మూడో వంతు మందికే పింఛన్‌

– వికలాంగులకు అన్యాయం చేస్తున్న బీఆర్‌ఎస్‌
– బహిరంగ చర్చకు రావాలని సవాల్‌ : ముత్తినేని వీరయ్య
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలోని వికలాంగుల్లో మూడో వంతు మందికే పింఛన్‌ ఇస్తూ వారికి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అన్యాయం చేస్తున్నదని టీపీసీసీ వికలాంగుల విభాగం చైర్మెన్‌ ముత్తినేని వీరయ్య విమర్శించారు. సోమవారం గాంధీభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వికలాంగుల సంక్షేమంపై సీఎం కేసీఆర్‌ లేదా మంత్రులు చర్చకు రావాలనీ, లేకపోతే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ పార్టీ వికలాంగుల విభాగం పోరాట ఫలితంగానే వారి పింఛన్‌ను రూ.4,016కు పెంచిందని తెలిపారు. 2016 వికలాంగుల హక్కుల చట్టం ప్రకారం వారికి బడ్జెట్‌లో ఐదు శాతం అంటే రూ.16,025 వేలు పింఛన్‌ ఇవ్వాల్సి ఉందని వివరించారు. 2011లో 10,46,822 మంది ఉంటే ప్రస్తుతం వికలాంగుల జనాభా 13 లక్షలకు పెరిగే అవకాశముందని తెలిపారు. గతంలో 7 రకాల వైకల్యాలు కలిగిన వారే ఉంటే దాన్ని మరో 14 రకాల వైకల్యాలను చేర్చడం ద్వారా 21 రకాల వికలాంగులున్నారనీ, ఆ లెక్కన రాష్ట్రంలో 16 లక్షల నుంచి 17 లక్షల మంది ఉన్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కేవలం 4 లక్షల మందికి మాత్రమే పింఛన్‌ ఇస్తుంటే మిగతా 11 లక్షల మంది ఏమయ్యారని ప్రశ్నించారు.
ఉపాధి హామీ పథకం కింద వికలాంగులకు 150 రోజుల పని కల్పించి 25 శాతం పెంచి ఇవ్వాల్సి ఉన్నా….కేసీఆర్‌ సర్కార్‌ దాన్ని అమలు చేయలేదని విమర్శించారు. గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన మోటరైజ్డ్‌ వెహికిల్‌ సబ్సిడీ రూ.500 ను ఎత్తేసిందని దుర్మార్గం బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానిదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాకో స్టడీ సర్కిల్‌ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చి హైదరాబాద్‌లో ఉన్న ఒక్క వికలాంగుల స్టడీ సర్కిల్‌ మూసేసిన ఘనత సీఎం కేసీఆర్‌ దేనని ఎద్దేవా చేశారు. గృహలక్ష్మి, దళిత బంధు పథకాల్లో వికలాంగుల వాటా అమలు చేయడం లేదనీ, వారి సంక్షేమానికి సంబంధించిన 75కు పైగా జీవోలను తొక్కిపెట్టిందని బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్‌ కు మానవత్వం ఉంటే వికలాంగుల సంఖ్య ఎంతో చెప్పాలని ముత్తినేని సవాల్‌ విసిరారు.

Spread the love