నవతెలంగాణ – నవీపేట్: నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో బోధన్ నుండే బిజెపి గెలుపుకు శ్రీకారం పడుతుందని నిజామాబాద్ పార్లమెంటు సభ్యులు ధర్మపురి అరవింద్ అన్నారు. మండల కేంద్రంలో బిజెపి జిల్లా కార్యవర్గ సమావేశాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో బిఆర్ఎస్, బిజెపి మధ్యనే ప్రధాన పోటీ ఉంటుందని అన్నారు. కాంగ్రెస్ కర్ణాటక గెలుపుతో సంకలు గుద్దుకుంటుందని దానివల్ల ఎటువంటి ప్రయోజనం ఉండబోదని అన్నారు. బోధన్, ఇందూరు ప్రాంతాలు దేశ విద్రోహశక్తులకు అడ్డాలుగా మారాయని అన్నారు. మే 30 నుండి జూన్ 30 వరకు బిజెపి ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి కార్యకర్త ఇంటింటికి తీసుకెళ్లాల ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని అన్నారు. బూత్ స్థాయి కార్యకర్త నుండి జిల్లా స్థాయి నాయకత్వం పనిచేస్తే గెలుపు బిజెపి పార్టీదేనని అన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని సూచించారు. కొన్ని మీడియా సంస్థలు బిఆర్ఎస్ పార్టీకి కీలుబొమ్మలాగా మారాయని ఈ విషయాన్ని గమనిస్తున్నామని అన్నారు.ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ఇన్చార్జి మీసాల చంద్రయ్య, పార్లమెంట్ ప్రబారి యెండల లక్ష్మీనారాయణ, జిల్లా అధ్యక్షులు బస్వ లక్ష్మి నారాయణ, ప్రధాన కార్యదర్శి పి లక్ష్మీనారాయణ,ధన్ పాల్ సూర్యనారాయణ, మోహన్ రెడ్డి, మేడిపాటి ప్రకాష్ రెడ్డి, దినేష్, వినయ్ రెడ్డి, ఏలేటి మల్లికార్జున్ రెడ్డి, సర్పంచ్ సరీన్, ఎంపీటీసీ రాధా,స్థానిక నాయకులు ఆనంద్, రామకృష్ణ, మువ్వ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.