Tuesday, June 23, 2026
E-PAPER
Homeజాతీయంఅయ్యో రామా..!

అయ్యో రామా..!

- Advertisement -

దొంగల చేతుల్లో ‘అయోధ్య’
రామాలయ నిధుల దుర్వినియోగంపై మాజీ కరసేవకుడి ఆందోళన
ట్రస్ట్‌ ‌ప్రధాన కార్యదర్శి చంపత్‌ ‌రాయ్‌ ‌సహా పలువురిపై ఆరోపణలు

మూడు ‌ఫిర్యాదులు నమోదైనా.. ఎఫ్‌ఐఆర్‌ ‌లేదు
మోడీ-యోగి ప్రభుత్వాల మౌనం ప్రశ్నార్థకం
న్యూఢిల్లీ :
దేశంలో హిందూత్వ రాజకీయాల‌కు కేంద్రబిందువుగా ఉన్న యూపీలోని అయోధ్య రామమందిరం ఇప్పుడు అవినీతి, నిధుల దుర్వినియోగ ఆరోపణలతో వివాదాల్లో చిక్కుకుంది. బాబ్రీ మసీదు కూల్చివేత ఉద్యమంలో పాల్గొన్న మాజీ కరసేవకుడు సంతోశ్‌ దూబే స్వయంగా రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్‌పై పోలీసులకు ఫిర్యాదు చేయడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కోట్లాది మంది భక్తులు సమర్పించిన విరాళాల్లో రూ.200 కోట్లకు పైగా దుర్వినియోగం జరిగిందని ఆయన ఆరోపణలు చేస్తున్నారు. ఈ విషయంలో ఇప్పటికే మూడు ఫిర్యాదులు పోలీసులకు అందాయి. అయినప్పటికీ యూపీలోని యోగి ప్రభుత్వం ఇప్పటివరకు కూడా ఎఫ్‌ఐఆర్ నమోదు చేయకపోవడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. ఈ పరిణామం హిందూత్వే ఎజెండాగా ముందుకెళ్లే బీజేపీకి ఇబ్బందికరంగా మారింది.

రాముడి సంపదను దోచుకుంటున్నారు
అయోధ్య రామమందిర నిర్మాణాన్ని దేశభక్తి, హిందూ ఆత్మగౌరవానికి ప్రతీకగా ప్రచారం చేసిన బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్, విశ్వహిందూ పరిషత్‌ వంటి హిందూత్వ శక్తులకు.. ఇప్పుడు అదే ఆలయానికి సంబంధించిన అంశం కొత్త తలనొప్పిని తీసుకొచ్చింది. రామజన్మభూమి ఉద్యమంలో కీలకంగా పనిచేసిన మాజీ కరసేవకుడు సంతోశ్‌ దూబే.. ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్, అనిల్ మిశ్రాతో పాటు ఇతరులపై నిధుల దుర్వినియోగ ఆరోపణలతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రతిరోజూ ఆలయ హుండీల్లో నగదు, బంగారం, వెండి ఆభరణాల రూపంలో భారీగా విరాళాలు వస్తున్నాయనీ, వాటిలో గణనీయమైన భాగం అక్రమ మార్గంలో మాయమైందని ఆయన ఆరోపించారు. ఆలయాన్ని కాపాడాల్సిన వారే రాముడి సంపదను దోచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో దూబే చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి.

