హెచ్‌ఎండీఏకు నోటీసులు

Telangana Hight Courtనవతెలంగాణ-హైదరాబాద్‌
హైదరాబాద్‌లోని రామాంతపూర్‌లో గల 25 ఎకరాల విస్తీర్ణంలోని పెద్దచెరువు ఎఫ్‌టీఎల్‌ను ఖరారు చేసేందుకు ఇంకెంత కాలం కావాలని ప్రభుత్వ అధికారులను హైకోర్టు ప్రశ్నించింది. రామాంతపూర్‌ పెద్దచెరువును డంపింగ్‌ యార్డుగా మారుస్తున్నారనీ, దీని వల్ల నీటి కాలుష్యం ఏర్పడుతుందని ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్‌ డాక్టర్‌ కె.ఎల్‌ వ్యాస్‌ 2005లో రాసిన లేఖను హైకోర్టు పిల్‌గా భావించి విచారణ చేస్తోంది. పదేండ్లు కావస్తున్నా ఆఫీసర్లు ఎఫ్‌టిఎల్‌ను నిర్దారణ చేయకపోవడంతో తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. తమ జాప్యం లేదంటూ ప్రభుత్వ శాఖలు ఆరోపణలు చేసుకోవడం శోచనీయమని వ్యాఖ్యానించింది. హెచ్‌ఎండీఏ, ప్రయివేట్‌ వ్యక్తులను ప్రతివాదులుగా చేర్చింది. వాళ్లందరికీ నోటీసులు జారీ చేసింది. కౌంటర్‌ దాఖలు చేయాలని చీఫ్‌ జస్టిస్‌ అలోక్‌ అరథే, జస్టిస్‌ అనిల్‌ కుమార్‌లతో కూడిన డివిజన్‌ బెంచ్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. విచారణను వచ్చే నెలకు వాయిదా వేసింది.
అటవీ భూముల హక్కుల వివాద కేసులో నోటీసులు
రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలోని సర్వే నెం. 222/1 నుంచి 222/20 దాకా ఉన్న 383 ఎకరాల అటవీ భూముల హక్కుల వివాదం వ్యాజ్యంలో ప్రయివేటు వ్యక్తులు మహ్మద్‌ సిరాజుద్దీన్‌ సహా ఎనిమిది మందికి హైకోర్టు నోటీసులిచ్చింది. కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశించిన చీఫ్‌ జస్టిస్‌ అలోక్‌ అరథే, జస్టిస్‌ అనిల్‌ కుమార్‌లతో కూడిన ధర్మాసనం విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. మహేశ్వరంలోని 383 ఎకరాల భూమి విషయంలో అటవీ శాఖ జారీ చేసిన ప్రొసీడింగ్స్‌ను సిరాజుద్దీన్‌ ఇతరులు హైకోర్టులో సవాల్‌ చేశారు. ముస్లిం ముంతకాబ్‌ ద్వారా కుటుంబ వారసత్వంగా భూమి వచ్చిందనీ, 1954-55 ఖాస్రా పహాణిలోను, ఇటీవల వచ్చిన ధరణిలోనూ ప్రయివేటు వ్యక్తులకే హక్కులున్నాయని గతంలో సింగిల్‌ జడ్జి తీర్పు చెప్పారు. ఆ భూములపై హక్కులు ప్రయివేేటు వ్యక్తులైన సిరాజుద్దీన్‌ మరో ఏడుగురికి చెందుతాయనీ, భూసేకరణ చట్టం ప్రకారం పరిహారంగానీ, ప్రత్యామ్నాయ భూమినిగానీ ఇవ్వాలని డీఎఫ్‌ఓ, రంగారెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. దీనిని రద్దు చేయాలంటూ అటవీ శాఖ దాఖలు చేసిన అప్పీల్‌ను బుధవారం డివిజన్‌ బెంచ్‌ విచారించింది. 50 ఏండ్లుగా అటవీ శాఖ స్వాధీనంలోనే భూములున్నాయని పిటిషనర్ల తరఫు సీనియర్‌ న్యాయవాది ఎస్‌.నిరంజన్‌రెడ్డి వాదించారు. సింగిల్‌ జడ్జి తీర్పు అమలును నిలిపివేయాలని కోరారు. దీనిపై హైకోర్టు యధాతథస్థితి ఉత్తర్వులు జారీ చేయబోయింది. ఈలోగా ప్రయివేటు వ్యక్తుల తరపు సీనియర్‌ న్యాయవాది వి.రవీందర్‌రావు కల్పించుకుని భూములు అటవీ శాఖ ఆధీనంలో ఉన్నాయనీ, వాటిని మార్చబోమని హామీ ఇచ్చారు. దీంతో మధ్యంతర ఉత్తర్వులు జారీ వ్యవహారంపై కౌంటర్‌ దాఖలు చేయాలని ఇరుపక్షాలను ఆదేశించింది. విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.
