టీఎస్‌పీఎస్సీలో కొత్త విధానం

New policy in TSPSC– చైర్మెన్‌, సభ్యుల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం
–  తుది గడువు ఈనెల 18
–  పరిశీలనకు సెర్చ్‌ కమిటీ ఏర్పాటు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎఎస్సీ)లో కొత్త విధానానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా టీఎస్‌పీఎస్సీలో ఖాళీగా ఉన్న చైర్మెన్‌, సభ్యుల నియామకానికి అర్హులైన వారి నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. దరఖాస్తు నమూనా పత్రాలను షషష.్‌వశ్రీaఅస్త్రaఅa.స్త్రశీఙ.ఱఅ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. టీఎస్‌పీఎస్సీ చైర్మెన్‌, సభ్యుల పదవులకు కావాల్సిన అర్హతలు, ఇతర వివరాలను ఆ వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. అర్హులైన వారు ఈనెల 18వ తేదీ సాయంత్రం ఐదు గంటల్లోపు నిర్ణీత దరఖాస్తులను ఆన్‌లైన్‌ ద్వారా పంపించాలని కోరింది.secy-ser-gad @telangana.gov.in ఈ-మెయిల్‌ ద్వారా సమర్పించాలని సూచించింది. ఈ నియామకాలు, స్వీకరించిన దరఖాస్తుల నుంచి లేదా ఇతరత్రాగానీ, ప్రభుత్వం నియమించిన సెర్చ్‌ కమిటీ/స్క్రీనింగ్‌ కమిటీ ద్వారా చేస్తామని సమాచార, పౌర సంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్‌ అశోక్‌రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
పారదర్శకతకు పెద్దపీట
టీఎస్‌పీఎస్సీ చైర్మెన్‌ పదవికి డాక్టర్‌ బి జనార్ధన్‌రెడ్డి గతనెల 11న రాజీనామా చేశారు. ముగ్గురు సభ్యులు ఆర్‌ సత్యనారాయణ, ప్రొఫెసర్‌ బండి లింగారెడ్డి, కారం రవీందర్‌రెడ్డి గతనెల 13న రాజీనామాలను గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌కు సమర్పించారు. వారి రాజీనామాలను గవర్నర్‌ ఈనెల 10న ఆమోదించారు. శుక్రవారం మరో సభ్యురాలు సుమిత్రా ఆనంద్‌ తనోబా గవర్నర్‌కు రాజీనామా లేఖను పంపించారు. టీఎస్‌పీఎస్సీలో ఇప్పుడు ఏకైక సభ్యురాలిగా కోట్ల అరుణకుమారి కొనసాగుతున్నారు. ఆమెను ప్రభుత్వం కొనసాగిస్తుందా? లేదా? అన్నది చూడాల్సిందే. అయితే టీఎస్‌పీఎస్సీ చైర్మెన్‌, సహా తొమ్మిది మంది సభ్యుల నియామకానికి ప్రస్తుతం అవకాశమున్నది. అరుణకుమారి రాజీనామా చేస్తే పది మంది సభ్యులను కొత్తగా నియామకం చేయొచ్చు. టీఎస్‌పీఎస్సీ చైర్మెన్‌ సహా సభ్యుల నియామక ప్రక్రియకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పారదర్శకతకు పెద్దపీట వేస్తున్నారు. అందులో భాగంగానే ఇటీవల ఢిల్లీకి వెళ్లినపుడు యూపీఎస్సీ చైర్మెన్‌తో ఆయన భేటీ అయ్యారు. చైర్మెన్‌, సభ్యుల నియామకంతోపాటు ఉద్యోగాల భర్తీకి సంబంధించి న వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇంకోవైపు టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్‌, మాజీ కార్యదర్శి వాణీ ప్రసాద్‌ బృందాలు కేరళ, యూపీఎ స్సీని సందర్శించి పలు వివరాలను సేకరించాయి.
నెలాఖరు వరకు కొత్త కమిషన్‌
టీఎస్‌పీఎస్సీ చైర్మెన్‌, సభ్యుల నియామకాల ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. అర్హులైన వారి నుంచి దరఖాస్తులను ఆహ్వానించిన తర్వాత సెర్చ్‌ కమిటీ లేదా స్క్రీనింగ్‌ కమిటీ వాటిని పరిశీలిస్తుంది. ఈనెలాఖరులోగా టీఎస్‌పీఎస్సీకి కొత్త పాలకమండలిని నియమించే దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తున్నది. అయితే చైర్మెన్‌, సభ్యులుగా ఎవరుండాలనే దానిపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రత్యేకంగా దృష్టిసారించినట్టు సమాచారం. ఎందుకంటే బీఆర్‌ఎస్‌ హయాంలో ప్రశ్నాపత్రాల లీకేజీతో టీఎస్‌పీఎస్సీ అభాసుపాలైంది. గ్రూప్‌-1 రెండు సార్లు రద్దు కావడంతో నిరుద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి ఉన్నది. ఇప్పుడు ఆ విధానానికి భిన్నంగా పూర్తి పారదర్శకంగా వ్యవహరించేలా కొత్త కమిషన్‌ ఉండాలని కాంగ్రెస్‌ ప్రభుత్వం భావిస్తున్నది. అందులో భాగంగా సమర్థవంతంగా పనిచేసే వారిని వివాదరహితులుగా ఉన్న వారిని చైర్మెన్‌, సభ్యులుగా నియమించాలని సీఎం ఆలోచిస్తున్నట్టు సమాచారం. అయితే ఆశావహులైన పలువురు ఐఏఎస్‌, మాజీ ఐఏఎస్‌, ఐపీఎస్‌, మాజీ ఐపీఎస్‌, ప్రొఫెసర్లు, ప్రముఖులు, మేధావులు ఇప్పటికే ప్రభుత్వానికి తమ బయోడేటాను ఇచ్చినట్టు తెలిసింది. కొత్త పాలకమండలి ఏర్పాటైన తర్వాతే గ్రూప్‌-1, గ్రూప్‌-2, గ్రూప్‌-3 రాతపరీక్షలకు తేదీలను ఖరారు చేసే అవకాశముంటుంది. గ్రూప్‌-4 రాతపరీక్షల ఫలితాలను వెల్లడిస్తుంది. కాంగ్రెస్‌ ఎన్నికల మ్యానిఫెస్టోలో పేర్కొన్న విధంగా జాబ్‌ క్యాలెండర్‌ను రూపొందించి, అందుకనుగుణంగా నియామకాల ప్రక్రియను చేపట్టేందుకు కార్యాచరణను రూపొందించే అవకాశమున్నది.

Spread the love