పాఠ్యాంశాల నుంచి నెహ్రూ మాయం

– రాజేంద్ర ప్రసాద్‌, రాధాకృష్ణన్‌ కూడా
– ఉత్తరప్రదేశ్‌ సెకండరీ బోర్డు నిర్వాకం
ప్రయాగరాజ్‌ : భారత తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ, తొలి రాష్ట్రపతి బాబూ రాజేంద్ర ప్రసాద్‌, రెండవ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్‌ స్వాతంత్య్ర సమరయోధులు కారట. వారు దేశ స్వాతంత్య్రం కోసం తమ జీవితాలను త్యాగం చేయలేదట. అందుకే వారి చాప్టర్లను ఉత్తరప్రదేశ్‌ పాఠ్య పుస్తకాల నుండి తొలగించారట. ఇది ఉత్తరప్రదేశ్‌ సెకండరీ బోర్డు నిర్వాకం. ఉత్తరప్రదేశ్‌లో 9-12 తరగతులు చదివే విద్యార్థుల కోసం ‘నైతికత, యోగా, క్రీడలు, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌’ అనే సబ్జెక్టును బోధిస్తున్నారు. ఇందులో యాభై మంది ప్రముఖుల జీవిత విశేషాలను చేర్చారు. అయితే ఆ ప్రముఖుల జాబితాలో నెహ్రూ, రాజేంద్ర ప్రసాద్‌, రాధాకృష్ణన్‌లకు చోటు దక్కలేదు. అంతేకాదు… భారత సైనిక దళాలకు చెందిన ప్రముఖులు ఫీల్డ్‌ మార్షల్‌ మానెక్‌ షా, పరమవీర చక్ర పురస్కార గ్రహీతలు అబ్దుల్‌ హమీద్‌, కెప్టెన్‌ విక్రమ్‌ బత్రా వంటి వారి విశేషాలూ లేవు. దేశానికి మొట్టమొదటి రాకెట్‌ను అందించిన శాస్త్రవేత్త, అహ్మదాబాద్‌ ఐఐఎం వ్యవస్థాపకుడు విక్రమ్‌ సారాభారు పేరు కూడా కానరావడం లేదు.
దీనిపై రాష్ట్ర సెకండరీ విద్యా శాఖ సహాయ మంత్రి గులాబో దేవి మాట్లాడుతూ ‘దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలు అర్పించిన ప్రముఖుల పేర్లను మాత్రమే ఈ జాబితాలో చేర్చాం. రాజకీయ ప్రయోజనాల కోసం స్వాతంత్య్ర పోరాటంలో భాగస్వాములైన వారి పేర్లను చేర్చలేదు. ఈ జాబితాలో చేర్చడానికి నెహ్రూకు అర్హత ఉన్నదని నేను అనుకోవడం లేదు’ అని చెప్పుకొచ్చారు. కాగా 9-12 తరగతుల విద్యార్థులు ఈ సబ్జెక్టును విధిగా నేర్చుకోవాల్సి ఉంటుంది.

Spread the love