మోడీ మార్క్‌ క్విడ్‌ప్రోకో

Modi Mark Quid pro quo– దాడులు చేయించారు… విరాళాలు దండుకున్నారు
– బాండ్ల కొనుగోలులో నీకది.. నాకిది అన్నట్టు డీల్‌
– ఎస్‌బీఐ తీరు దారుణం ..
అయోధ్యలో బాల రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ రామరాజ్యం గురించి ప్రస్తావించారు. అయితే మోడీ చెబుతున్న రామరాజ్యంలో ఎన్నికల బాండ్ల పథకాన్ని రాజ్యాంగ విరుద్ధమైనదిగా సుప్రీంకోర్టు ప్రకటించింది. కార్పొరేట్‌ సంస్థలు, ఇతర వనరుల ద్వారా రాజకీయ పార్టీలకు ఎంత మొత్తంలో విరాళాలు అందుతున్నాయో తెలుసుకునే ప్రాథమిక హక్కు ఓటర్లకు ఉన్నదని, ఈ పథకం ఆ హక్కును ఉల్లంఘిస్తోందని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. రాజకీయ పార్టీలకు విరాళాలు అందించడానికి ఎన్నికల బాండ్లు కొనుగోలు చేసిన కంపెనీల వివరాలు ఇప్పుడు ఎన్నికల కమిషన్‌ వద్ద అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ సమాచారం రాజకీయాలకు, ఎన్నికల ప్రక్రియకు అంటిన మకిలిని చాటిచెబుతోంది. ఇలాంటి పరిణామం ఈ దేశ చరిత్రలో ఎన్నడూ చూడనిది కావడం గమనార్హం.
న్యూఢిల్లీ : సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఎన్నికల బాండ్లకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఎస్‌బీఐ ఇవ్వలేకపోతోంది. దీనిని బట్టి దేశంలో అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్‌ అయిన ఎస్‌బీఐ మోడీ ప్రభుత్వం చెప్పినట్లు చేస్తోందని దాని చర్యల ద్వారా అర్థమవుతోంది. బాండ్ల పూర్తి సమాచారాన్ని బహిర్గతం చేయడం ఆ బ్యాంకుకు ఏ మాత్రం ఇష్టం లేదు. ఓటర్లకు ఉన్న సమాచార హక్కును ఇది ఉల్లంఘిస్తోంది. ఎస్‌బీఐ పాటిస్తున్న గోప్యత దేశంలో స్వేచ్ఛగా, నిస్పక్షపాతంగా ఎన్నికల నిర్వహించడానికి విఘాతం కలిగిస్తోంది. దీంతో అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పందించి బాండ్ల యూనిక్‌ నెంబర్లు సహా అన్ని వివరాలూ ఇవ్వాల్సిందేనని తాజాగా ఆదేశాలు జారీ చేయాల్సి వచ్చింది.
ఫ్యూచర్‌ గేమింగ్‌, మేఘా కొనుగోళ్లు
కొన్ని వందల కోట్ల లాభాన్ని ఆర్జించిన ఫ్యూచర్‌ గేమింగ్‌ అండ్‌ హోటల్‌ సర్వీసెస్‌ కంపెనీపై మోడీ హయంలో పలు దర్యాప్తు సంస్థలు దాడులు చేశాయి. ఈ కంపెనీ రూ.1,368 కోట్ల విలువ కలిగిన బాండ్లను కొనుగోలు చేసింది. ఏ ఒక్క సంస్థ ఇంత పెద్ద మొత్తంలో ఎన్నికల బాండ్లను కొనలేదు. ఈ కంపెనీ ఆస్తులు, అది కొనుగోలు చేసిన బాండ్ల విలువను విశ్లేషిస్తే క్విడ్‌ప్రోకో జరిగిందని స్పష్టమవుతోంది. ఎన్నికల బాండ్ల ద్వారా కార్పొరేట్‌ సంస్థలు, పాలకుల మధ్య ఏర్పడిన సంబంధాలు కూడా బట్టబయలయ్యాయి. మేఘా ఇంజినీరింగ్‌ అనే మరో కంపెనీ రూ.1,200 కోట్ల విలువైన బాండ్లను కొనుగోలు చేసింది. దేశాభివృద్ధిలో ఈ కంపెనీ నిర్వహిస్తున్న పాత్రను కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ ప్రశంసించారు కూడా. ఈడీ దాడుల తర్వాతే ఈ కంపెనీ బాండ్లను కొనుగోలు చేసింది. 2019 అక్టోబరులో మేఘాపై ఐటీ అధికారులు దాడులు చేశారు. ఆ తర్వాత అది బాండ్ల కొనుగోలుపై పెద్ద మొత్తంలో ఖర్చు చేసింది. ప్రతిఫలంగా కేంద్రంలోని బీజేపీ, తెలంగాణలోని బీఆర్‌ఎస్‌ ప్రభుత్వల నుండి అనేక ప్రాజెక్టుల కాంట్రాక్టులు పొందింది.
