నయాసాల్‌ జోష్‌

Nayasal Josh– రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా కొత్త సంవత్సరం వేడుకలు
– గవర్నర్‌కు ముఖ్యమంత్రి, మంత్రులు, స్పీకర్‌ శుభాకాంక్షలు
– సీఎంను కలిసిన మంత్రులు, అధికారులు, ఇతర ప్రముఖులు
– తెలంగాణ భవన్‌లో ఘనంగా వేడుకలు
– కేటీఆర్‌ను కలిసి బీఆర్‌ఎస్‌ నేతలు, కార్యకర్తలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
కొత్త సంవత్సర వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. 2023కు ప్రజలు వీడ్కోలు పలుకుతూ.. 2024కు స్వాగతం పలికారు. చిన్నా పెద్దా తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరు వేడుకల్లో పాల్గొన్నారు. హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో గవర్నర్‌ తమిళిసై సౌందర్య రాజన్‌ను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కలిసి శుభాకాంక్షలు తెలిపారు. సీఎంతో పాటు శాసన సభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌, మంత్రులు సీతక్క, కొండ సురేఖ గవర్నర్‌ను కలిశారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పార్థసారధి, ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు, ఇతర ప్రముఖులు గవర్నర్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. రాజ్‌భవన్‌లో జరిగిన ఓపెన్‌ హౌస్‌ కార్యక్రమానికి భారీగా జనం తరలి వచ్చారు. గవర్నర్‌ అందరిని కలిసి వారితో ఫోటోలు దిగారు. ఎంసీహెచ్‌ఆర్‌డీలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలోక్‌ అరాదేను సీఎంతో పాటు మంత్రులు శ్రీధర్‌ బాబు, పొన్నం ప్రభాకర్‌లు కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఏడాదిని పురస్కరించుకుని సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని పలుపురు మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఐఏఎస్‌, ఏపీఎస్‌ అధికారులు కలిసారు. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, అటవీశాఖ మంత్రి కొండ సురేఖ, పంచాయతి రాజ్‌ శాఖ మంత్రి సీతక్క, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సీఎంను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. యాదాద్రి ఆలయ అర్చకుల బృందం ముఖ్యమంత్రిని కలిసి ఆశీర్వదించారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని సీనియర్‌ ఐఎఎస్‌ అధికారులు శైలజా రామయ్యర్‌, క్రిస్టినా జెడ్‌ చాంగ్‌, హౌం శాఖ ముఖ్య కార్యదర్శి జితెందర్‌ తదితరలు సీఎస్‌ కలిశారు.. తెలంగాణ భవన్‌లో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారక రామారావుకు మాజీమంత్రి, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, హైదరాబాద్‌ మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పారిశుద్య కార్మికులతో కలిసి కేటీఆర్‌ సహ పంక్తి భోజనం చేశారు. గాంధీభవన్‌లో జరిగిన వేడుకల్లో పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని ఒకరికొకరు అభినందనలు తెలుపుకున్నారు.

Spread the love