– రైతులను అడ్డుకున్న అటవీ శాఖ అధికారులు
నవతెలంగాణ- అచ్చంపేట
నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ నల్లమలలో పోడు వివాదం మళ్లీ రాజుకుంది. అటవీ శాఖ అధికారులు, పోడు రైతుల మధ్యన ఘర్షణ జరిగింది. కొన్నేండ్లుగా అక్కడ పోడు ఘర్షణ కొనసాగుతోంది. మండల పరిధిలోని మాధవానిపల్లి గ్రామానికి చెందిన కొంతమంది దళితులు తాటి చేలుక అడవి ప్రాంతంలో పోడు సాగు చేసేవారు. మూడేండ్లుగా అటవీశాఖ అధికారులు నిబంధనల పేరుతో వారిని సాగు చేయకుండా అడ్డంకులు సృష్టించారు. దాంతో ఆ పొలాల్లో ఎవరూ సాగు చేయలేదు. అయితే, ఇటీవల స్థానిక ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అటవీశాఖ అధికారులతో మాట్లాడి పోడు రైతులను సాగు చేసుకోనివ్వాలని చెప్పారు. దాంతో తాటిచెలక ప్రాంతంలో సాగు చేసేందుకు వెళ్లిన రైతులను బుధవారం అటవీశాఖ అధికారులు అడ్డుకున్నారు. తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది. అయితే తాటిచెలకలో ఎలాంటి సాగుకు అనుమతించేది లేదని అటవీశాఖ ఉన్నతాధికారులు తెగేసి చెప్పారు. అయినా.. ఇటీవల ఎమ్మెల్యే చెప్పారనే సమాచారంతో రైతులు సాగుకు సిద్ధపడటంతో అధికారులు అడ్డుకున్నారు. రాష్ట్రమంతా పట్టాలు ఇచ్చిన ప్రభుత్వం తమను విస్మరించడంపై రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.