కోర్టుకు హాజరైన కలెక్టర్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌
హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లోని చెరువుల ఆక్రమణల తొలగింపు. ఇతర అంశాలపై తామిచ్చిన ఉత్తర్వులు అమలు చేయకపోవడానికి కారణాలు వివరించాలన్న గత ఉత్తర్వుల మేరకు హైదరాబాద్‌ కలెక్టర్‌ డి.అనుదీప్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ రోనాల్డ్‌ రోస్‌ హైకోర్టు హాజరయ్యారు. చెరువు ఆక్రమణలపై నివేదిక సమర్పించడంలో ఆలస్యమైనందుకు వారిద్దరూ బేషరతుగా క్షమాపణలు చెప్పారు. వేరే కారణాల వల్ల విచారణకు హాజరు కాలేకపోతున్నట్టు రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ అఫిడవిట్‌ దాఖలు చేశారు.
ఇందుకు అనుమతిచ్చిన హైకోర్టు తదుపరి విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. మిగిలిన ఇద్దరు అధికారులు తదుపరి విచారణకు హాజరుకానక్కల్లేదని చెప్పింది. రెండు జిల్లాల్లోని దుర్గం చెరువు, సున్నం చెరువు, పిరావడిగూడ పెద్దచెరువు, దుండిగల్‌ దామరచెరువు, గంగారాం పెద్దచెరువు నానక్‌రాంగూడ సమీపంలోని మేడికుంట చెరువు. ఉప్పల్‌లోని నల్లచెరువు హస్మతి పేట చెరువు, ఎల్బీనగర్‌ బైరామల్‌గూడ చెరువు, పీర్జాదిగూడ చెరువు. శేరిలింగంపల్లి. నల్లగండ చెరువు, గౌలిదొడ్డ చెరువు, దుండిగల్‌ అంభీర్‌ చెరువుల్లో ఆక్రమణల తొలగింపునకు చర్యలు తీసుకోవటం లేదంటూ 2007లో హైకోర్టుకు లేఖ అందింది. దీనిని పిల్‌గా పరిగణించిన కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అలోక్‌ అరథే, జస్టిస్‌ అనిల్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం మరోసారి విచారణ చేపట్టింది. తదుపరి విచారణను జనవరి 22కి వాయిదా వేసింది. గతంలో హైకోర్టు ఆదేశాల మేరకు కోర్టు కమిషనర్‌గా రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి నివేదిక సమర్పించారు. ఆ నివేదిక ప్రకారం ఎలాంటి చర్యలు తీసుకున్నదీ అధికారులు వివరించకపోవడంతో ధర్మాసనం గతంలో ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఎఫ్‌టీఎల్‌ నిర్ధారణతోపాటు సరిహద్దులను ఖరారు చేయాలంది. సరిహద్దు రాళ్లను ఏర్పాటు చేయాలని చెప్పింది. రంగారెడ్డి, హైదరాబాద్‌ కలెక్టర్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్లతో కలిసి సంయుక్త నివేదిక సమర్పించాలని 2013లో మరోసారి అదేశించింది. తాజాగా జరిగిన వాదనల తర్వాత అక్రమణల తొలగింపు చర్యల నివేదిక పరిశీలన కోసం విచారణను వచ్చే నెల 22వ తేదీకి వాయిదా వేసింది.
సమాచార కమిషనర్ల నియామక కేసు విచారణ వాయిదా
రాష్ట్ర ప్రభుత్వం మారిన నేపథ్యంలో సమాచార హక్కు కమిషనర్ల నియామకానికి కొత్త కమిటీ ఏర్పాటు చేయాల్సి ఉందనీ, అందువల్ల ఆరు వారాల గడువు కావాలని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును కోరింది. సమాచార హక్కు ప్రధాన కమిషనర్‌తో పాటు ఆరుగురు కమిషనర్ల నియామకం చేసేలా ఉత్తర్వులు ఇవ్వాలంటూ పోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ కార్యదర్శి ఎం.పద్మనాభరెడ్డి పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై చీఫ్‌ జస్టిస్‌ అలోక్‌ అరాదే, జస్టిస్‌ జె అనిల్‌ కుమార్లతో కూడిన ధర్మాసనం విచారించింది. ప్రధాన సమాచార కమిషనర్‌ పదవికి 40, కమిషనర్ల పోస్టులకు 273 చొప్పున దరఖాస్తులు వచ్చాయనీ, అవన్నీ పరిశీలనలో ఉన్నాయని ప్రభుత్వం చెప్పింది. ఆరు వారాలపాటు వాయిదా వేయాలని కోరడంతో అందుకు హైకోర్టు అనుమతిచ్చింది.

Spread the love