నవతెలంగాణ – కామారెడ్డి
తెలంగాణ రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ, హైదరాబాద్ ఆదేశాల మేరకు కామారెడ్డి జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి టి. నాగరాణి గురువారం కామారెడ్డి జిల్లా సబ్ జైలును సందర్శించారు. ఈ సందర్భంగా జైలులో ఖైదీలకు అందిస్తున్న ఉచిత న్యాయ సహాయ సేవలు, లీగల్ ఎయిడ్ క్లినిక్ పనితీరు, సంక్షేమ సదుపాయాలను పరిశీలించారు. అనంతరం ఖైదీలతో ముఖాముఖి సమావేశం నిర్వహించి వారి సమస్యలు, కేసుల పురోగతి గురించి తెలుసుకున్నారు. ఉచిత న్యాయ సహాయం పొందే హక్కు, న్యాయసేవాధికార సంస్థ ద్వారా అందించే సేవలు, బెయిల్, అప్పీలు, లోక్ అదాలత్, న్యాయ అవగాహన కార్యక్రమాలపై వారికి వివరించారు.
చట్టాల పట్ల ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాల్సిన అవసరాన్ని టి. నాగరాణి ఈ సందర్భంగా నొక్కిచెప్పారు. సాంఘిక కుల బహిష్కరణ వంటి చట్టవిరుద్ధ చర్యలు, దొంగతనాలు తదితర నేరాల వల్ల ఎదురయ్యే చట్టపరమైన పరిణామాలను వివరించారు. శిక్ష అనంతరం సన్మార్గంలో జీవిస్తూ నేరాలకు దూరంగా ఉండాలని, చట్టాలను గౌరవిస్తూ సమాజంలో గౌరవప్రదమైన జీవితం గడపాలని ఖైదీలకు సూచించారు.
అనంతరం జైలు వంటగది, పరిశుభ్రత, తాగునీటి సౌకర్యాలు, ఫిర్యాదు పెట్టెను తనిఖీ చేసి, ఖైదీల సంక్షేమానికి అవసరమైన చర్యలు చేపట్టాలని జైలు అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో చీఫ్ లీగల్ ఎయిడ్ కౌన్సెల్ మాయా సురేష్, డిప్యూటీ చీఫ్ లీగల్ ఎయిడ్ కౌన్సెల్ శ్రీనివాస్ రావు, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్ విట్టల్ రావు, జైలు సూపరింటెండెంట్ సీహెచ్. సంజీవ్ రెడ్డి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ, లీగల్ ఎయిడ్ సిబ్బంది, జైలు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.



