నైపుణ్యంతోనే సమర్థవంతమైన విధులు

– యువత ఆశలు సఫలమయ్యేలా కార్యక్రమాలు : కౌశల్‌ మహోత్సవంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
నైపుణ్యంతోనే సమర్థవంతమైన విధులు నిర్వర్తించడం సాధ్యమవుతుందని కేంద్ర పర్యాటక, సాంస్కతిక, ఈశాన్య ప్రాంత అభివద్ధి శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. ఆదివారం సికింద్రాబాద్‌లో జరిగిన కౌశల్‌ మహౌత్సవంలో ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేశారు. ముగింపు కార్యక్రమం సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ వివిధ రంగాలలో పెరుగుతున్న అవకాశాలను భర్తీ చేయడానికి నైపుణ్యం కలిగిన మానవ వనరులు అవసరమని అన్నారు. అందుకోసం వివిధ రంగాలలో నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. యువత ఆశలు సఫలం అయ్యేలా చూడాలన్న లక్ష్యంతో ప్రముఖ సంస్థల సహకారంతో కౌశల్‌ మహౌత్సవం కార్యక్రమం ద్వారా ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. యువతకు ఉద్యోగాలు లభించేలా చూసేందుకు నేషనల్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ సహకారంతో కేంద్ర నైపుణ్యాభివద్ధి, వ్యవస్థాపక మంత్రిత్వ శాఖ భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యోగ మేళాలు నిర్వహిస్తుందన్నారు. నియామక పత్రాలు పొందిన వారిని అభినందించిన కేంద్ర మంత్రి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు చేరుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ఎన్‌ఎస్‌డిఐ, ఎన్‌ఐపీయూఎన్‌ఏ, ఎన్‌ఎస్టీఐ సిబ్బందిని, వాలంటీర్లను మంత్రి అభినందించారు. ఎన్‌ఎస్‌డీసీ జనరల్‌ మేనేజర్‌ పంగ్‌ఖురి బోర్గోహైన్‌ మాట్లాడుతూ సరైన ఉద్యోగాలు, అప్రెంటిస్‌షిప్‌ అవకాశాలు, కౌన్సెలింగ్‌ నిర్వహించి అభ్యర్థులు తమకు నచ్చిన రంగాన్ని ఎంచుకునేందుకు ఉద్యోగ మేళా నిర్వహించామని తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాల వివరాలు అందించి వాటి ద్వారా ప్రయోజనం పొందేలా చూసేందుకు, పీఎంకేవై, ఐటీ కోర్సులు తదితర అంశాలపై అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ఉద్యోగ మేళాకు దాదాపు 5000 మంది హాజరయ్యారని, 1500 ఉద్యోగాలు పొందారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్‌ఎస్టీఐ ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ప్రాంతీయ డైరెక్టర్‌ కె.శ్రీనివాసరావు, ఎన్‌ఎస్టీఐ చైర్మెన్‌ సూర్యరాజ్‌ కూడా పాల్గొన్నారు.

Spread the love