు నీరు అందక ఎండిపోతున్నాయి అని, దీని వల్ల రైతులకు చాలా నష్టం కలుగుతుందని వెంటనే కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్ళి, లక్నవరం ప్రధాన కాలువల మరమ్మత్తుకు కోటి రూపాయల నిధులు మంజూరు చేయడం జరిగిందని అన్నారు. కోట మరియు ప్రాజెక్ట్ కాలువలకు కల్వర్టులు నిర్మించడానికి అనుమతి తీసుకోవడం జరిగిందని అన్నారు. గండ్లు పడి నీటి ఉధృతి వల్ల పంట కొట్టుకుపోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం గత తొమ్మిదేళ్ళ నుండి నష్ట పరిహారం ఇవ్వడం లేదని వెంటనే నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించాలని, ప్రధాన కాలువలు తవ్వేటప్పుడు రైతులు భూమి నష్టపోవాల్సి వచ్చింది అని, నష్టపోయిన భూ నిర్వాసితులకు కూడా నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే లక్నవరం చెరువు క్రింద సుమారు కొన్ని వేల ఎకరాల పంట సాగు అవుతున్నదని, కావున లక్నవరం చెరువులోకి గోదావరి జలాలను తరలించి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.
కాలం సమృద్ధి అయి రైతులు సుభిక్షంగా ఉండాలి
జిల్లా పరిషత్ చైర్మన్ బడే నాగజ్యోతి
ఈ సంవత్సరం వానాకాలం పంట కాలంలో వర్షాలు సమృద్ధిగా కురిసి చెరువులు కుంటలు నిండి రైతులు సుభిక్షంగా ఉండాలని జిల్లా పరిషత్ చైర్మన్ బడే నాగజ్యోతి అన్నారు. మండలంలోని లక్ష్మీపురం గ్రామంలో 14 లక్షల వ్యయంతో నిర్మించే పెద్ద చెరువు మరమ్మత్తు పనులను ఎమ్మెల్యే సీతక్క తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా నాగజ్యోతి మాట్లాడుతూ మిషన్ కాకతీయ లో భాగంగా మండల వ్యాప్తంగా పలు చెరువులను కుంటలను కుంట కట్టలను చెరువు తూములను బాగు చేసుకోవడం జరిగిందన్నారు. పెద్ద చెరువులే కాకుండా చిన్న చిన్న చెరువులు కుంటలకు ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యతను ఇచ్చి అభివృద్ధి పరిచిందని అన్నారు. చిన్న సన్న కారు మధ్యతరగతి రైతులు చెరువులు కుంటల ద్వారా పంటలు పండించుకుని అభివృద్ధి చెందడం అందరము హర్షించతగిన విషయమని అన్నారు. ప్రజా ప్రతినిధులు అందరూ రైతులను పేరుపేరునా పలకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం నీటిపారుదల శాఖ డిఈసిహెచ్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే సీతక్కను శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో గాంధీనగర్ సర్పంచ్ భూక్య సుక్య, లక్ష్మీపురం సర్పంచ్ లావుడియ స్వాతి వాఘా నాయక్, ములుగు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పోరిక గోవింద్ నాయక్, ఎంపీపీ సూడి శ్రీనివాసరెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ పన్నాల ఎల్లారెడ్డి, ఎంపీటీసీలు ఉపసర్పంచులు, వార్డు సభ్యులు, రైతులు , సింగిల్ విండో డైరెక్టర్లు, నీటిపారుదల శాఖ ఏఈలు ఉపేందర్ రెడ్డి, క్రాంతి, హర్షద్, వర్క్ ఇన్స్పెక్టర్లు జగన్ పాపారావు
తదితరులు పాల్గొన్నారు.

Spread the love