‘ఈ దేశంలో రాముడికీ భద్రత లేదా?’
యూపీలోని బాబ్రీ మసీదు కూల్చివేత జరిగి దాదాపు 34 ఏండ్లు గడిచాయి. ప్రధాని మోడీ సమక్షంలో అయోధ్య రామాలయ ప్రతిష్ఠాపన జరిగి రెండేండ్లు పూర్తయ్యాయి. అయినప్పటికీ.. రామజన్మభూమి ఉద్యమంలో పాల్గొన్న సంతోశ్‌ దూబే.. ‘ఈ దేశంలో రాముడికీ భద్రత లేదా? ఆలయాన్ని కాపాడాల్సిన వారే రామాలయ సంపదను దోచుకుంటున్నారు. భక్తుల విశ్వాసాన్ని, నమ్మకాన్ని దోచుకుంటున్నారు’ అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంఘ్ పరివార్, బీజేపీ తరచూ విదేశీ దండయాత్రదారులుగా చిత్రీకరించే బాబర్‌, ఘజినీల కంటే నేటి పరిస్థితి మరింత బాధాకరమని ఆయన వ్యాఖ్యానించారు. రామాలయం దొంగల చేతుల్లో పడిపోయిందనే బాధ తనను వెంటాడుతోందని చెప్పారు. అయోధ్యలోని రామాలయానికి భక్తులు సమర్పించిన నగదు, బంగారం, వెండి వంటి విరాళాల నిర్వహణలో 2003-04 నుంచే అవకతవకలు జరుగుతున్నాయని ఆయన ఆరోపిస్తున్నారు. తన జీవితంలో హిందూత్వ భావజాలాన్ని అనుసరించిన దూబే.. ఇప్పుడు అదే హిందూత్వ సంస్థలతో అనుబంధం ఉన్న నాయకులపై అవినీతి ఆరోపణలు చేయడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.

‘యావత్‌ ‌హిందూ సమాజం గాయపడింది’
ధర్మసేన భారత్ అనే సంస్థను నడుపుతున్న సంతోశ్‌ దూబే.. రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్‌కు చెందిన నలుగురు వ్యక్తులపై తీవ్రమైన ఆరోపణలు చేస్తూ ఒక పేజీ ఫిర్యాదు సమర్పించారు. ఆ ఫిర్యాదు ప్రకారం.. ప్రతిరోజూ రామభక్తులు హుండీల్లో నగదు, బంగారం, వెండి నాణేలు, ఆభరణాల రూపంలో రూ.1 కోట్లకు పైగా విరాళాలు సమర్పిస్తున్నారనీ, ఈ విరాళాల నిర్వహణ బాధ్యత ట్రస్ట్ సభ్యులదేనని పేర్కొన్నారు. ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ బన్సల్, అనిల్ మిశ్రా, గోపాల్ రావు, అలాగే చంపత్ రాయ్ డ్రైవర్‌గా పనిచేస్తున్న రామశంకర్ యాదవ్ ఎలియాస్ తిన్నూ, మరికొందరు ఉద్యోగులతో కుమ్మక్కై ఆలయ నిధులను కాజేశారని ఆరోపించారు. ఈ కుట్ర ద్వారా రూ.200 కోట్లకు పైగా విలువైన విరాళాలు మాయమైనట్టు ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. “నగదు, ఆభరణాల రూపంలో వచ్చిన విరాళాలను తిరిగి రాబట్టాలంటే సంబంధిత వ్యక్తులపై వెంటనే ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలి. దర్యాప్తులో భాగంగా పాలిగ్రాఫ్ పరీక్షలు కూడా నిర్వహించాలి. ఈ దుర్మార్గపు చర్య వల్ల నాతో సహా యావత్ హిందూ సమాజం మనస్తాపానికి గురైంది” అని దూబే తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

