ఖమ్మంలో ఐటీడీఏ ఏర్పాటు కోసం ఉద్యమం

– తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీరామ్‌ నాయక్‌
– 16 గిరిజన సంఘాలతో ఖమ్మం ఐటీడీఏ సాధన కమిటీ ఏర్పాటు
నవతెలంగాణ-ఖమ్మం
ఉమ్మడి ఖమ్మం జిల్లా విభజన తర్వాత ఖమ్మం జిల్లాలో ఐటీడీఏ ఏర్పాటు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని, ఇప్పటికైనా ఏర్పాటు చేయాలని తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌.శ్రీరామ్‌ నాయక్‌ డిమాండ్‌ చేశారు. ఖమ్మం జిల్లాలో ఐటీడీఏ ఏర్పాటు కోరుతూ తెలంగాణ గిరిజన సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం ఖమ్మంలోని బంజారా భవన్‌లో భూక్య వీరభద్రం అధ్యక్షతన జరిగిన గిరిజన సంఘాల రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. జిల్లాల విభజన తర్వాత కొత్త జిల్లాల్లో ఐటీడీఏలను ఏర్పాటు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.
గిరిజనులు గణనీయంగా ఉన్న మైదాన ప్రాంత జిల్లాల్లో ప్రత్యేక ఐటీడీఏలను ఏర్పాటు చేస్తామని, ఎన్నికల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చి ఇంతవరకు నెరవేర్చలేదన్నారు. గిరిజనులకు రాజ్యాంగం కల్పించిన హక్కులను సైతం రాష్ట్ర ప్రభుత్వం కాలరాస్తుందని అన్నారు. గిరిజనులు గణనీయంగా ఉండి, ఐదో షెడ్యూల్‌ ప్రాంత మండలాలున్న ఖమ్మం జిల్లాలో ఇంతవరకు ఐటీడీఏ ఏర్పాటు చేయకపోవడంతో గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజనుల అభివృద్ధి, సంక్షేమం, విద్య, ఉపాధి, రుణాలు వంటి సమస్యలపై సుదూర ప్రాంతంలో ఉన్న భద్రాచలం ఐటీడీఏకు వెళ్ళవలసి వస్తోందన్నారు.
సంఘం ఖమ్మం జిల్లా కార్యదర్శి భూక్య వీరభద్రం మాట్లాడుతూ.. జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో 140 తండాలు, గూడాలు ఉండగా మిగిలిన మైదాన ప్రాంతంలో 176 తండాలు ఉన్నాయని, జిల్లాలో మూడు లక్షల మందికి పైగా గిరిజనులు నివసిస్తున్నారని తెలిపారు. ఇంతటి ప్రాధాన్యత కలిగిన ఖమ్మం జిల్లాలో ఐటీడీఏ ఏర్పాటు చేయకపోవడంతో గిరిజనులకు పరిపాలన పరమైన సమస్యలతో పాటు సంక్షేమ అభివృద్ధి అందటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ఐటీడీఏ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, లేకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఐటీడీఏ సాధన కమిటీని ఎనుకున్నారు. సమావేశంలో ఆల్‌ ఇండియా బంజారా సేవా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు దారవత్‌ రాంమూర్తి నాయక్‌, సేవాలాల్‌ సేన రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు బానోతు కిషన్‌ నాయక్‌, తెలంగాణ గిరిజన సమైక్య జిల్లా ప్రధాన కార్యదర్శి బోడ వీరన్న నాయక్‌, ఆల్‌ ఇండియా బంజారా సేవా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బానోతు బస్కినాయక్‌, గిరిజన సంఘం జిల్లా నాయకులు భూక్య కృష్ణ నాయక్‌, మూడు గన్యా నాయక్‌, గుగులోత్‌ కుమార్‌ నాయక్‌, బాధావత్‌ శ్రీనివాస్‌ నాయక్‌, భూక్య రమేష్‌, జ్యోతి భూక్య బాలాజీ, అజ్మీరా కిషన్‌ నాయక్‌ పాల్గొన్నారు.

Spread the love