విన్నపాలతో కాదు…

 Sampadakiyam మెతక వైఖరి, కరుకుతనం… మన పనులు సవ్యంగా సాగాలంటే ఈ రెండింటిలో దేన్ని ప్రదర్శించాలనేది, ప్రదర్శిస్తామనేది ముఖ్యం. సమయాన్నిబట్టి, సందర్భాన్ని బట్టి లౌక్యాన్ని ప్రదర్శిస్తూ ముందుకు సాగాలంటారు పెద్దలు. ఆ తెలివిని ప్రదర్శించకుండా సాదాసీదాగా ముందుకెళ్తే ఎదురు దెబ్బలు తప్పవన్నది అనుభవం చెప్పే పాఠం. మనకున్న గత అనుభవాల రీత్యా తెలంగాణకు రావాల్సిన నిధులు, ఆర్థిక సాయాలు, గ్రాంట్లు, రాష్ట్ర హక్కుల విషయంలో కేంద్రంలోని మోడీ సర్కారు తీవ్ర నిర్లక్ష్యాన్ని, అంతకుమించిన బాధ్యతా రాహిత్యాన్ని ప్రదర్శిస్తూ వస్తున్నది. గత పదేండ్ల నుంచి కొనసాగుతున్న తంతు ఇదే. ఇది ఇక్కడి అభివృద్ధికి, ప్రయోజ నాలకు గండి కొడుతోంది.
తాజాగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. .రాష్ట్రానికి సంబంధించిన డజనుకు పైగా సమ స్యలను ప్రధాని మోడీకి ఏకరువు పెట్టారు. ఆయా అంశాలు, ప్రాజె క్టులను పూర్తి చేసేందుకు ఇతోధికంగా ఆర్థిక చేయూత నందించాలంటూ ఆయన ప్రధానికి విజ్ఞప్తి చేశారు. వీటిలో మూసీ ప్రక్షాళన, ఐఏఎస్‌ల కేటాయింపు, ఎన్టీపీసీలో 2,400 మెగావాట్ల విద్యుత్‌ కేంద్రం ఏర్పాటు, జాతీయ రహదారుల నిర్మాణం తదితరాలు ప్రధానంగా ఉన్నాయి. ఇవి గాక గత పదేండ్ల మోడీ పాలనలో తెలంగాణపై కొనసాగిన వివక్ష, కొనసాగుతున్న పక్షపాత ధోరణికి అనేక దృష్టాంతాలు మన ముందున్నాయి. కేంద్రం నుంచి ప్రతీయేటా రాష్ట్రానికి చట్టబద్ధంగా రావాల్సిన నిధులు, గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ రూ పంలో అందాల్సిన సాయాలకు కొర్రీలేస్తూ వస్తున్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో గ్రాంట్ల రూపంలో రూ. 41,259 కోట్లు రావాల్సి ఉండగా, అందులో కేవలం 11 శాతాన్నే (రూ.4,532 కోట్లు) విదిల్చారు. పద్నాలుగో ఫైనాన్స్‌ కమిషన్‌ రాష్ట్రంలోని స్థానిక సంస్థలకు రూ.817 కోట్లను విడుదల చేయాలంటూ సూచించినా ఇప్పటి వరకూ అతీగతీ లేదు.
