న్యూస్‌ క్లిక్‌కు ఎస్‌కేఎం మద్దతు

News Click is supported by SKM– రైతు ఉద్యమంపై మోడీ సర్కార్‌ మళ్లీ దాడి
– అందులో భాగంగానే న్యూస్‌క్లిక్‌ జర్నలిస్టులపై ఎఫ్‌ఐఆర్‌
– ఖండిస్తూ దేశవ్యాప్త ఆందోళనలకు పిలుపు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
న్యూస్‌క్లిక్‌ జర్నలిస్టులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి రైతుల ఉద్యమంపై బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ ఆధ్వర్యంలో మోడీ ప్రభుత్వం పునరుద్ధరించిన దాడికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా భారీ ఆందోళనలకు సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కేఎం) పిలుపు ఇచ్చింది. ఈ మేరకు ఆదివారం ఎస్‌కేఎం ప్రకటన విడుదల చేసింది. ఢిల్లీలో చారిత్రాత్మకమైన ఎస్‌కేఎం నేతృత్వంలోని రైతు ఉద్యమంపై ఢిల్లీ పోలీసుల ప్రత్యేక విభాగం దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో చేసిన దుర్మార్గపు ఆరోపణల గురించి తెలుసుకున్న ఎస్‌కేఎం దిగ్భ్రాంతికి గురైందని పేర్కొంది. మీడియా హౌస్‌ న్యూస్‌క్లిక్‌, జర్నలిస్టులపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో రైతుల ఉద్యమంపై చేసిన ఆరోపణలన్నింటినీ ఎస్‌కేఎం నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తుంది. అవి అబద్ధం, ప్రేరేపితమైనవని పేర్కొంది. రైతుల ఉద్యమం ”దేశంలో సరఫరాలు, సేవలకు అంతరాయం కలిగించడం, ఆస్తి నష్టం, విధ్వంసం, ఆర్థిక వ్యవస్థకు భారీ నష్టాన్ని కలిగించడం, అక్రమ విదేశీ నిధులతో అంతర్గత శాంతిభద్రతల సమస్యలు” అని ఎఫ్‌ఐఆర్‌లో నిరాధారం తప్పుడు, కొంటె ఆరోపణలను ఎస్‌కేఎం తిరస్కరించింది. ”బీజేపీ ప్రభుత్వ రైతు వ్యతిరేక, కార్పొరేట్‌ అనుకూల చట్టాలు, విధానాలకు వ్యతిరేకంగా ఎస్‌కేఎం నేతృత్వంలోని రైతులు, దేశంలోని అన్నదాతలు శాంతియుత నిరసనలో పాల్గొన్నారు. రైతులకు సరఫరాకు అంతరాయం కలగలేదు. రైతుల వల్ల ఎలాంటి ఆస్తి నష్టం జరగలేదు. రైతుల వల్ల ఆర్థిక వ్యవస్థకు ఎలాంటి నష్టం జరగలేదు. రైతుల వల్ల శాంతిభద్రతల సమస్య తలెత్తలేదు. ముండ్ల కంచెలు, నీటి ఫిరంగులు, లాఠీ చార్జీలు, రోడ్లపై కందకాలు తవ్వడం వంటివాటితో దేశ రాజధానికి చేరుకునే వారి ప్రజాస్వామ్య హక్కును వినియోగించుకోకుండా కేంద్ర ప్రభుత్వం రైతులను హింసాత్మకంగా ఆపారు. అది దేశ ప్రజలకు, రైతులకు తీవ్ర అసౌకర్యాన్ని కలిగించింది. మండుతున్న వేసవి ఎండలు, కుండపోత వర్షాలు, గడ్డకట్టే చలితో రైతులు 13 నెలల పాటు నిరసనలో కూర్చోవలసి వచ్చింది. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రభుత్వం శాంతి భద్రతల సమస్యలను సృష్టించింది. లఖింపూర్‌ ఖేరీ వద్ద ర్యాలీ చేస్తున్న రైతులపై వాహనాలతో తొక్కించి, నలుగురు రైతులు, ఒక జర్నలిస్టును చంపారు. ఈ దాడి వెనుక కేంద్ర హౌంశాఖ సహాయ మంత్రి, ఆయన కుమారుడి హస్తం ఉంది. ఇప్పటి వరకు ప్రధానమంత్రి ఆ మంత్రిని తొలగించలేదు. మోడీ ప్రభుత్వ అణచివేతను ఎదుర్కోవడానికి లఖింపూర్‌ ఖేరీ రైతులతో సహా 735 మంది రైతులు తమ ప్రాణాలను త్యాగం చేయాల్సి వచ్చింది” అని పేర్కొంది.
”న్యూస్‌క్లిక్‌ ఎఫ్‌ఐఆర్‌ తో రైతు ఉద్యమంపై మళ్లీ దాడి చేసినందుకు ప్రయత్నిస్తున్న బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా సామూహిక నిరసనలను ఎస్‌కేఎం ప్రకటించింది. న్యూస్‌క్లిక్‌ ఎఫ్‌ఐఆర్‌లో రైతుల ఉద్యమంపై చేసిన తప్పుడు, దుర్మార్గపు ఆరోపణలను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేస్తూ ప్రతి రాష్ట్ర రాజధాని, జిల్లా కేంద్రం, మండల కేంద్రంలో పెద్దఎత్తున నిరసన పిలుపు ఇచ్చింది. రైతుల ఉద్యమంపై వచ్చిన అన్ని ఆరోపణలను వెంటనే ఉపసంహరించుకోవాలని ఎస్‌కేఎం నాయకుల ప్రతినిధి బృందాలు భారత రాష్ట్రపతి, ప్రధాన మంత్రి, కేంద్ర హౌం మంత్రి, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి, ఢిల్లీ పోలీసు కమిషనర్‌కి వినతి సమర్పిస్తాం” అని పేర్కొంది.

Spread the love