– బీజేపీ దాని సహచర రాజకీయ పార్టీలను ఓడించాలి
– విప్లవశక్తులను, ప్రజాస్వామిక శక్తులను గెలిపించాలి: కేంద్ర కమిటీ సభ్యులు చిట్టిపాటి
నవతెలంగాణ-ఇల్లందు
సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ చంద్రన్న, మధు గ్రూపుల రెండు పార్టీల నుంచి.. మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా మోకాళ్ళ మురళీకృష్ణ పోటీ చేస్తున్నాడని, ఆయన విజయానికి రెండు పార్టీల కార్యకర్తలు కృషి చేయాలని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ కేంద్ర కమిటీ సభ్యులు చిట్టిపాటి వెంకటేశ్వర్లు, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఆవునూరి మధు, రాష్ట్ర సహాయ కార్యదర్శి సాదినేని వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పార్టీ కార్యాలయంలో గౌని ఐలయ్య అధ్యక్షతన రెండు పార్టీల కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దేశంలో ప్రధాని మోడీ.. హిందూత్వ ఫాసిస్టు విధానాలకు పాల్పడుతున్నారని, పౌరహక్కులను హరించివేస్తున్నారని విమర్శించారు. పరిశ్రమలను, ఖనిజ సంపద, వనరులను, అడవులు, భూములను, కార్పొరేట్ సంస్థలకు కట్టబెడుతున్నారని ఆరోపించారు. బీజేపీ దాని సహచర రాజకీయ పార్టీలను ఓడించాలని, విప్లవశక్తులను, ప్రజాస్వామిక శక్తులను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో రెండు న్యూడెమోక్రసీ పార్టీల నాయకులు జే.సీతారామయ్య, తుపాకుల నాగేశ్వరరావు, ఎండి రాసుద్దీన్, కే.సారంగపాణి, యదళ్లపల్లి సత్యం, ఎల్.విశ్వనాథం, కోలా లక్ష్మీనారాయణ, మోకాళ్ల రమేష్, సంగయ్య, వెంకన్న, ఉమ తదితరులు పాల్గొన్నారు.