మోడీ విధానాలపై ఏడు దశల్లో పోరాటాలు

– వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఓడించాలి
– సంక్షేమం, అభివృద్ధిలో కేరళ అగ్రస్థానం
– ఆగస్టు 26, 27వ తేదీల్లో దళిత సమస్యలపై జాతీయ ఉద్యమం : అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం సహాయ కార్యదర్శి ఎన్‌.చంద్రన్‌
నవతెలంగాణ-మిర్యాలగూడ
”కార్పొరేట్‌ శక్తులకు లాభాలు చేకూరుస్తూ పేద ప్రజలపై భారాలు మోపుతున్న బీజేపీని వచ్చే ఎన్నికల్లో ఓడించాలి. మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, కర్షక, ప్రజావ్యతిరేక విధానాలపై ప్రజలను చైతన్యం చేసేందుకు దేశ వ్యాప్తంగా ఏడు దశల్లో పోరాటాలు నిర్వహించబోతున్నాం..” అని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం సహాయ కార్యదర్శి ఎన్‌.చంద్రన్‌ అన్నారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని సీపీఐ(ఎం) కార్యాలయంలో గురువారం ఆ సంఘం ప్రతినిధుల బృందంతో కలిసి విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనెల 18, 19 తేదీల్లో నాగార్జునసాగర్‌లో అఖిలభారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ సమావేశాలు నిర్వహించామన్నారు. దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో సంఘం చేపట్టిన ఉద్యమాలపై సుదీర్ఘంగా చర్చించినట్టు తెలిపారు. సార్వత్రిక ఎన్నికల నాటికి గ్రామ గ్రామాన తిరిగి కేంద్రం చేపడుతున్న ప్రజావ్యతిరేక విధానాలను వివరించాలని, ప్రజలను చైతన్యపరిచేందుకు ఏడు దశల్లో ఉద్యమాలు చేయాలని సమావేశాల్లో నిర్ణయించామన్నారు.
గ్రామీణ ఉపాధి హామీచట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు మోడీ ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి ఏడాదీ బడ్జెట్‌లో ఈ చట్టానికి 30 శాతం నిధులను కోత విధిస్తోందన్నారు. ఉపాధి హామీ చట్టాన్ని బలోపేతం చేయాలని, గ్రామీణ ప్రాంత పేదలకు ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు. పని దినాలు పెంచడంతోపాటు ఉపాధి కూలి రేట్లను పెంచాలని కోరారు. ఇందుకు బడ్జెట్‌లో నిధులు పెంచి విడుదల చేయాలన్నారు.ఆగస్టు 26, 27వ తేదీల్లో దళిత సమస్యలపై జాతీయస్థాయిలో హైదరాబాద్‌ కేంద్రంగా పెద్ద ఉద్యమం చేపట్టబోతున్నట్టు తెలిపారు. దీనికి అన్ని రాష్ట్రాల నుంచి దళితులను పెద్దఎత్తున సమీకరిస్తామన్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థను బలోపేతం చేయాలని, పెంచిన పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలను తగ్గించి పేదలకు సబ్సిడీలు పెంచి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు సేవ్‌ ఇండియా పేరుతో ఆగస్టు 14న సాయంత్రం ఐదు గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు ఫ్రీడం విజిట్‌ పేరుతో దేశవ్యాప్త ఆందోళన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. కేరళలో పాఠశాలలకు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ ఏడాది 10 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారని తెలిపారు. కేరళ వామపక్ష ప్రభుత్వం 3.20 లక్షల మంది పేద కుటుంబాలకు సొంత ఇండ్లు నిర్మించి ఇచ్చినట్టు చెప్పారు. సుమారు మూడు లక్షల మంది పేదలకు ఇండ్ల స్థలాలు పంపిణీ చేసిందన్నారు. 1010 గ్రామపంచాయతీలు, 156 మున్సిపాలిటీలు, 40 జిల్లా పంచాయతీలకు అధికారాలు ఇచ్చి ప్రతి ఏడాదీ 40 శాతం నిధులను రాష్ట్ర బడ్జెట్‌ నుంచి కేటాయిస్తున్నట్టు తెలిపారు. గ్రామ, వార్డు స్థాయిలోనే సమావేశాలు నిర్వహించుకొని సమస్యలను పరిష్కరించుకుని అభివృద్ధి చేసుకునేలా అవకాశం కల్పించినట్టు తెలిపారు. మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ.. గ్రామీణ కూలీలకు కూలి రేట్లు పెంచాలని, కనీస వేతనం అమలు అయ్యేవిధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. రైతాంగ, కార్మిక సమస్యలపై భవిష్యత్‌లో ప్రజా ఉద్యమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో ఆ సంఘం జాతీయ సహాయ కార్యదర్శి నిర్మదసర్దాస్‌, ఉపాధ్యక్షులు కోమల కుమారి, కేంద్ర కమిటీ సభ్యులు దేవా దర్శనన్‌, రామకృష్ణ, హిమాన్సుదాస్‌, నారి ఐలయ్య, లలితాబాలన్‌, బాన్యటుడు, సుకుమార్‌ చక్రవర్తి, మింజనూరు రామన్‌, ఏడి గుంజ అర్చన్‌, సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్‌ మల్లేష్‌, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వీరపల్లి వెంకటేశ్వర్లు, నాయకులు భవాండ్ల పాండు, అవుతా సైదులు తదితరులు ఉన్నారు.

Spread the love