నవతెలంగాణ-హైదరాబాద్ : చేప ప్రసాదం పంపిణీకి ముహుర్తం ఖరారైంది. మూడేండ్ల తర్వాత చేప ప్రసాదం పంపిణీ చేస్తున్నారు. ఈ క్రమంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో రాష్ట్ర పశు సంవర్ధక, మత్స్య శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను బత్తిన కుటుంబ సభ్యులు మంగళవారం ఉదయం కలిశారు. ఈ సందర్భంగా చేప పంపిణీ ప్రసాదంపై మంత్రి తలసానితో బత్తిన కుటుంబ సభ్యులు చర్చించారు. జూన్ 9న మృగశిర కార్తె సందర్భంగా చేప ప్రసాదం పంపిణీ చేయనున్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో చేప ప్రసాదం పంపిణీకి ఏర్పాట్లు చేయనున్నారు. ప్రతి ఏటా మృగశిర కార్తె సందర్భంగా అస్తమా బాధితులకు బత్తిన సోదరులు ఉచితంగా చేప ప్రసాదం పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే కరోనా కారణంగా చేప ప్రసాదం పంపిణీ గత మూడేండ్లుగా నిలిచిపోయింది. ఈ ఏడాది నుంచి చేప ప్రసాదం పంపిణీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో ఎప్పటిలాగే నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో బత్తిన సోదరులు ఉచితంగా చేప ప్రసాదం పంపిణీ చేయనున్నారు. చేప ప్రసాదం కోసం ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఉబ్బసం వ్యాధి గ్రస్తులు హైదరాబాద్‌కు వస్తుంటారు. బత్తిన సోదరులు అందించే చేప ప్రసాదం కోసం జనాలు కిలోమీటర్ల మేర బారులు తీరుతారు. కరోనా తర్వాత తొలిసారి చేప ప్రసాదం పంపిణీ చేస్తుండటంతో ఈ సారి జనం భారీగా తరలి వచ్చే అవకాశం ఉందని నిర్వాహకులు భావిస్తున్నారు. ఇందుకు తగ్గ ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు.