రఫాపై దాడి చేసి తీరుతాం : నెతన్యాహు

– తాజా ప్రతిపాదన ఆమోదించాలంటూ హమాస్‌పై అమెరికా ఒత్తిడి
– వచ్చే వారం ఇజ్రాయిల్‌లో బ్లింకెన్‌ పర్యటన
జెరూసలేం, గాజా : గత ఏడు మాసాలుగా యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో వందల వేల సంఖ్యలో పాలస్తీనియన్లు తల దాచుకున్న రఫా నగరంపై దాడి చేసి తీరుతామని ఇజ్రాయిల్‌ ప్రధాని బెంజామిన్‌ నెతన్యాహు మంగళవారం స్పష్టం చేశారు. మిత్రపక్షం అమెరికా సహా అంతర్జాతీయ సమాజం రాఫాపై దాడి వద్దంటూ చేస్తున్న విజ్ఞప్తులను నెతన్యాహు పెడచెవిన పెడుతున్నారు. బందీల విడుదలకు ప్రతిగా యుద్ధాన్ని ఆపేది లేదంటూ పదే పదే చెబుతున్నారు. ఒప్పందం కుదిరినా, కుదరకపోయినా, రఫాలోకి ప్రవేశించి, అక్కడ గల హమాస్‌ బెటాలియన్లను ధ్వంసం చేస్తామన్నారు. గాజాలో కాల్పుల విరమణకు, బందీల విడుదల కోసం కాల్పుల విరమణ ఒప్పందంపై ప్రస్తుతం ఇరు పక్షాలు చర్చలు జరుపుతున్నాయి. తాము పెట్టుకున్న లక్ష్యాలను సాధించాలని, ఆలోపుగా యుద్ధం ఆపాలన్న ఆలోచనే తమకు లేదని ఆయన తేల్చి చెప్పారు. బందీల కుటుంబాలతో జరిగిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు ఆయన కార్యాలయం ఒక ప్రకటన చేసింది. రఫా నగరంలో పది లక్షల మందికి పైగా ప్రజలు తల దాచుకున్నారు.
హమాస్‌పై బ్లింకెన్‌ ఒత్తిడి
కాల్పుల విరమణపై కొత్త ప్రతిపాదన చేసిన నేపథ్యంలో దాన్ని అంగీకరించాలంటూ హమాస్‌పై అమెరికా ఒత్తిడి తీసుకువస్తోంది. కాగా రఫా నగరంపై ఇజ్రాయిల్‌ జరిపిన దాడుల్లో 26మంది మరణించారని ఆస్పత్రి రికార్డులు పేర్కొంటున్నాయి. ఈ వారంలో ఇజ్రాయిల్‌లో అమెరికా విదేశాంగ మంత్రి బ్లింకెన్‌ పర్యటించనున్నారు. తాజా ప్రతిపాదనను ఆమోదించాంటూ ఆయన హమాస్‌ను కోరారు. ఇజ్రాయిల్‌ చాలా ఉదారంగా వ్యవహరించి ఈ ప్రతిపాదన చేసిందని ఆయన వ్యాఖ్యానించారు. అయితే ఆ ప్రతిపాదన వివరాలేంటనేది బహిర్గతం కాలేదు. గాజాలో శాశ్వతంగా కాల్పుల విరమణ జరగాలని హమాస్‌ కోరు తుండగా, ఇజ్రాయిల్‌ అందుకు ఒప్పు కోవడం లేదు. రఫాపై దాడిని నివారించే లక్ష్యంతో ఈజిప్ట్‌ తన మధ్యవర్తిత్వ ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఎలాగైనా కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదర్చాలని భావిస్తోంది. చర్చలపై ఇలా ప్రతిష్టంభన కొనసాగుతున్న తరుణంలోనే ఇజ్రాయిల్‌ నేతల అరెస్టుకు అంతర్జాతీయ క్రిమినల్‌ కోర్టు వారంట్లు జారీ చేయవచ్చని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Spread the love