ఎలినో ఎఫెక్ట్‌తో వర్షాభావం
సరైన వర్షం రాకుండానే కొన్నిచోట్ల విత్తనాలు
వ్యవసాయశాఖ సాగు అంచనా 52 లక్షల ఎకరాలు
60 మిమీ వర్షం కురిస్తేనే నాటాలంటున్న వ్యవసాయ శాఖ
నాటిన చోట భూమిలోనే ఎండుతున్న గింజలు
జులై 15 వరకూ విత్తనాలు నాటవచ్చు
నవతెలంగాణ – ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
ఎలినో ప్రభావం పంటలపై తీవ్రంగా పడుతోంది. తొలకరి వర్షాలు ఆలస్యం అవుతుండటంతో విత్తన నాట్లకు ఇబ్బంది ఏర్పడుతోంది. చెదురుమదురుగా కురిసినా తేమ సరిగా లేకపోవడంతో పత్తి రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా వర్షాభావ పరిస్థితుల వల్ల విత్తనాలు వేయలేక, వేసిన విత్తనాలు మొలకెత్తక రైతన్నలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ముందుగానే విత్తనాలు నాటిన కొన్నిచోట్ల సరైన చినుకులు పడకపోవడం, ఎండల తీవ్రతకు విత్తనాలు మొలకెత్తక నష్టం వాటిల్లుతోంది. బోర్లు, బావుల వసతులు ఉన్న రైతులు గ్రామానికి పది మందిలోపు ఇలా ముందుగానే విత్తనాలు నాటారు. వర్షాలు ముఖం చాటేయడంతో మళ్ళీ విత్తనాలు వేయాల్సి వస్తుందనే ఆందోళన వీరిలో నెలకొంది. జులై 15 వరకూ విత్తనాలు నాటుకోవచ్చని.. కాబట్టి సరైన వర్షం రాకుండా రైతాంగం పత్తి విత్తనాలు నాటవద్దని వ్యవసాయ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. గతేడాది 45 లక్షల ఎకరాల్లో పత్తి సాగవగా… రాష్ట్ర వ్యవసాయశాఖ అంచనాల ప్రకారం 2026 ఖరీఫ్ సీజన్‌లో సుమారు 52 లక్షల ఎకరాల (సుమారు 21 లక్షల హెక్టార్లు) విస్తీర్ణంలో పత్తి సాగువుతుందని అంచనా. ఇందుకోసం ప్రభుత్వం ముందుగానే 212 లక్షల పత్తి విత్తన ప్యాకెట్లను సిద్ధం చేసింది. దేశ వ్యాప్తంగా ఖరీఫ్ సీజన్‌లో పత్తి సాగు విస్తీర్ణం దాదాపు 130 లక్షల హెక్టార్లు దాటవచ్చని అంచనా. కేంద్ర ప్రభుత్వం 2026-27 మార్కెటింగ్ సీజన్‌కు గాను పత్తి క్వింటాలుకు రూ.8,667 కనీస మద్దతు ధరను ప్రకటించింది.
60 మిల్లీ మీటర్ల వర్షం పడితేనే..
కనీసం 60 మి.మీ వర్షం పడి, భూమిలో తగినంత తేమ ఉన్నప్పుడే పత్తి విత్తనాలు నాటాలని వ్యవసాయశాఖ అధికారులు సూచిస్తున్నారు. తేమ లేని సమయంలో విత్తనాలు వేస్తే మొలక శాతం తగ్గి, తీవ్ర నష్టం వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. జూన్ చివరి వరకు వచ్చినా చినుకు జాడలేకపోవడంతో సాగు పనులు పుంజుకోవడం లేదు. కొద్దిపాటి వర్షానికే రైతులు ఆశగా పత్తి విత్తనాలు విత్తుకోగా, ఇప్పుడు అవి మొలకెత్తడం లేదు. దాదాపు 60 శాతం విత్తనాలు భూమిలోనే కుళ్లిపోగా, రానున్న రెండు, మూడు రోజుల్లో వర్షాలు పడకుంటే మిగిలిన విత్తనాలు కూడా పూర్తిగా పాడైపోయే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో మే చివరి వారంలో నాటిన పత్తి విత్తనాలు.. వేడి కారణంగా భూమి లోపలే మాడిపోయాయి. అయితే తొలకరి వర్షాలు పడినప్పుడు పత్తి విత్తనాలు విత్తుకోవద్దని వ్యవసాయ శాఖ ఆఫీసర్లు సూచిస్తున్నారు. తొలకరి వర్షాల సమయంలో భూమి కేవలం రెండు అంగుళాలు మాత్రమే తడుస్తుందని, భూమి లోపల వేడి అలాగే ఉంటుందని చెబుతున్నారు. ఈ వేడి వాతావరణంలో విత్తనం నాటినప్పుడు అవి తట్టుకోలేక భూమి లోపలే మాడిపోయి నల్లగా మారుతాయని చెబుతున్నారు. ఒకటి, రెండు వర్షాలకు కాకుండా, 60 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదై, భూమి లోతు వరకు తడిచి చల్లబడిన తర్వాతే రైతులు పత్తి విత్తనాలను విత్తుకోవాలని సూచిస్తున్నారు.
