చేప ప్రసాదం పంపిణీకి విస్తృత ఏర్పాట్లు : మంత్రి తలసాని

నవతెలంగాణ – హైదరాబాద్‌: ఈనెల 9న మృగశిర కార్తె సందర్భంగా బత్తిన సోదరుల చేప ప్రసాదం పంపిణీకి ప్రభుత్వం తరుఫున అన్ని ఏర్పాట్లను చేస్తున్నామని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేప ప్రసాదం పంపిణీ కి వివిధ శాఖల ఆధ్వర్యంలో జరుగుతున్న ఏర్పాట్లను మంత్రి మంగళవారం సమీక్షించారు. చేప ప్రసాదం కోసం మూడు రోజుల ముందే ఎగ్జిబిషన్ గ్రౌండ్ కు చేరుకున్న హర్యానా, మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్ తదితర రాష్ట్రాలకు చెందిన వారితో మంత్రి మాట్లాడారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ చేప ప్రసాదం పంపిణీ కి ఉమ్మడి రాష్ట్రంలో అరకొర ఏర్పాట్లు చేసేదని, దాంతో చేప ప్రసాదం కోసం వచ్చే ప్రజలు అనేక ఇబ్బందులు పడేవారని చెప్పారు. తెలంగాణ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు ప్రభుత్వం కోట్ల రూపాయల వ్యయంతో అన్ని ఏర్పాట్లు చేస్తుందని అన్నారు. చేప ప్రసాదం కోసం గతంలో కంటే అధికంగా కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. బత్తిన హరినాద్ గౌడ్ కుటుంబ సభ్యులు 250 మంది చేప ప్రసాదం పంపిణీ చేస్తారని చెప్పారని, వారికి ప్రత్యేక గుర్తింపు కార్డులను అందజేయనున్నట్లు వెల్లడించారు.

Spread the love