నవతెలంగాణ – హైదరాబాద్: తెలుగు ప్రజల రాముడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాళులర్పించారు. హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్‌లోని ఆయన సమాధి వద్ద పుష్పగుచ్చం ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఎన్టీఆర్ ఆదర్శనీయుడని, యుగపురుషుడని చెప్పారు. రాజకీయ నాయకుడిగా, సినీ నటుడిగా తనకంటూ ప్రత్యేకతను చాటుకున్న మహనీయులని కొనియాడారు. చరిత్రలో ఎన్నటికీ మరువలేని మహామనిషి అని చెప్పారు. తెలుగుజాతి గొప్పదనాన్ని యావత్ ప్రపంచానికి చాటిన గొప్ప నేత ఎన్టీఆర్ తెలిపారు. ఆయన శతజయంతిని నేడు ఎంతో ఘనంగా జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు.