నాడు పైప్‌ లైన్‌ నేడు డామ్‌ గండి

            గత పక్షం రోజులుగా జరుగుతున్న పరిణామాలను చూసినప్పుడు ఉక్రెయిన్‌ సంక్షోభం కొత్త మలుపు తిరిగినట్లే కనిపిస్తోంది. ఉక్రెయిన్‌ వైపు నుంచి సరిహద్దులో రష్యా ప్రాంతంపై జరుపుతున్న డ్రోన్‌, ఫిరంగి దాడులు కొనసాగుతున్నాయి. ఈక్రమంలోనే ఒక నదిపై ఉన్న డామ్‌కు పడిన గండి అనుమానాలను ధృవీకరించేదిగా ఉంది. దీని గురించి భద్రతా మండలి అత్యవసర సమావేశం జరిపి ఆందోళన వెల్లడించింది. వరద బాధితుల కోసం ఐరాస, రెడ్‌ క్రాస్‌ ముందుకు రాలేదని జెలెన్‌స్కీ ఆరోపించాడు. ఈ ఉదంతం మరో నోర్డ్‌స్ట్రీమ్‌ విద్రోహం అని కొందరు వర్ణించారు. పుతిన్‌ సేనల అదుపులో సగం, ఉక్రెయిన్‌ దళాల ఆధీనంలో మరో సగం ఉన్న ఖేర్సన్‌ నగరం, పరిసరాల్లో ఉన్న నోవా కఖోవా డామ్‌కు ఈనెల ఆరున పడిన గండి ఆ నగరంతో పాటు ఇతర ప్రాంతాలను ముంచెత్తింది. ఆరువందల చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో నీరు ప్రవేశించి వేలాది మంది నిర్వాసితులు కాగా పది మంది వరకు మరణించినట్లు వార్తలు. దేశంలోని అతి పెద్ద ఈ రిజర్వాయర్‌ నుంచి పద్దెనిమిది అడుగుల వరద పారింది. దీంతో ఉక్రెయిన్‌లోని అనేక ప్రాంతాలకు మంచి నీటి సరఫరా నిలిచిపోయింది. ఈ రిజర్వాయర్‌ నుంచే రష్యన్‌లు అదుపులో ఉన్న ఐరోపాలోని అతి పెద్దదైన జపోరిఝియా అణువిద్యుత్‌ కేంద్రంలోని విభాగాలను చల్లబరిచేందుకు అవసరమైన నీటి సరఫరా జరుగుతుంది. డామ్‌కు గండిపడటంతో ఇప్పుడు దాని భద్రతకు ముప్పు ఏర్పడినట్లు భావిస్తున్నారు. గండి దానంతట అదే పడిందా లేక ఎవరైనా కావాలని గండి కొట్టారా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఉక్రెయిన్‌ ఈ దుండగానికి పాల్పడి తమ మీద నెపం మోపేందుకు పూనుకుందని రష్యా చెబుతున్నది. కాదు తమ మీద దాడుల్లో భాగంగా పుతిన్‌ సేనలే గండి కొట్టినట్లు ఉక్రెయిన్‌ ఆరోపించింది. మొత్తం మీద రెండు దేశాల అదుపులో ఉన్న జనం ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడైనా గండ్లు పడితే అవి ఆకస్మికంగా జరగవు. కనుక ఇది విద్రోహం తప్ప మరొకటి కాదన్నది స్పష్టం. క్రిమియా వంతెన పేల్చివేతతో తమకు సంబంధం లేదని బుకాయించిన ఉక్రెయిన్‌ అనేక నెలల తరువాత తమ ప్రమేయంతోనే జరిగినట్లు అంగీకరించింది.
గతేడాది ఫిబ్రవరిలో మొదలైన రష్యా సైనిక చర్య 470రోజులో ప్రవేశించింది. ఎప్పుడేం జరుగుతుందో ఏ దళాలు ఏ రూపంలో విరుచుకుపడతాయో అన్నట్లుగా పరిస్థితి ఉండగా డామ్‌కు గండిపడింది. సరిగ్గా ఇది జరిగినప్పుడే అమెరికా పత్రిక వాషింగ్టన్‌ పోస్టు రాసిన ఒక కథనంలో గతేడాది రష్యా నుంచి ఐరోపా దేశాలకు గ్యాస్‌, చమురు సరఫరా చేసే నోర్డ్‌ స్ట్రీమ్‌ పైప్‌లైన్ల విధ్వంసం వెనుక ఉక్రెయిన్‌ హస్తం ఉందని పేర్కొన్నది. ఉక్రెయిన్‌ మిలిటరీ రూపొందించిన ఒక పథకం ప్రకారమే జరిగినట్లు అమెరికన్లు జర్మనీ, ఇతర ఐరోపా దేశాలకు తెలిపారని ఆ పత్రిక పేర్కొన్నది. నిజానికి వాస్తవాలు అమెరికన్లకు తెలియవంటే ఎవరూ నమ్మరు. వెల్లడి కాకూడనే లక్ష్యంతోనే పైప్‌లైన్ల విధ్వంసం గురించి దర్యాప్తు జరపాలని మార్చి నెలాఖరులో రష్యా భద్రతా మండలిలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని అమెరికా అడ్డుకుంది. ఒక స్వతంత్ర అంతర్జాతీయ దర్యాప్తు జరపాలని రష్యా, చైనా, బ్రెజిల్‌ ఓటు చేశాయి, అమెరికాతో సహా పన్నెండు దేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉండటంతో నిష్ఫలమైంది. చిత్రం ఏమిటంటే ఈ దేశాలలో కొన్ని పైప్‌లైన్‌ విద్రోహ చర్యను ఖండించాయి. నిజాల నిగ్గు తేల్చాలని బల్లగుద్ది మరీ వాదించాయి. ఐరాస తరఫున విచారణ జరపాలన్న డిమాండ్‌ దగ్గరకు వచ్చే సరికి తోక ముడిచాయి. స్వీడన్‌, డెన్మార్క్‌, జర్మనీ ఈ ఉదంతంపై ఇప్పటికే విచారణ జరుపుతున్నందున కొత్తగా ఐరాస జరపాల్సిన అవసరం లేదంటూ తరువాత ఐరాసతో పాటు అమెరికా విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఈ మూడు దేశాలు కూడా ఉక్రెయిన్‌ సంక్షోభంలో దాన్ని సమర్థిస్తూ రష్యాను వ్యతిరేకించేవే అన్నది గమనించాలి. ఈ పూర్వరంగంలో వాటితో పాటు ఐరాస విచారణ కూడా జరిగి వివరాలను వెల్లడిస్తే వాటికి సాధికారత ఉంటుంది, ఆమోదించటానికి ప్రపంచ దేశాలకు సులభం అవుతుంది. అయినా అమెరికా, ఇతర దేశాలకు అంత భయమెందుకు? ఐరాస విచారణను అడ్డుకోవటం అంటే దేన్నో దాచేందుకు లేదా దోషులను కాపాడేందుకు చూస్తున్నారన్న సందేహాలు తలెత్తుతున్నాయి. ఇది ద్వంద్వ ప్రమాణం తప్ప మరొకటి కాదు. పైప్‌లైన్‌ విచారణనే అడ్డుకున్న వారు డామ్‌ గండి విద్రోహం గురించి నిజాల నిగ్గుతేల్చేందుకు అంగీకరిస్తారా?

Spread the love