రాష్ట్ర పునర్‌ విభజన చట్టంలోని సెక్షన్‌ 94(2) ప్రకారం తెలంగాణలోని వెనుకబడిన జిల్లాలు, ప్రాంతాలకు రూ.1,350 కోట్లు ఇవ్వాల్సి ఉన్నా… దీనిపై కేంద్రం ఇప్పటి వరకూ నోరు మెదపలేదు. ఇక మిషన్‌ భగీరథ నిర్వహణ కోసం రూ.2,350 కోట్లు, వివిధ రంగాల అభివృద్ధికి రూ. 3,024 కోట్లు, పన్నుల్లో తగ్గిన వాటా రూపంలో ఇవ్వాల్సిన మొత్తం రూ.723 కోట్ల (2020-21)ను కేంద్రమే చెల్లించా లంటూ పదిహేనో ఆర్థిక సంఘం సిఫారసు చేసింది. చెరు వుల పునరుద్ధరణ (మిషన్‌ కాకతీయ) కోసం మరో రూ.5 వేల కోట్లు సాయం చేయా లంటూ ఆ సంఘం సూచించింది. ఇవేవీ మోడీ గారి చెవికెక్కవు. వీటితోపాటు రాష్ట్ర పునర్‌ విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి కేటాయిం చాల్సిన గిరిజన యూనివర్సిటీ, రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ, ప్రాజెక్టులకు జాతీయ హోదా తదితరాం శాలు ఎప్పుడో అటకెక్కాయి. తెలంగాణకు రావాల్సిన ఐటీఐఆర్‌ను చెప్పా పెట్టకుండా ఇతర రాష్ట్రాలకు తరలిం చుకుపోయారు. వీటిపై గత బీఆర్‌ఎస్‌ సర్కారు ఇదే మోడీకి వినతుల మీద వినతులు సమర్పించింది. ఆనాటి ముఖ్యమంత్రి సహా పలువురు మంత్రులు ప్రధానిని, ఇతర కేంద్రమంత్రులను కలిసి మొరపెట్టుకున్నారు. అయినా ఫలితం లేకపోయింది. గత పదేండ్లు బీజేపీని మోసిన బీఆర్‌ ఎస్‌.. ఆ తర్వాత ఇది పుల్లటి ద్రాక్షంటూ శాపనార్థాలందు కుంది. పెద్దనోట్ల రద్దు, జీఎస్టీతో సహా అన్నింటిలో అది కాషాయ పార్టీతో అంటగాకింది. తనకే ఎసరు పెడుతోందని అర్థమైన తర్వాత ఏడ్చి గీపెట్టిన ప్పటికీ రాష్ట్రానికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
ఇప్పుడు నూతనంగా అధికార పగ్గాలు చేపట్టిన కాంగ్రెస్‌ రథసారధి రేవంత్‌ కూడా రెండు మూడుసార్లు ఇవే అంశాలపై మోడీని ఢిల్లీలో కలిశారు. ఆ తర్వాత తాజాగా రాష్ట్ట్ర పర్య టనకు ఆయన విచ్చేసిన సందర్భంగా ‘విన్నపాలు వినవలె…’ అంటూ విజ్ఞాపన పత్రాలు సమర్పించారు. అంతే కాదు…’రాష్ట్రానికి పెద్దన్నలా వ్యవహరించి, సాయం చేయండి…’అంటూ అర్థించారు. కొందరు విమర్శిస్తున్న ట్టుగా, కొన్ని పత్రికల్లో రాసినట్టుగా ఇదేమీ తప్పు కాదు. రాష్ట్ర ప్రయోజనాల రీత్యా కేంద్రంతో సఖ్యత కోసం ముఖ్య మంత్రి, ప్రధానిని కలవటాన్ని అర్థం చేసు కోవాల్సిందే. అయితే రాష్ట్రాల హక్కులను కాలరాస్తూ సమాఖ్య వ్యవస్థను నీరు గారుస్తున్న కేంద్ర బీజేపీ సర్కార్‌ వైఖరిపై ఇదే కాంగ్రె స్‌కు చెందిన కర్నాటక సీఎం సిద్ధరామయ్య హస్తినాలోని జంతర్‌ మంతర్‌ వద్ద ధర్నాకు దిగిన సంగతిని రేవంత్‌ మరిచిపోకూడదు.
ఇదే తరహాలో సమాఖ్య వ్యవస్థ బలోపేతం, లౌకికత్వ పరిరక్షణ, మతోన్మాదానికి వ్యతిరేకంగా కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ఇటీవల ఢిల్లీలో గళమెత్తిన సంగతినీ తెలంగాణ సీఎం గుర్తు చేసుకోవాలి. ఆయన ఉద్యమానికి తమిళ నాడు సీఎం స్టాలిన్‌ మద్దతు తెలిపిన విషయాన్నీ మననం చేసుకోవాలి. ఈ రకంగా దక్షిణాదిలోని మూడు రాష్ట్రాలు కేంద్రం తీరును, మోడీ సర్కారు వైఖరినీ దునుమాడుతున్న తరుణంలో మనం కేవలం వినతులు, విజ్ఞప్తులతోనే సరిపుచ్చితే అది వృథా ప్రయాసే అవుతుంది. ఇదే సమయంలో కేంద్రంతో ఘర్షణ వైఖరిని చేపడితే.. పనులు కావంటూ కేసీ ఆర్‌ పాడిన పాతపాటే అందుకుంటే ఉప యోగం ఉండదంటూ సిద్ధరామయ్యను, విజయన్‌ను, స్టాలిన్‌ను చూసైనా రేవంత్‌ అర్థం చేసుకుంటే మంచిది. అందుకే తెలంగాణ హక్కులు, ప్రయోజనాల పరి రక్షణకు ‘బడే భారుపై చోటా భారు’ ఆందోళనలు చేపట్టాల్సిందే. పోరాట పంథాను ఎంచుకోవాల్సిందే.

Spread the love