బీజేపీ ‘డబుల్‌ ఇంజిన్‌’ ‌ సర్కారుపై విమర్శలు
గత మూడు దశాబ్దాలుగా ‘అయోధ్యలో రామ మందిరం’ నినాదాన్ని బీజేపీ రాజకీయంగా వాడుకున్నది. మత విద్వేషాలు రెచ్చగొట్టింది. దేశాన్ని అస్థిరతలోకి తీసుకెళ్లింది. 90వ దశకంలో మొదలైన అయోధ్య రామ మందిర నిర్మాణ అంశంతో కమలం పార్టీ రాజకీయంగా ఎంపీ సీట్లను పెంచుకోలిగింది. పలు రాష్ట్రాలకూ విస్తరించి అక్కడ అధికారాన్ని సొంతం చేసుకుంది. అయితే ప్రస్తుతం అయోధ్య రామాలయం కేంద్రంగా బటయకు వస్తున్న ఆరోపణలు యూపీలోని బీజేపీ ‘డబుల్‌ ఇంజిన్‌’ సర్కారు హయాంలోనే చోటు చేసుకోవడంతో కాషాయపార్టీ ఆత్మరక్ష‍ణలో పడిపోయింది. అధికార దాహంతో రామమందిరాన్ని రాజకీయంగా వినియోగించుకున్న బీజేపీ.. ఇప్పుడు వస్తున్న ఆరోపణలపై మాత్రం మౌనం పాటిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. 2024లో ఆలయ ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని ప్రధాని మోడీ రాజకీయ ప్రచార వేదికగా మలిచారని ప్రతిపక్షాలు ఆరోపించాయి. అయితే ఇప్పుడు అదే ఆలయానికి సంబంధించిన అవినీతి ఆరోపణల విషయంలో కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాలు స్పందించకపోవడం ఆ పార్టీ ద్వంద్వ వైఖరికి నిదర్శనమని విశ్లేషకులు చెప్తున్నారు. రాష్ట్రంలో చిన్నచిన్న కేసుల్లో బుల్డోజర్ రాజకీయాలు చేసే యోగి సర్కారు.. రామమందిర నిధుల వ్యవహారంలో మాత్రం ఎఫ్‌ఐఆర్ నమోదు చేయకపోవడం ప్రశ్నార్థకమని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. సాధారణ ప్రజలపై వేగంగా చర్యలు తీసుకునే ప్రభుత్వ యంత్రాంగం.. కోట్లాది మంది భక్తులు సమర్పించిన విరాళాలకు సంబంధించిన ఆరోపణల విషయంలో ఎందుకు నెమ్మదిగా వ్యవహరిస్తోందని సాధారణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

భూముల కొనుగోళ్లపై అనుమానాలు
ట్రస్ట్ కార్యదర్శి చంపత్ రాయ్ ఆధ్వర్యంలో జరిగిన కొన్ని భూముల కొనుగోళ్లు కూడా వివాదాస్పదమయ్యాయి. ప్రభుత్వ రేటు ప్రకారం సుమారు రూ.3 కోట్ల విలువ ఉన్న భూమిని రూ.23.61 కోట్లకు కొనుగోలు చేశారని ఆరోపణలు వచ్చాయి. మరో భూమిని ప్రభుత్వ రేటుతో పోలిస్తే దాదాపు 900 శాతం అధిక ధరకు కొనుగోలు చేసినట్టు పత్రాలు చూపుతున్నాయని ఫిర్యాదుదారులు పేర్కొంటున్నారు. ఈ భూములలో కొన్ని ప్రభుత్వ నజూల్ భూములుగా నమోదై ఉన్నాయనీ, అలాంటి భూములపై ప్రయివేటు లావాదేవీల చట్టబద్ధతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయోధ్య రామాలయం పేరుతో ట్రస్ట్‌ తక్కువ ధర పలికే భూములను ఎక్కువ రేట్లకు కొనడం వెనుక అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

రాజకీయంగా తీవ్ర దుమారం
ఈ వివాదం ఇప్పటికే రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. యూపీలోని ప్రధాన ప్రతిపక్ష‍ పార్టీ సమాజ్‌‌వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత అఖిలేశ్‌ ‌యాదవ్‌ ‌చేసిన ఆరోపణలతో అయోధ్య రామాలయంలో నిధుల దుర్వినియోగం అంశం తెరపైకి వచ్చింది. ఆ తర్వాత ఇది దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీసింది. సంతోశ్‌ ‌దూబే నుంచి మాత్రమే కాదు.. ప్రతిపక్ష‍ాల నుంచి కూడా ఫిర్యాదులు నమోదవుతున్నాయి. కాంగ్రెస్ నేత శరద్ శుక్లా, ఆప్‌ ఎంపీ సంజయ్ సింగ్ కూడా వేర్వేరుగా ఫిర్యాదులు చేశారు. ఆలయ విరాళాల లెక్కలు, ఆడిట్ నివేది కలు, సీసీటీవీ రికార్డులు బహిర్గతం చేయాలని వారు డిమాండ్ చేశారు. గత రెండేండ్లుగా ట్రస్ట్ ఆడిట్ నివేదికలు ప్రజలకు అందుబాటులో లేవని కూడా ప్రశ్నించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -