నకిలీ విత్తనాలపై నజర్‌..!

– ప్రత్యేక బృందాలతో ఎరువుల దుకాణాల్లో తనిఖీలు నకిలీ విత్తనాలు, ఎరువులు అమ్మితే పీడీ యాక్ట్‌ కింద కేసులు
– ఇకనుంచి ఆన్‌లైన్‌లో క్రయవిక్రయాలు, స్టాక్‌వివరాల సమాచారం
– కొనుగోళ్లలో జాగ్రత్తగా ఉండాలని అధికారుల సూచన
– వానకాలం సీజన్‌కు ప్రభుత్వం పకడ్బందీ చర్యలు
          అన్నదాతలను నిండా ముంచుతున్న నకిలీ విత్తనాలు,ఎరువులపై టాస్క్‌ఫోర్స్‌, పోలీసులు, వ్యవసాయశాఖాధికారులు దృష్టిసారించారు. నిబంధనలు పాటించకుండా, అక్రమాలకు పాల్పడుతున్న కంపెనీలు, వ్యక్తులపై ఉక్కుపాదం మోపాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించడంతో వానకాలం సీజన్‌లో రైతులు నష్టపోకుండా చర్యలు తీసుకుంటున్నారు. జిల్లా, డివిజన్‌, మండల స్థాయిల్లో టాస్క్‌ఫోర్స్‌ కమిటీలను ఏర్పాటు చేసి దుకాణాలు, గోదాముల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. గతేడాది నల్లగొండ జిల్లాలో సీడ్‌ యాక్టు కింద 17 కేసులు నమోదు చేశారు. ప్రతి సీజన్‌లోనూ దాడులు నిర్వహిస్తున్నప్పటికీ కొంతమంది డీలర్లు అధిక డబ్బుకు ఆశపడి అమ్మకాలు చేస్తున్నారు. వీరికి అడ్డుకట్ట వేసేందుకు ఈ నెల 17 నుంచి డీలర్లందరూ క్రయవిక్రయాలు, స్టాక్‌ సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసినప్పుడు తప్పనిసరిగా రశీదు తీసుకోవాలని, ప్యాకెట్లపై ఎక్కడ తయారు చేశారు.. మొలక శాతం, జన్యు స్వచ్ఛత తదితర విషయాలను పరిశీలించాలని అధికారులు రైతులకు సూచిస్తున్నారు.
నవతెలంగాణ-నల్లగొండ
నకిలీ విత్తనాలు, ఎరువులపై ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌, వ్యవసాయశాఖ అధికారులు ప్రత్యేక నిఘా పెట్టారు. నకిలీ కేటుగాళ్లపై ఉక్కుపాదం మోపుతూ పీడీ యాక్ట్‌ కింద కేసులు నమోదు చేస్తున్నారు. రైతులను నకిలీ విత్తనాల బెడద నుంచి కాపాడేందుకు ఎరువుల దుకాణాలను తనిఖీ చేస్తున్నారు. విత్తన కంపెనీలు కొన్ని ఈ నిబంధనలు పాటించకుండా పుట్టగొడుగుల్లా మార్కెట్‌లోకి వస్తున్న నేపథ్యంలో విత్తనాల ప్యాకెట్లపై ఎక్కడ తయారు చేశారు..? ఎక్కడ ప్యాకింగ్‌ చేశారు.? ఎవరు మార్కెట్‌ చేస్తున్నారనే సమాచారంతో పాటు అందులో మొలక శాతం, జన్యు స్వచ్ఛత తదితర విషయాలపై ఆరా తీస్తున్నారు. ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేసే సమయంలో తప్పనిసరిగా రసీదు తీసుకోవాలని వ్యవసాయశాఖ అధికారులు పేర్కొంటున్నారు.
నకిలీ విత్తనాలు అరికట్టేందుకు చర్యలు..
జిల్లాలో వ్యవసాయశాఖ అధికారులు ఎరువుల దుకాణాలపై ఇప్పటికే తనిఖీలు నిర్వహిస్తున్నారు. నకిలీ విత్తనాలు అమ్మినట్టు తమ దృష్టికి వస్తే పీడీ యాక్ట్‌ కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరిస్తున్నారు. నల్లగొండ జిల్లాలో 34 మండలాలు ఉన్నాయి. నకిలీ విత్తనాలను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ఇప్పటికే అన్ని మండలాల వ్యవసాయ శాఖ అధికారులకు, పోలీస్‌ అధికారులకు ఉత్తర్వులు తయారు చేశారు . దీంతో పాటు మండలానికో టాస్క్‌ఫోర్స్‌ కమిటీని ఏర్పాటు చేశారు. కొత్తగా ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్‌ కమిటీలో తహసీల్దార్‌, ఎస్‌ఐ, వ్యవసాయ శాఖ అధికారులు ఉంటారు. రైతులు విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసే సమయంలో తప్పనిసరిగా రసీదు తీసుకోవాలని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. నష్టం వాటిల్లినప్పుడు రసీదు ఉంటేనే ప్రభుత్వం తరఫున సాయం అందే వీలుంటుందని, లేదంటే నకిలీ విత్తనాలతో నష్టపోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. కాగా, ఇటీవల జిల్లా బృందం పట్టణంలోని పలు దుకాణాల్లో తనిఖీలు నిర్వహించారు. అయితే బృందాలు వచ్చే విషయం నకిలీలకు ముందే తెలియడంతో ఆ రోజు షాపులు మూసి ఉంచారని సమాచారం. దీంతో అధికారులు అక్కడక్కడ నామమాత్రంగా తనిఖీలు నిర్వహించి వెళ్లారు.