పెట్టుబడులు మట్టిపాలు
అధిక వర్షాల కారణంగా గత సీజన్‌లో పత్తి దిగుబడి తగ్గింది. చాలామంది రైతులు ముందస్తుగానే పత్తిని తొలగించి దాని స్థానంలో మొక్కజొన్నను సాగు చేశారు. ఎలినో కారణంగా ఈ సీజన్‌లో ఆశించిన వర్షాలు కురవవని రైతులు పత్తికే ప్రాధాన్యత ఇస్తున్నారు. కొందరు రైతులు వారికున్న భూమితో పాటు పక్క భూములను కౌలుకు తీసుకొని వాటిలో కూడా పత్తి విత్తనాలను విత్తేందుకు సిద్ధమయ్యారు. ఇందుకు గాను ఎకరాకు రూ.7,500 నుంచి రూ.15 వేల చొప్పున కౌలు చెల్లించారు. ఇవి కాకుండా పత్తి సాగు పెట్టుబడుల కింద ఎకరా పొలాన్ని దుక్కులు చేసుకోవడానికి ట్రాక్టర్‌కు రూ.3 వేల కిరాయి, విత్తనాలకు రూ.5 వేలు, గుంటుక కొట్టడానికి రూ.3 వేలు, విత్తనాలు వేయడానికి కూలీలకు రూ.1800 ఖర్చులయ్యాయి. ఇప్పుడు నాటిన విత్తనాలు ఎండిపోయి, భూమిలోనే కుళ్లిపోతుండటంతో రైతులకు ఎకరాపై దాదాపు రూ.8 వేలకు పైగా నష్టపోతున్నారు.
ఎలినో ఎఫెక్ట్‌తో పత్తి వైపే అధిక మొగ్గు
సాధారణ పరిస్థితుల్లో తెలంగాణలోని అత్యధిక జిల్లాల్లో వరి తర్వాత అధిక విస్తీర్ణంలో సాగువుతున్న పంట పత్తి. ఎలినో ఎఫెక్ట్ కారణంగా ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు నెలకొంటాయని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తుండటంతో బెట్ట పరిస్థితులను ఎదుర్కోగలిగే పత్తి వైపు అత్యధిక శాతం రైతులు మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో గతం కంటే ఈ ఏడాది పత్తిపై అధిక శాతం రైతులు అసక్తితో ఉన్నారు. వర్షాభావ పరిస్థితులను ఎదుర్కోగలిగే ప్రత్యామ్నాయ పంటలు వేయాల్సిందిగా వ్యవసాయ శాఖ సూచిస్తున్న తరుణంలో పత్తిని బెటర్ ఆప్షన్‌గా రైతులు ఎంచుకుంటున్నారు. దక్షిణ తెలంగాణ జిల్లాలైన ఉమ్మడి మహబూబ్‌నగర్, ఖమ్మం, నల్లగొండ, వరంగల్ జిల్లాల్లో ఇప్పటికే చాలా చోట్ల పత్తి దుక్కులు సిద్ధం చేశారు. అచ్చుతోలి సరైన వర్షం కోసం ఎదురుచూస్తున్నారు. నాటిన చోట విత్తనాలు ఎండిపోయాయి. దుక్కి చెడగొట్టి మరోసారి సిద్ధం చేస్తున్నారు.
వర్షం రాక గింజలు ఎండుతున్నాయి
కొద్దిపాటి వర్షాలకు గింజలు నాటాను. వర్షాలు వస్తాయనే నమ్మకంతో వేస్తే రావట్లేదు. సరైన తేమ లేక గింజలు ఎండిపోయాయి. మళ్లీ వేయాల్సి వస్తుంది. దీనివల్ల ఎకరానికి రూ. 8 వేల నష్టం వచ్చేలా ఉంది. వ్యవసాయ శాఖ అధికారులు చెప్పుతున్నారు కానీ వానలు రాకపోతాయా? అనుకున్నాను. గింజలు లేటైతే పంట వెనకవుతుందనుకున్నా కానీ ఇలా వర్షాలు ముఖం చాటేస్తాయి అనుకోలేదు.
బోడ మున్నా,
బంధంపల్లి, కౌలు రైతు
పత్తి రైతుకు చినుకు చింత
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



