నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో 25 ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లోని పలు కోర్సులకు నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడిటేషన్ (ఎన్‌బీఏ) గుర్తింపు లభించింది. మరో నాలుగు కాలేజీల్లో ఎన్‌బీఏ నిపుణుల కమిటీ తనిఖీలు నిర్వహించింది. గుర్తింపు ప్రక్రియ పురోగతిలో ఉన్నది. ఈ మేరకు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్, జాయింట్ డైరెక్టర్ సి శ్రీనాథ్ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో 25 ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలకు ఎన్‌బీఏ గుర్తింపు రావడం శుభ పరిణామమని వివరించారు. ఈ కాలేజీల్లో మౌలిక వసతులు మెరుగ్గా ఉండడంతోపాటు విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందనడానికి ఇదే నిదర్శనమని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా అధిక నిధులు పొందడానికి దోహదపడుతుందని వివరించారు. అయితే ఒక్కో కాలేజీలో ఒక్కో రకమైన కోర్సులకు ఎన్‌బీఏ గుర్తింపు వచ్చిందని వివరిం చారు. మెకానికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ (ఈఈఈ), కంప్యూటర్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ వీడియో ఇంజినీరింగ్, ఆటో మొబైల్ ఇంజినీరింగ్, సివిల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్, మైనింగ్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ వంటి కోర్సులకు ఎన్‌బీఏ గుర్తింపు వచ్చిందని పేర్కొన్నారు.