జిల్లాలో దాడులతో కేసులు నమోదు…
నల్లగొండ జిల్లాలో మొత్తం 950 విత్తన డీలర్లు ఉన్నారు. అయితే, సీజన్‌లో రైతుల డిమాండ్‌కు అనుగుణంగా సకాలంలో విత్తనాలు రైతులకు అందజేయనున్నారు. దీనిని ఆసరాగా చేసుకుని దళారులు పత్తి విత్తనాలను విక్రయిస్తున్నారు. ముఖ్యంగా కర్ణాటక, ఆంధ్ర ప్రాంతానికి చెందిన దళారులు జిల్లాలోని దేవరకొండ, మిర్యాలగూడ, నాగార్జునసాగర్‌, నల్లగొండ, మునుగోడు, నియోజకవర్గాల్లో పర్యటిస్తూ నకిలీ విత్తనాలు విక్రయిస్తున్నారు. వ్యవసాయశాఖ, పోలీసు అధికారులు దాడులు చేస్తూ నకిలీ విత్తనాలు విక్రయిస్తున్న వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. గతేడాది నకి లీ విత్తన విక్రయిస్తున్న 17 మంది పై సీడ్‌యాక్టు 1966 కింద కేసులు నమోదు చేశారు. జిల్లాస్థాయి టాస్క్‌ఫోర్సు కమిటీ జిల్లాలోని 950 మంది డీలర్లపై నిఘా వేయటం, ఆకస్మిక దా డులు నిర్వహించి నకిలీ విత్తనాల విక్రయాలకు అడ్డుకట్ట వేయనున్నారు. డివిజన్‌స్థాయిలో ఏడీ ఏ, డీఎస్పీ ఆధ్వర్యంలో టాస్క్‌ఫోర్స్‌ పనిచేస్తుంది. అలా గే, మండలస్థాయిలో మండల వ్యవసాయ అధికారి, ఎస్‌ఐతో మండల స్థాయి టాస్క్‌ఫోర్సులను ఏర్పాటు చేశారు. ఈ టాస్క్‌ఫోర్సులు వానాకాలం సీజన్‌ ప్రారంభమైన వెంటనే తనిఖీలు, ఆకస్మిక దాడులు నిర్వహించి నకిలీ విత్తనాల విక్రయాలకు చెక్‌ పెట్టనున్నారు.
నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు
సుచరిత వ్యవసాయశాఖ జిల్లా అధికారి, నల్లగొండ
జిల్లాలో నకిలీ విత్తనాలు విక్రయించే దుకాణ యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటాం.
రైతులు విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసేటప్పుడు తప్పకుండా రసీదును తీసుకోవాలి.
జిల్లాలో నకిలీ విత్తనాలను సరఫరా చేస్తున్నట్టు మా దృష్టికి వస్తే వారిపై పీడీ యాక్ట్‌ ప్రయోగించడంతో పాటు కఠిన చర్యలు తీసుకుంటాం.
వానకాలం సీజన్‌కు ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచుతాం. రైతులకు ఇబ్బంది లేకుండా వ్యవసాయశాఖ చర్యలు తీసుకుంటుందన్నారు.
పటిష్టమైన నిఘా ఏర్పాటు చేశాం
కె.అపూర్వరావు, జిల్లా ఎస్పీ
ప్రభుత్వ ఆదేశాల మేరకు నకిలీ విత్తనాలపై పటిష్ట నిఘా పెడుతున్నాం. వ్యవసాయ శాఖతో కలిసి సంయుక్తంగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం.
క్షేత్రస్థాయి వరకు నిరంతర నిఘా కొనసాగుతోంది. అంధ్రా రాష్ట్రంతోపాటు మహబూబ్‌నగర్‌ జిల్లా సరిహద్దుల్లో ప్రత్యేక చెక్‌పోస్టులతో తనిఖీలు నిర్వహిస్తాం.
టాస్క్‌ఫోర్స్‌ బృందాలు నిరంతరం క్షేత్రస్థాయిలో రంగంలో ఉంటాయి. పాత నేరస్తులపైనా నిఘా పెట్టాం. బైండోవర్స్‌ కూడా చేస్తున్నాం. అవసరమైతే పీడీ యాక్ట్‌ ప్రయోగిస్తాం.
నకిలీ విత్తనాలను అరికట్టడమే లక్ష్యం.

Spread the love