నిమ్స్‌ కాంట్రాక్టు కార్మికులను రెగ్యులరైజ్‌ చేయాలి

NIMS should regularize contract workers– సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌
నవతెలంగాణ-బంజారాహిల్స్‌
నిమ్స్‌ ఆస్పత్రిలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులను రెగ్యులరైజ్‌ చేయాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌ డిమాండ్‌ చేశారు. ఈనెల జరగనున్న 16న దేశవ్యాప్త సమ్మె, గ్రామీణ బంద్‌ను జయప్రదం చేయాలని కోరారు. బుధవారం హైదరాబాద్‌ పంజాగుట్ట నిమ్స్‌ ఆస్పత్రిలో నిమ్స్‌ కాంట్రాక్ట్‌ కార్మికుల జనరల్‌ బాడీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిమ్స్‌ కాంట్రాక్టు కార్మికులను రెగ్యులరైజ్‌ చేసి వారికి కనీస వేతనం రూ.26,000 ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కాంట్రాక్ట్‌ కార్మికులకు గ్రాట్యుటీ సౌకర్యం కల్పించాలన్నారు. 16న ఇందిరాపార్క్‌ వద్ద జరగనున్న మహాధర్నాలో నిమ్స్‌ కాంట్రాక్ట్‌ కార్మికులు పెద్దఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. దేశవ్యాప్త సమ్మె, గ్రామీణ బంద్‌ను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
ఎన్నికలకు ముందు బీజేపీ ఇచ్చిన హామీలు ఏ ఒక్కటీ అమలు చేయలేదన్నారు. విదేశాల్లో ఉన్న నల్ల డబ్బు తీసుకొచ్చి ఒక్కొక్కరి అకౌంట్‌లో రూ.15 లక్షలు వేస్తామన్న వాగ్దానం ఏమైందని, ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేసిన పోరాటం సందర్భంగా ఇచ్చిన హామీలు అమలు చేయలేదని చెప్పారు. ఈ సమావేశంలో సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జే.వెంకటేష్‌, నిమ్స్‌ కాంట్రాక్ట్‌ వర్కర్స్‌ యూనియన్‌ (సీఐటీయూ) అధ్యక్షులు ఎం.వెంకటేష్‌, ప్రధాన కార్యదర్శి ఇ.నరసింహులు, జాయింట్‌ సెక్రటరీ వెంకటేష్‌, నిమ్స్‌ సీఐటీయూ, యూనియన్‌ నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.

Spread the love