లాఠీచార్జిని ఖండిస్తున్నాం

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
సంగారెడ్డిలో ఐకేపీ వీఓఏలపై లాఠీచార్జిని, జిల్లాల్లో అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నామని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చుక్కరాములు, పాలడుగు భాస్కర్‌, ఉపాధ్యక్షులు ఎస్వీ.రమ తెలిపారు. ఈ మేరకు సోమవారం వారు ఒక ప్రకటన విడుదల చేశారు. సమ్మెలో ఉన్న వీఓఏలతో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్చలు జరిపి సమస్యను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. వేతనాలు పెంచాలనీ, ఇతర డిమాండ్లు పరిష్కరించాలని 36 రోజులుగా సమ్మె చేస్తున్నా రాష్ట్ర సర్కారుకు పట్టదా? అని ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు విజయవంతం అయ్యాయని తెలిపారు. సంగారెడ్డి జిల్లాలో శాంతియుతంగా ధర్నా చేస్తున్న విఓఏలపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జి చేశారనీ, మహిళలని చూడకుండా పిడి గుద్దులు గుద్దడం హేయమైన చర్య అని పేర్కొన్నారు. అనేక జిల్లాల్లో ఆ యూనియన్‌, సీఐటీయూ నాయకులను ముందే అరెస్టు చేయడం అప్రజాస్వామికమని తెలిపారు. వీఓఏలపై లాఠీచార్జిని, అక్రమ అరెస్టులను ఖండిస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో అన్ని మండల కేంద్రాల్లోనూ నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు.

 

Spread the love