ఉన్నత విద్యకు దూరమవుతున్న ముస్లింలు

– యూపీలో మరింత దారుణం
– కేరళలో పరిస్థితి మెరుగు
న్యూఢిల్లీ : ఒకవైపు దేశంలోని ముస్లిం విద్యార్థుల్లో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న వారి సంఖ్య రోజురోజుకూ తగ్గుతున్నది. దేశ జనాభాలో ముస్లింలు 14శాతం ఉండగా వారిలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న వారి సంఖ్య కేవలం 4.6శాతం మాత్రమే ఉంది. 2020-21 సంవత్సరపు ఏఐఎస్‌హెచ్‌ఈ సర్వే ప్రకారం ఉన్నత విద్యా సంస్థల్లో చేరుతున్న ఎస్సీ విద్యార్థుల సంఖ్య 4.2శాతం, ఎస్టీ విద్యార్థుల సంఖ్య 11.9శాతం, ఓబీసీ విద్యార్థుల సంఖ్య 4శాతం పెరిగితే ముస్లిం విద్యార్థుల సంఖ్య 8శాతం తగ్గింది. ముస్లిం విద్యార్థులు ఎక్కువగా డిగ్రీ కోర్సుల్లో చేరడానికి బదులు ఏదో ఒక ఉద్యోగం వెతుక్కొని చేరిపోతున్నారు. రాష్ట్రాల వారీగా చూస్తే ఉత్తరప్రదేశ్‌లో ముస్లింల జనాభా 20శాతం. అయితే అక్కడ డిగ్రీ, ఆపై కోర్సుల్లో చేరుతున్న విద్యార్థుల సంఖ్య అత్యంత దారుణంగా 36శాతం తగ్గిపోయింది. ఈ తగ్గుదల జమ్మూకాశ్మీర్‌లో 26శాతం, మహారాష్ట్రలో 8.5శాతం, తమిళనాడులో 8.1శాతంగా ఉంది. 2020-21లో ఉత్తరప్రదేశ్‌లో కళాశాలల సంఖ్య పెరిగినప్పటికీ వాటిలో చేరిన ముస్లిం విద్యార్థుల సంఖ్య కేవలం 4.5% మాత్రమే. దేశ రాజధానిలో ప్రతి ఐదుగురు ముస్లిం విద్యార్థులలో ఒకరు ఉన్నత విద్యకు దూరమవుతున్నారు. ఈ రాష్ట్రాలన్నింటికీ భిన్నంగా కేరళలో 43శాతం మంది ముస్లిం విద్యార్థులు డిగ్రీ కాలేజీల్లో చేరారు. ఉన్నత విద్యా సంస్థలలో ముస్లిం అధ్యాపకుల కొరత కూడా అధికంగానే ఉంది. జాతీయ స్థాయిలో జనరల్‌ కేటగిరీ అధ్యాపకులు 56శాతం, ఓబీసీలు 36శాతం, ఎస్సీలు 9శాతం, ఎస్టీ అధ్యాపకులు 2.5శాతం ఉండగా ముస్లిం అధ్యాపకులు కేవలం 5.6శాతం మాత్రమే ఉన్నారు. దేశంలో ఓబీసీ తరగతులకు చెందిన విద్యార్థుల్లో 36శాతం మంది, ఎస్సీల్లో 14శాతం మంది ఉన్నత విద్యా సంస్థలలో చేరారు. అంటే ఈ రెండు తరగతులకు చెందిన విద్యార్థుల్లో 50శాతం మంది డిగ్రీ కోర్సులలో చేరారన్న మాట. ఉన్నత విద్యను అభ్యసిస్తున్న ముస్లిం విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతుంటే కర్నాటకలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు అక్కడి బీజేపీ ప్రభుత్వం ముస్లింలకు ఉన్న 4శాతం రిజర్వేషన్లను రద్దు చేయడం గమనార్హం.

Spread the love