రాష్ట్రంలో ముగిసిన నామినేషన్ల ఘట్టం

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో ఎన్నికల ఘట్టం మొదటి అంకమైన నామినేషన్ల ప్రక్రియ గురువారంతో ముగిసింది. చివరి రోజు ప్రధాన పార్టీల నేతలు, వారి, డమ్మీలు, ఇతర ముఖ్యులతో పాటు ఇండిపెండెంట్‌ అభ్యర్థులు భారీగా నామినేషన్లు దాఖలు చేశారు. రాష్ట్రంలోని 17 పార్లమెంట్‌ నియోజక వర్గాలతో పాటు కంటోన్మెంట్‌ అసెంబ్లీకి గురువారం సాయంత్రం గడువు ముగిసే సమయానికి 547 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఖమ్మం లోక్‌సభకు అత్యధికంగా 29 నామినేషన్లు దాఖలు కాగా ఆదిలాబాద్‌ స్థానానికి అత్యల్పంగా ఆరు నామినేషన్లు దాఖలయ్యాయి. మొదటి ఆరు రోజుల్లో 302 మంది నామినేషన్లు దాఖలు చేయగా, చివరి రోజు ఏకంగా 145 మంది నామినేషన్లు దాఖలు చేశారు. ఈ నెల 18 నుంచి 25 వరకు ఏడు పనిదినాల్లో నామినేషన్లను స్వీకరించారు. శుక్రవారం నామినేషన్లను పరిశీలిస్తారు. ఉపసంహరణ గడువు ఈ నెల 29 ముగిసిన తర్వాత పోటీలో నిలవ బోయే తుది అభ్యర్థులను ఎన్నికల సంఘం ప్రకటించనుంది. దేశ వ్యాప్తంగా మొత్తం ఏడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. నాలుగో దశలో భాగంగా రాష్ట్రంలో మే 13న పోలింగ్‌ జరగనుంది, జూన్‌ 4న కౌంటింగ్‌, అదే రోజు ఫలితాలు వెలువడనున్నాయి.

Spread the love