నీట్‌ లీకేజీపై మోడీ స్పందించాలి

నీట్‌ లీకేజీపై మోడీ స్పందించాలి– విద్యార్థి, యువజన సంఘాల ఐక్య కార్యాచరణ సమితి
– కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఇంటి ముట్టడికి యత్నం
– విద్యార్థి నాయకులను అరెస్టు చేసిన పోలీసులు
నవతెలంగాణ-అంబర్‌పేట
‘పరీక్షా పే చర్చ’ నిర్వహించే ప్రధాని మోడీ.. నీట్‌ పేపర్‌ లీక్‌ వ్యవహారంపై మాట్లాడకపోవడం సిగ్గు చేటని, వెంటనే స్పందించాలని విద్యార్థి, యువజన సంఘాల ఐక్య కార్యాచరణ సమితి డిమాండ్‌ చేసింది. శుక్రవారం విద్యార్థి, యువజన సంఘాల ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో హైదరాబాద్‌ బర్కత్‌పురాలోని కేంద్ర మంత్రి జి.కిషన్‌ రెడ్డి ఇంటిని ముట్టడించేందుకు యత్నించారు. పోలీసులు భారీగా అక్కడకు చేరుకుని నేతలను కిషన్‌రెడ్డి ఇంటివైపు వెళ్లకుండా బర్కత్‌పురాలో అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు విద్యార్థి, యువజన నాయకులకు మధ్య తోపులాట జరిగింది. దాంతో కొద్ది సేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. అనంతరం విద్యార్థి, యువజన నేతలను అరెస్టు చేసి కాచిగూడ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా ఎన్‌ఎస్‌యూఐ హైదరాబాద్‌ నగర అధ్యక్షుడు అభిజిత్‌ మాట్లాడుతూ.. నీట్‌ సమస్యపై చర్చించేందుకు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అపాయింట్‌మెంట్‌ కోరితే ఇవ్వలేదని, అందుకే ఈ కార్యక్రమం చేపట్టినట్టు తెలిపారు. నీట్‌ పరీక్షలో అవకతవకలు జరిగాయని రుజువైనా పరీక్షతో పాటు, ఎన్టీఏను రద్దు చేయకుండా ప్రధాని మోడీ మౌనంగా ఉండటం దురదృష్టకరమన్నారు. నీట్‌పై ప్రధాని తీరును చూస్తుంటే లీకేజీల వెనుక కేంద్ర ప్రభుత్వం, మోడీ హస్తం ఉందని అనుమానం కలుగుతోందన్నారు. నీట్‌ పరీక్షను, ఎన్టీఏను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. పేపర్‌ లీక్‌ వ్యవహారంపై సమగ్ర విచారణ చేపట్టాలని, కేంద్రం స్పందించకపోతే ఉద్యమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. విద్యార్థుల జీవితాలతో చెలగాట మాడితే మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించే దిశగా ఉద్యమాలు కొనసాగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రితీష్‌రావు నాయకులు, శ్రీకర్‌, ఎస్‌ఎఫ్‌ఐ హైదరాబాద్‌ జిల్లా అధ్యక్షులు లెనిన్‌ చెగువేరా, పీవైఎల్‌, విజేఎస్‌ సంఘాల నేతలు పాల్గొన్నారు.

Spread the love