మోడీ పేరు ఏకగ్రీవం

మోడీ పేరు ఏకగ్రీవం– ఎన్డీఏ భేటీలో నిర్ణయం
– రాష్ట్రపతిని కలిసిన ఎన్డీఏ నేతలు
న్యూడిల్లీ : కేంద్రంలో బీజేపీ సారథ్యంలో ప్రభుత్వం ఏర్పాటుకు ఎన్డీఏ కూటమి ఏకగ్రీవ నిర్ణయం తీసుకుంది. ఎన్డీఏ నేతగా నరేంద్ర మోడీ పేరుకు మద్దతు ప్రకటించింది. ప్రభుత్వం ఏర్పాటు, అనుసరించాల్సిన వ్యూహంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నివాసంలో సుమారు గంటన్నర పాటు జరిగిన ఎన్డీఏ కీలక సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు లేఖలను కూటమి కీలక భాగస్వాములుగా ఉన్న టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు, జేడీయూ నేత నితీశ్‌కుమార్‌ అందజేశారు. సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు అమిత్‌ షా, రాజ్‌నాథ్‌సింగ్‌తో పాటు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల నేతలు ఎన్‌. చంద్రబాబు నాయుడు (టీడీపీ), పవన్‌ కళ్యాణ్‌ (జనసేన), నితీశ్‌కుమార్‌ (జేడీయూ), ఏక్‌నాథ్‌ షిండే (శివసేన), కుమార స్వామి (జేడీఎస్‌), చిరాగ్‌ పాశ్వాన్‌ (ఎల్‌ జేపీ), జయంత్‌ చౌదరి (ఆర్‌ఎల్డీ), అనుప్రియ పటేల్‌ (అప్నాదళ్‌), మాంఝే (హెచ్‌ఎఎం), ప్రఫుల్‌ పటేల్‌ (ఎన్సీపీ అజిత్‌ పవర్‌) తదితరులు పాల్గొన్నారు.
మోడీకి చంద్రబాబు, ఇతర నేతల అభినందనలు
ప్రధాని మోడీ ఆధ్వర్యంలో భారతదేశం సాధించిన ప్రగతికి ఎన్డీఏ నేతలందరూ అభినందనలు తెలిపారు. దేశ నిర్మాణంలో ప్రధాని మోడీ కృషిని వారు ప్రశంసించారు. వికసిత్‌ భారత్‌పై ప్రధాని మోడీకి స్పష్టమైన విజన్‌ ఉందని ఎన్డీఏ భాగస్వాములు తెలిపారు. ప్రపంచ దేశాల్లో భారతదేశం గర్వించేలా చేయడంలో ప్రధాని మోడీ పాత్రను కొనియాడారు. పేదరిక నిర్మూలనకు ప్రధాని మోడీ చేస్తున్న కృషిని ఎన్డీఏ నేతలు అభినందించారు. మంచి పనిని కొనసాగిస్తామని ప్రతిజ్ఞ చేశారు. భారత్‌లో వరుసగా మూడో ప్రభుత్వానికి ఇది చారిత్రాత్మకమైన ఆదేశం అని ప్రధాని మోడీ అన్నారు.
17వ లోక్‌సభను రద్దు చేసిన రాష్ట్రపతి
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 17వ లోక్‌సభను రద్దు చేశారు. ప్రస్తుత లోక్‌సభను రద్దు చేయాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని కేంద్ర క్యాబినెట్‌ బుధవారం ఉదయం సిఫార్సు చేసింది. ఆ వెంటనే మోడీ తన రాజీనామాతో పాటు మంత్రివర్గ రాజీనామా పత్రాలతో రాష్ట్రపతిని నేరుగా కలిసి సమర్పించారు. రాష్ట్రపతి వెంటనే ఆమోదం తెలుపుతూ, కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసేంత వరకూ ఆపద్ధర్మ ప్రధానిగా కొనసాగాలని మోడీని కోరారు.
అనంతరం కొద్ది గంటలకే 17వ లోక్‌సభ రద్దయినట్టు రాష్ట్రపతి భవన్‌ నుంచి ఒక ప్రకటన వెలువడింది. ”జూన్‌ 5న కేంద్ర మంత్రివర్గం చేసిన సిఫార్సు మేరకు రాజ్యాంగంలోని 85వ నిబంధన సబ్‌-క్లాజ్‌ (2) కింద నాకు సంక్రమించిన అధికారాలను వినియోగించుకుంటూ 17వ లోక్‌సభను రద్దు చేస్తున్నాను” అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు.

Spread the love