– అందరూ సహకరించాలని ప్రధాని పిలుపు
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలకు ముందు బీజేపీకి ‘పార్టీ ఫండ్’ గా రూ. 2,000 విరాళం అందించారు ప్రధాని మోడీ. ఇందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన అన్నారు. నమో యాప్ ద్వారా ‘డోనేషన్ ఫర్ నేషన్ బిల్డింగ్’ ప్రచారంలో భాగస్వాములు కావాలని ‘ఎక్స్’ ద్వారా ప్రజలను ఆయన కోరారు.” బీజేపీ4ఇండియా(ఇది బీజేపీ సోషల్ మీడియా ఖాతా పేరు) కి సహకరించటం, వికసిత్ భారత్ నిర్మాణానికి మా ప్రయత్నాలను బలోపేతం చేయటం నాకు సంతోషంగా ఉన్నది. నమోయాప్ ద్వారా ‘డోనేషన్ ఫర్ నేషన్ బిల్డింగ్’లో భాగస్వాములు కావాలని నేను ప్రతి ఒక్కరినీ కోరుతున్నాను!” అని పార్టీకి తన విరాళాల రశీదుతో పాటుగా మోడీ ట్వీట్ చేశారు. బీజేపీ విరాళాల ప్రచారాన్ని మార్చి 1న బీజేపీ జాతీయాధ్యక్షుడు జె.పి నడ్డా ప్రారంభించారు. అప్పుడు ఆయన పార్టీకి రూ.1,000 విరాళం అందించారు.ఏటికేడు బీజేపీకి అందే విరాళాలు వందల కోట్లల్లోనే ఉంటున్నాయి. ముఖ్యంగా, 2022-2023 ఆర్థిక సంవత్సరంలో ఆ పార్టీకి రూ. 719 కోట్ల నిధులు అందాయి. ఇది అంతకముందు ఏడాదితో పోలిస్తే 17 శాతం వృద్ధిని సాధించిందని ఎన్నికల కమిషన్ డేటా వెల్లడించింది. 2021-2022లో కాషాయ పార్టీకి రూ. 614 కోట్ల విరాళాలు అందాయి.
ఎలక్టోరల్ బాండ్‌లపై కోర్టు నిషేధం.. విరాళాల సేకరణ ప్రారంభించిన బీజేపీ
ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌కు విరాళాలు 2021-2022 ఆర్థిక సంవత్సరంలో రూ. 95.4 కోట్ల నుంచి 2022-2023 ఆర్థిక సంవత్సరంలో రూ. 79 కోట్లకు తగ్గాయి. రాజకీయ పార్టీలకు అనామక నిధులను అనుమతించే బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎలక్టోరల్ బాండ్‌లను సుప్రీంకోర్టు నిషేధించిన కొన్ని రోజుల తర్వాతే అధికార పార్టీ విరాళాల ప్రచారం ప్రారంభించటం గమనార్హం. బీజేపీ మొత్తం ఆదాయంలో సగానికిపైగా ఎలక్టోరల్ బాండ్లు ఉన్నాయి.