నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించడాన్ని స్వాగతిస్తున్నామని బీఆర్ఎస్ సభ్యుడు ఎంఎస్ ప్రభాకర్‌రావు అన్నారు. అయితే ఈ పథకంతో ఆటో కార్మికులు రోడ్డున పడ్డారని ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం శాసనమండలిలో ప్రత్యేక ప్రస్తావన కింద అంశంపై ఆయన మాట్లాడారు. కొందరు ఆటో డ్రైవర్లు ఆత్మహత్యకు పాల్పడ్డారని గుర్తు చేశారు. వారి కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకో వాలని కోరారు. దళితబంధు అమలు చేస్తారా? లేదా? స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ర్యాగింగ్‌ను ఆరికట్టాలి : కవిత
రామగుండం మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ జరగడం అమానవీయమని బీఆర్ఎస్ సభ్యురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. మెడికల్, ఇంజినీరింగ్ కాలేజీల్లో ర్యాగింగ్ నిరోధక కమిటీలను పటిష్టం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ర్యాగింగ్‌ను నిరోధించడానికి రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎస్సీఈఆర్టీలో ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి ఈనెల తొమ్మిదిన నోటిఫికేషన్ ఇచ్చారని చెప్పారు. ఈనెల 12న గురుకుల ఉపాధ్యాయులూ దరఖాస్తు చేసుకోవచ్చంటూ రీనోటిఫికేషన్ ఇచ్చారని అన్నారు. పాఠశాల విద్యాశాఖలో పనిచేసే ఉపాధ్యాయులతోనే ఎస్సీఈఆర్టీలో డిప్యూటేషన్లు గతంలో ఇచ్చే వారని గుర్తు చేశారు. ప్రభుత్వం రీనోటిఫికేషన్ ఇవ్వడంతో గందరగోళం నెలకొందనీ, దానిపై దృష్టిసారించాలని సూచించారు.
గల్ఫ్ కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి : జీవన్‌రెడ్డి
రాష్ట్రంలో గల్ఫ్ కార్మికుల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ సభ్యుడు టి జీవన్‌రెడ్డి కోరారు.వారి కుటుంబ సభ్యుల కోసం వారు నెలకు రూ.వెయ్యి కోట్లు పంపిస్తున్నారనీ, ఇది దేశ, రాష్ట్ర ఆర్థిక ప్రగతికి దోహద పడుతుం దని గుర్తు చేశారు. ఏటా రూ.12 వేల కోట్లు విదేశాల నుంచి తెలంగాణకు వస్తున్నాయని అ న్నారు. అక్కడి నుంచి తిరిగొస్తే స్వయం ఉపాధి అవకాశాలను కల్పించాలని కోరారు. గల్ఫ్‌లో వారు ప్రమాదవశాత్తు చనిపోతే ఎక్స్‌గ్రేషియా రూ.ఐదు లక్షలు ప్రకటించాలని సూచించారు.
భద్రాచలంలో కరకట్ట నిర్మాణాన్ని పూర్తి చేయాలి : తాతా మధు
భద్రాచలంలో కరకట్ట నిర్మాణం అసంపూర్తి గా ఉందని బీఆర్ఎస్ సభ్యుడు తాతా మధు అన్నారు. వర్షాకాలం వస్తే అక్కడి ప్రజలు భయా ందోళనలకు గురవుతున్నారని చెప్పారు.
కరకట్ట నిర్మాణానికి గత ప్రభుత్వం రూ.38 కోట్లు కేటాయించిందని అన్నారు. వర్షాకాలం రాకముందే దాని నిర్మాణాన్ని పూర్తి చేయాలని కోరారు.