26న ఆర్టీసీ కార్మికుల చలో ఇందిరాపార్క్‌

On 26th RTC workers Chalo Indira Park– టీఎస్‌ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ పిలుపు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈనెల 26న చలో ఇందిరాపార్క్‌ ఆందోళనా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు టీఎస్‌ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ తెలిపింది. సంస్థను ప్రభుత్వంలో విలీనం చేసే కంటే ముందే అనేక సమస్యల్ని పరిష్కరించాల్సి ఉందనీ, వాటిపై ప్రభుత్వం, యాజమాన్యం దృష్టి పెట్టట్లేదని జేఏసీ ప్రతినిధులు చెప్పారు. ఆదివారంనాడిక్కడి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జేఏసీ సమావేశం చైర్మెన్‌ కే రాజిరెడ్డి అధ్యక్షతన జరిగింది. కన్వీనర్‌ వీఎస్‌ రావు, కో కన్వీనర్‌ కత్తుల యాదయ్య, నాయకులు పీ రవీందర్‌రెడ్డి, వినాయక రెడ్డి, ఏఎస్‌ రెడ్డి, కుఫిన్‌, బుద్దవిశాల్‌, గంగాధర్‌, జీ రాములు, మోసిన్‌ తదితరులు పాల్గొన్నారు. విలీనం కంటే ముందే పరిష్కరించాల్సిన సమస్యలపై చర్చించారు. దానిలో భాగంగా 26వ తేదీ చలో ఇందిరాపార్క్‌ ఆందోళన నిర్వహించాలని నిర్ణయించారు. ఏడేండ్లుగా ఆర్టీసి కార్మికులకు రావల్సిన రెండు వేతన సవరణలు జరగలేదని చెప్పారు. 7 సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్న 2017 ఏప్రిల్‌ 1 నాటి మూల వేతనానికి 31.1 శాతం డిఏ కలిపి, 30 శాతం ఫిట్‌మెంట్‌ ఇవ్వాలనీ, దానితో పాటే నాలుగేండ్ల బకాయిలు కూడా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. 2021 వేతన సవరణను ప్రభుత్వ ఉద్యోగులతో సమానం చేస్తూ మాస్టర్‌ పే స్కేల్‌ నిర్ణయించాలని కోరారు. 2013 వేతన సవరణ బకాయిల్లో 50శాతం బాండ్ల డబ్బులు ఇవ్వలేదనీ, వాటికి 8.75శాతం వడ్డీతో కలిపి చెల్లించాలని చెప్పారు. పెండింగ్‌లో ఉన్న డిఏలు, వాటి బకాయిలు, సీసీఎస్‌కు ఇవ్వాల్సిన డబ్బు, ఎస్‌ఆర్‌బీటీ, ఎస్‌బీటీ బకాయిలు తక్షణం చెల్లించాలని కోరారు. రిటైర్‌ అయిన కార్మికులకు వెంటనే టెర్మినల్‌ బెనిఫిట్స్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ సమస్యలు పరిష్కరించకుండా విలీనం ప్రక్రియ జరిగితే కార్మికులు ఆర్థికంగా చాలా నష్టపోతారని వివరించారు. వాటి సాధన కోసమే 26న చలో ఇందిరాపార్క్‌ ఆందోళన నిర్వహిస్తున్నామనీ, యూనియన్లకు అతీతంగా కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

Spread the love