– నివేదిక వెల్లడించకుండా నిరోధించడమా… కుదరదు : సుప్రీంకోర్టు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
బీహార్ లో కులగణనపై ‘స్టే’ ఇచ్చేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. ఇటీవల ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చేపట్టిన కులగణనకు సంబంధించి తదుపరి సమాచారాన్ని వెల్లడించకుండా నిరోధించడం కుదరదని చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొనే విధానపరమైన నిర్ణయాన్ని అడ్డుకోలేమని స్పష్టం చేసింది. ఈ కుల ఆధారిత సర్వేను సమర్థిస్తూ ఆగస్టు 2న పట్నా హైకోర్టు సైతం తీర్పు వెలువరించింది. అయితే కుల గణన సర్వే రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ నలంద నివాసి అఖిలేశ్ కుమార్, యూత్ ఫర్ ఈక్వాలిటీ, ఏక్ సోచ్ ఏక్ ప్రయాస్ అనే స్వచ్ఛంద సంస్థలు సహా పలువురు దాఖలు చేసిన పిటిషన్లపై శుక్రవారం సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్పీఎన్ భట్టీ ధర్మాసనం విచారించింది. ఈ అంశం న్యాయస్థానం పరిధిలో ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వ ం ఇటీవల సర్వే వివరాలను వెల్లడించిందని పిటిషనర్ తరపు న్యాయవాది అపరాజితా సింగ్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇది గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలకు విరుద్ధమని,వాదించారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. ‘రాష్ట్ర ప్రభుత్వం లేదా ఏదైనా ప్రభుత్వం తీసుకునే విధాన నిర్ణయాన్ని అడ్డుకోలేం. అది తప్పిదమే అవుతుంది. ఒకవేళ డేటాకు సంబంధించి ఏదైనా సమస్య ఉంటే.. దాన్ని పరిశీలనలోకి తీసుకుంటాం. ఇటువంటి సర్వే చేపట్టడానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న అధికారాలు, తదితర అంశాలను పరిశీలిస్తాం’ అని సుప్రీం ధర్మాసనం పేర్కొంది. ఈ సందర్భంగా సర్వేకు సంబంధించి తదుపరి సమాచారాన్ని ప్రకటించకుండా యథాతథ స్థితిని పిటిషనర్ కోరినప్పటికీ.. సుప్రీం ధర్మాసనం అందుకు నిరాకరించింది. ఈ క్రమంలో పిటిషనర్ల సవాలుపై రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఈ పిటిషన్ల తదుపరి విచారణను 2024 జనవరికి సుప్రీం కోర్టు వాయిదా వేసింది.
బీహార్ సర్వే వివరాలు..
నితీశ్ కుమార్ ప్రభుత్వం 2024 సార్వత్రిక ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో రాష్ట్రంలో కులగణనపై ఇటీవల సర్వే జరిపింది. ఆ సర్వే వివరాలను విడుదల చేసింది. రాష్ట్రంలో 13.07 కోట్ల జనాభా ఉండగా, వీరిలో ఓబీసీలు, ఈబీసీలు 63 శాతం ఉన్నారు. వీరిలో ఈబీసీలు 36 శాతం కాగా, ఓబీసీలు ఆ తర్వాత స్థానంలో 27.13 శాతంగా ఉన్నారు. ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ కులానికి చెందిన ఓబీసీ గ్రూప్‌లోని యాదవులు మొత్తం జనాభాలో 14.27 శాతం ఉన్నారు. షెడ్యూల్డ్ కులాల్లోకి వచ్చే దళితులు 19.65 శాతం ఉన్నారు. ఎస్‌టీలు సుమారు 22 లక్షలు అంటే 1.68 శాతం ఉన్నారు.