నేడు ఎన్టీఆర్‌ శతజయంతి వేడుకలు

– జయప్రదం చేయాలి:కాసాని జ్ఞానేశ్వర్‌
నవతెలంగాణ-హైదరాబాద్‌
ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాలు హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించేందుకు టీటీడీపీ భారీ ఏర్పాట్లు చేసింది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్‌ ఆధ్వర్యంలో సన్నాహాలు చేపట్టారు. ‘ఎన్టీఆర్‌ లిటరేచర్‌, సావనీర్‌ అండ్‌ వెబ్‌సైట్‌ కమిటీ’ శతజయంతి ఉత్స వాలను జయప్రదం చేసేందుకు పనిచేస్తున్నది. శనివారం సాయంత్రం ఐదు గంటలకు హైదరాబాద్‌, కూకట్‌పల్లి హౌసింగ్‌ బోర్డులోని కైతలాపూర్‌ మైదానంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వేడుకలకు ముఖ్య అతిథిగా తెలుగుదేశంపార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరవుతున్నారు. ప్రముఖ సినీ నటడు నందమూరి బాలకష్ణ ప్రత్యేక అతిథిగా పాల్గొంటున్నారు. ఈ వేడుకలలో భాగంగా ఎన్టీఆర్‌ సమగ్ర సినీ, రాజకీయ జీవితంలో ఆయనతో సన్నిహితంగా మెలిగిన సహచర నటీనటులు, సాంకేతిక నిపుణులు, నిర్మాతలు, దర్శకులు, పాత్రికేయులు, సహచర రాజకీయ నాయకులు, వివిధ పార్టీల నేతలు, ఎడిటర్లు వెలిబుచ్చిన అభిప్రాయాలు, ప్రత్యేకంగా రాసిన వ్యాసాలను సంకలనం చేసిన ‘శక పురుషుడు’ పేరుతో ప్రత్యేక సావనీర్‌ను, అలాగే ఎన్టీఆర్‌ సమగ్ర జీవితానికి సంబంధించిన విశేషాలు, సినీ పాటలు, సినిమాలు, ఉపన్యాసాలు తదితర పూర్తి సమాచారంతో రూపొందించిన ‘జై ఎన్టీఆర్‌’ వెబ్‌సైట్‌ ఆవిష్కరించనున్నారు.
ప్రముఖులకు ఆహ్వానం
ఈ వేడుకల్లో ప్రముఖ సినీ, రాజకీయ నాయకులు పాల్గొంటున్నారు. ముఖ్యఅతిథులుగా హర్యానా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారామ్‌ ఏచూరి, సీపీఐ జాతీయ కార్యదర్శి డి. రాజా,బీజేపీ జాతీయ నేత పురందీశ్వరి , జనసేన అధ్యక్షులు పవన్‌ కళ్యాణ్‌, కన్నడ చిత్ర హీరో శివకుమార్‌, ప్రముఖ తెలుగు హీరోలు జూనియర్‌ ఎన్టీఆర్‌, అల్లు అర్జున్‌ , ప్రభాస్‌, దగ్గుబాటి వెంకటేష్‌, సుమన్‌ , మురళీమోహన్‌, నందమూరి కళ్యాణ్‌రామ్‌, ప్రముఖ హీరోయిన్‌, మాజీ పార్లమెంట్‌ సభ్యులు జయప్రద, ప్రముఖ దర్శకుడు కె. రాఘవేంద్రరావు, ప్రముఖ నిర్మాతలు జి. ఆదిశేషగిరి రావు, సి. అశ్వనీదత్‌ ఇతర సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొంటున్నారు.

Spread the love