ఓఎంఆర్‌ షీట్‌లను రీ వాల్యుయేషన్‌ చేయాలి

ఓఎంఆర్‌ షీట్‌లను రీ వాల్యుయేషన్‌ చేయాలి– కోర్టు పర్యవేక్షణలో నీట్‌పై దర్యాప్తు జరగాలి
– న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు
– నీట్‌ పరీక్ష మళ్లీ నిర్వహించండి : అభ్యర్థుల డిమాండ్‌
న్యూఢిల్లీ : నీట్‌ స్కామ్‌పై మరో పిటిషన్‌ సుప్రీంకోర్టులో దాఖలైంది. స్కోర్లు ఇవ్వడంలో తేడాలున్నాయని, అందువల్ల అందరి ఒఎంఆర్‌ ఆన్సర్‌ షీట్‌లను మళ్లీ పూర్తిగా రీ వాల్యుయేషన్‌ చేయాలని, అభ్యర్ధులకు తిరిగి ర్యాంకులివ్వాలని, కోర్టు పర్యవేక్షణలో విచారణ జరగాలని ఆ పిటిషన్‌ పేర్కొంది. మే 5న జరిగిన నీట్‌ పరీక్షకు హాజరైన 8మంది విద్యార్ధులు 32వ ఆర్టికల్‌ కింద ఈ రిట్‌ పిటిషన్‌ వేశారు. దేశవ్యాప్తంగా నిర్వహించిన ఈ పరీక్షకు 24లక్షల మందికి పైగా విద్యార్ధులు హాజరయ్యారు
ఓఎంఆర్‌ షీట్‌లతో పోలిస్తే విద్యార్ధులు వారి స్కోరు కార్డులపై భిన్నమైన మార్కులు నమోదయ్యాయి. గ్రేస్‌మార్కుల వల్ల ఈ తేడాలు రాలేదు. పైగా వీరు, గ్రేస్‌ మార్కులు కలిపిన కేంద్రాలకు చెందిన విద్యార్ధులు కూడా కాదు. సాధారణంగా 720కి 720 మార్కులు సాధించేవారు ముగ్గురు లేదా నలుగురు వుంటారు కానీ ఈసారి ఏకంగా 67మంది అభ్యర్ధులకు టాప్‌ ర్యాంకులు వచ్చాయి. కనివినీ ఎరుగని రీతిలో కటాఫ్‌ మార్కులు, సగటు మార్కులు పెంచడం వల్లనే ఈ పరిస్థితి ఎదురైందని ఆ పిటిషన్‌ పేర్కొంది.
జూన్‌ 4న ఫలితాల ప్రకటన, 6న ఫలితాలపై అడిగిన ప్రశ్నలకు వివరణ ఇస్తూ ఎన్‌టిఎ జారీ చేసిన పత్రికా ప్రకటనలు కూడా అక్రమమైనవని, చెల్లవని ప్రకటించాల్సిందిగా వారు కోరారు.
అందరికీ మళ్లీ పరీక్ష పెట్టండి
నీట్‌ పరీక్షను దేశవ్యాప్తంగా మళ్లీ నిర్వహించాల్సిందిగా అభ్యర్ధులు డిమాండ్‌ చేస్తున్నారు. గ్రేస్‌ మార్కులు కలిపిన 1563 మంది విద్యార్థులకు మళ్లీ పరీక్ష నిర్వహిస్తామని ఎన్‌టిఎ ప్రకటించిన మరుసటి రోజు ఆందోళనకారులు తమ మిగిలిన డిమాండ్ల సాధనకై కేంద్ర విద్యాశాఖ కార్యాలయానికి ప్రదర్శన నిర్వహించారు. తక్షణమే ఈ అవకతవకలపై దర్యాప్తు చేపట్టి, చర్యలు తీసుకోవాలని కోరారు. లోపాలు, లొసుగులు వున్నాయని తేలితే ఎన్‌టిఓలో జవాబుదారులెవరో నిర్ధారిస్తామని కేంద్ర మంత్రి దేవేంద్ర ప్రధాన్‌ చెప్పారు. తమ డిమాండ్లన్నీ నెరవేరేవరకు తమ ఆందోళన కొనసాగుతుందని వారు స్పష్టం చేశారు.
నీట్‌ పరీక్షలో గ్రేస్‌ మార్కులొక్కటే సమస్య కాదని, అనేక అక్రమాలు జరిగాయని కాంగ్రెస్‌ నేతలు పేర్కొన్నారు. సుప్రీం కోర్టు ఆదేశాలకు అనుగుణంగా అవసరమైన చర్యలు తీసుకోవడానికి ఎన్‌టిఎ సిద్ధంగా వుందని మంత్రి ప్రధాన్‌ చెప్పారు. కౌన్సెలింగ్‌ ప్రక్రియ కూడా అనుకున్న విధంగా సాగుతుందన్నారు. తమ అభ్యంతరాలన్నీ పరిష్కారమయ్యేవరకు కౌన్సెలింగ్‌ జరగరాదని ఆందోళనచేస్తున్న అభ్యర్ధులు కోరారు.
నీట్‌ స్కామ్‌పై సిబిఐ దర్యాప్తు చేపట్టి, బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని వారు కేంద్రానికి ఒక లేఖ రాశారు. సమస్యలు పరిష్కారం కాకుండా కౌన్సెలింగ్‌ నిర్వహిస్తే దొడ్డిదారిన వెళేంల వారందరూ లబ్ది పొందుతారని, రోజుకు 16గంటలు కష్టపడి చదివిన వారు ఇబ్బందులు పడతారని డాక్టర్‌, సామాజిక కార్యకర్త భూపేంద్ర చౌరాసియా వ్యాఖ్యానించారు. నీట్‌ అభ్యర్ధులతోపాటు ఐఎఫ్‌ఎంఎస్‌ (ఇండియన్‌ ఫారిన్‌ మెడికల్‌ స్టూడెంట్స్‌) ప్రతినిధి బృందంలో ఆయన కూడా వున్నారు.

Spread the love