కేజ్రీవాల్‌పై ఎన్‌ఐఏ విచారణ

– ఢిల్లీ ఎల్‌జీ సిఫారసు.
న్యూఢిల్లీ: ‘సిఖ్స్‌ ఫర్‌ జస్టిస్‌’ అనే ఉగ్రవాద సంస్థ నుంచి రాజకీయ విరాళాలు తీసుకున్నారనే ఆరోపణలపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌పై ఎన్‌ఐఏ విచారణ చేయాలని రాష్ట్ర లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వికె సక్సెనా సిఫారసు చేశారు. ఈ మేరకు కేంద్ర హోం శాఖ కార్యదర్శికి సక్సెనా ఒక లేఖ రాసినట్లు లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. 1993 బాంబు పేలుళ్ల కేసు దోషి దేవేంద్ర పాల్‌ భుల్లార్‌ విడుదలకు సహకరించాలని కోరుతూ ఖలిస్తాన్‌ అనుకూల ఉగ్రవాద సంస్థల నుంచి 16 మిలియన్‌ డాలర్లును కేజ్రీవాల్‌ నేతృత్వంలోని ఆప్‌ స్వీకరించినట్లు తనకు ఫిర్యాదు అందినట్లు సక్సెనా లేఖలో తెలిపారు. ఇందుకు సంబంధించిన ఆధారాలను కూడా లేఖతో సక్సెనా జత చేసినట్లు సమాచారం.కాగా, లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసే విషయాన్ని పరిశీలిస్తామని సుప్రీంకోర్టు వెల్లడించిన కొన్ని రోజుల్లోనే వికె సక్సెనా ఇలాంటి లేఖ రాయడంపై అను మానాలు వ్యక్తమవుతున్నాయి. ‘బిజెపి ఆదేశాలతో కేజ్రీవాల్‌పై ఇది మరొక కుట్ర’గా ఆప్‌ విమర్శించింది. ఢిల్లీలో మొత్తం ఏడు లోక్‌సభ స్థానాల్లోనూ ఓటమి చెందుతామనే భయంతోనే బిజెపి ఇలాంటి కుట్రలకు పాల్పడు తుందని ఆప్‌ నాయకులు, ఢిల్లీ మంత్రి సౌరభ్‌ భరద్వాజ్‌ విమర్శించారు.

Spread the love