నెలరోజుల్లోనే ఎన్‌డీఎస్‌ఏ ప్రాథమిక నివేదిక ?

నెలరోజుల్లోనే ఎన్‌డీఎస్‌ఏ ప్రాథమిక నివేదిక ?– మరోసారి డిజైన్‌, నిర్మాణాల పరిశీలన
– నేడు నిపుణుల కమిటీ రాక
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
జాతీయ డ్యామ్‌ భద్రతా సంస్థ(ఎన్‌డీఎస్‌ఏ) నియమించిన నిపుణుల కమిటీ కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యంపై నెలరోజుల్లోనే ప్రాథమిక నివేదికను ఇచ్చే ప్రయత్నాల్లో ఉంది. ఈమేరకు అధ్యయనాన్ని వేగిరం చేసింది. పరిపాలన అంశాలతోపాటు నిర్మాణ విషయాలపై మరింత అవగాహన కోసం బుధ, గురువారాల్లో మరోసారి రాష్ట్రానికి రానుంది. హైదరాబాద్‌లోని జలసౌధతోపాటు కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల డిజైన్‌, నిర్మాణాలను మరోసారి పరిశీలించనుంది. రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు కేంద్ర జలశక్తి శాఖ పర్యవేక్షణలో చంద్రశేఖర్‌ అయ్యర్‌ నేతృత్వంలోని ఎన్‌డీఎస్‌ఏ నిపుణుల కమిటీని నియమించిన సంగతి తెలిసిందే. తొలిదశ పర్యటనలో అధికారులతో భేటీ కావడంతోపాటు క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల ప్రణాళికలు, నిర్మాణం, ఇతర సాంకేతిక, భౌతిక అంశాలపై దృష్టిసారించింది.
అధికారుల నుంచి 19 అంశాలపై సమాచారం కావాలని అడిగింది. తాజాగా ఈనెల 20, 21 తేదీల్లో పర్యటన సందర్భంగా డిజైన్లను ఇంకోసారి పరిశీలించాలని నిర్ణయించింది. అలాగే నిర్మాణాలనూ తనిఖీ చేయనుంది. ఈమేరకు రాష్ట్ర సాగునీటి శాఖకు ఎన్‌డీఎస్‌ఏ సభ్య కార్యదర్శి అమితాబ్‌ మీనా లేఖ రాశారు. ఇదిలావుండగా ప్రాజెక్టుల ప్రణాళిక, సాధారణ అంశాలు, డీపీఆర్‌ రూపకల్పన, హైడ్రాలజీ, పరిశోధన, సెంట్రల్‌ డిజైన్‌ ఆర్గనైజేషన్‌, నిర్మాణం, నాణ్యతా తనిఖీలు, అపరేషన్‌, నిర్వహణ తదితర అంశాలను మరోసారి అధ్యయనం చేయనుంది. ప్రాజెక్టు పనుల్లో భాగస్వాములైన ప్రతిఒక్కరూ పర్యటన సందర్భంగా అందుబాటులో ఉండాలని ఆదేశించింది. దీంతో ఎన్‌డీఎస్‌ఏ నిపుణుల బృందం రెండోసారి రాష్ట్రంలో పర్యటిస్తున్న నేపథ్యంలో సాగునీటి శాఖ అధికారుల్లో చర్చ ప్రారంభమైంది. ప్రాథమిక నివేదికను నెల రోజుల్లోనే ఇస్తామని ప్రభుత్వానికి ఇచ్చిన హామీని నిలబెట్టుకునే ప్రయత్నంలో ఎన్‌డీఎస్‌ఏ ఉన్నట్టు సమాచారం.

Spread the love