లాభాల కంటే అనేక రెట్ల ఖర్చు
పలు కంపెనీలు తాము పొందిన లాభాల కంటే పది నుండి వంద రెట్లు అధికంగా డబ్బు ఖర్చు చేసి బాండ్లు కొనుగోలు చేయడం గమనార్హం. కొన్ని కంపెనీలు తాము పొందిన దాని కంటే ఎక్కువ సొమ్మే ఖర్చు చేసి ఉండవచ్చు. లేదా బడా కార్పొరేట్‌ సంస్థలు రాజకీయ పార్టీలకు విరాళాలు అందించడానికి వాటిని వాడుకొని ఉండవచ్చు.
పలు సంస్థలు వ్యతిరేకించినా…
వాస్తవానికి బాండ్ల పథకాన్ని ఎన్నికల కమిషన్‌, ఆర్‌బీఐ, ఆర్థిక శాఖకు చెందిన కొందరు అధికారులు వ్యతిరేకించారు. అయితే దీనిని పరిగణనలోకి తీసుకోకుండా కేంద్ర ప్రభుత్వం చట్టాన్ని తీసుకొచ్చింది. లోక్‌సభలో తనకున్న మెజారిటీని ఆసరాగా చేసుకొని మోడీ ప్రభుత్వం పలు సంస్థల అభిప్రాయాలను బేఖాతరు చేసింది.
సంప్రదింపుల ప్రక్రియకు తిలోదకాలు ఇచ్చింది. కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులు ఎదుర్కొన్న 30 కంపెనీలు అధికార బీజేపీకి ఏ విధంగా నజరానాలు సమర్పించుకున్నదీ న్యూస్‌ మినిట్‌ అనే పోర్టల్‌ బయటపెట్టింది. ఇది దోపిడీ మినహా మరొకటి కాదు. స్వాతంత్య్రానంతరం ఇలా ఎన్నడూ జరగలేదు.
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఎస్‌బీఐ ఇలాంటి చర్యలకు పూనుకోవడం దారుణం. ఇది మన ప్రజాస్వామ్యానికి వినాశనకరం. అనేక కంపెనీలు ఈడీ లేదా ఇతర దర్యాప్తు సంస్థల దాడుల తర్వాతే ఈ ఎన్నికలబాండ్లు కొనుగోలు చేయడం ఈ పథకం గుట్టును రట్టు చేస్తోంది. అయితే ఎన్నికల ప్రక్రియలో స్వచ్ఛతను, సమగ్రతను పునరుద్ధరించేందుకు సుప్రీంకోర్టు వేగవంతంగా స్పందించడం స్వాగతించదగిన విషయం.
– ఎస్‌.ఎన్‌. సాహూ
మాజీ రాష్ట్రపతి కేఆర్‌ నారాయణన్‌ వద్ద ఓఎస్డీగా పనిచేసిన సీనియర్‌ అధికారి

Spread the love