నవతెలంగాణ – తంగళ్ళపల్లి
ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఓ నేత కార్మికుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలంలో గురువారం జరిగింది. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పద్మానగర్ గ్రామానికి చెందిన నేత కార్మికుడు అంబటి సురేష్ (35)కి భార్య కీర్తన, ఇద్దరు కొడుకులు బానుష్(8)విఘ్నేశ్(5) ఉన్నారు. పవర్‌లూమ్ కార్మికునిగా పనిచేస్తే కూలీ తక్కువగా వస్తుందని, ఇలాగైతే ఇల్లు కోసం చేసిన అప్పులు ఎలా తీర్చేదని నిత్యం తన తల్లి, భార్య కీర్తనతో చెబుతూ మనస్తాపానికి గురయ్యే వాడు. కాగా మూడు రోజుల నుంచి సాంచల పనికి వెళ్లడం లేదని, వేరేచోట పని చూసుకుంటానని, గతంలో చేసిన టెక్స్‌టైల్ పార్కుకు వెళతానని భార్యకు చెప్పాడు. ఎప్పటిలాగే గురువారం కూడా ఉదయం ఇద్దరు కొడుకులను పాఠశాలకు పంపించి, తానూ పనికి వెళ్లగా ఇంట్లో ఎవరూ లేని సమయంలో తన భర్త ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్టు కీర్తన తెలిపింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పరిశీలించారు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.