ఏ నదైనా ఒకే దిశలో ప్రవహిస్తుంది. కానీ ఆ ప్రవాహంలో నిలబడితే గానీ, దాని బలం అర్థం కాదు. కుందూ నది ఒడ్డున ఉన్న అనేకానేక గ్రామాల్లో ఒకదానిలో పుట్టి పెరిగిన సుధాకర్‌కు ఆ సంగతి చిన్నప్పటి నుండే తెలుసు. కానీ ఆ అనుభవం నది దగ్గరే ఆగిపోయింది, జీవితంలోకి ఇంకా ప్రవేశించలేదు. ఆ రోజు సోమవారం. ఉదయం తొమ్మిది దాటింది. వీకెండ్‌కి స్వగ్రామానికి వచ్చిన సుధాకర్, ఎనభై కిలోమీటర్ల దూరంలో ఉన్న జిల్లా కేంద్రంలోని తన ఆఫీసుకు బయలుదేరి చాలాసేపయింది. నేషనల్ హైవే మీద ఎక్కడో ఒక లారీ బోల్తా పడిందని ట్రాఫిక్ కదలడం లేదు. రోడ్డుకు ఇరువైపులా వాహనాలు బారులు తీరి ఉన్నాయి. సుధాకర్ కారు కూడా వాటిల్లో ఒకటిగా చిక్కుకుపోయింది.
స్టీరింగ్ మీద వేళ్ళు అసహనంతో టకటకమని శబ్దం చేస్తున్నాయి. మొబైల్‌లో వాట్సాప్ నోటిఫికేషన్ మెరిసింది. జోనల్ హెడ్ మహేశ్వరన్ సార్ నుండి మెసేజ్: ”రివ్యూ మీటింగ్ సరిగ్గా పదిన్నరకు. అందరూ టైమ్‌కు జాయిన్ అవ్వాలి.” సుధాకర్ ఆ మెసేజ్ చదివి కళ్ళు మూసుకున్నాడు. ఛాతిలో ఏదో బిగుసుకున్నట్లయింది. మహేశ్వరన్ సార్‌కు రిప్లై ఇవ్వాలనుకున్నాడు. ”సార్, హైవే మీద యాక్సిడెంట్ వల్ల ట్రాఫిక్ బ్లాక్…” అని టైప్ చేసి ఆగిపోయాడు. ఆ వాక్యం చూస్తూ ఉండిపోయాడు. ఆరునెలలుగా నరసింహ ”సార్, బస్సు ఆలస్యం” అని చెప్పినప్పుడల్లా తన మొహంలో కనిపించిన చిరాకు గుర్తొచ్చింది. ఆ మెసేజ్ డిలీట్ చేశాడు. ఏమీ రిప్లై ఇవ్వలేదు.
సాధారణంగా తను టైమ్‌కు ఆఫీసుకు చేరుకుంటాడు. ఈ రోజు పరిస్థితి చేతిలో లేదు. ఆరునెలల క్రితం తన ఆఫీసులో రోజూ తొమ్మిది గంటల నలభై అయిదు నిమిషాల నుండి పదిన్నరకు మధ్యలో బయోమెట్రిక్ అటెండెన్స్ వేసే నరసింహను చూసి ”ఇంత ఆలస్యం ఏంటి?” అని అడిగేవాడు. నరసింహ తలొంచుకుని ”సార్, నంద్యాల నుండి వస్తున్నాను, బస్సు ఆలస్యం” అని సణిగేవాడు. ”ప్రతిరోజూ తెల్లవారుజామునే కంపెనీ బస్సుల కోసం రోడ్డు మీద నిలబడి ఉండే ఫ్యాక్టరీ కార్మికులను మనం చూస్తున్నాం కదా? వాళ్ళకు లేని సమస్య నీకు ఎందుకు?” అని కసురుకునేవాడు. నరసింహ ఆ మాట వింటూ తలవంచుకుని నిలబడేవాడు.
ఇప్పుడు తను కూడా అదే స్థితిలో ఉన్నాడు. ఈ ట్రాఫిక్‌లో చిక్కుకుని, మీటింగ్ టైమ్ దగ్గర పడుతుంటే, ఛాతీలో అదే బిగుతు. తేడా ఒక్కటే. తనకు ఇది ఒక్కరోజు. నరసింహకు ఇది ప్రతిరోజూ.
ఆరునెలల క్రితం ఈ ఆఫీసుకు ట్రాన్స్‌ఫర్ అయి వచ్చినప్పుడు, మొదటి రోజే సుధాకర్‌కు అర్థమైంది. ఈ ఆఫీసు మీద ఏదో మగత కమ్ముకుని ఉందని. తొమ్మిదింటికి తలుపు తీయాల్సిన ఆఫీసు తొమ్మిదిన్నరకు కూడా నిశ్శబ్దంగా ఉంది. పదింటికి ఒక్కొక్కరు నెమ్మదిగా రావడం మొదలుపెట్టారు. నలుగురు క్లర్కులు, ఒక అటెండెంట్, తనకింద పని చేసే మరో ఆఫీసర్. కేవలం ఏడుగురితో నడిచే చిన్న జిల్లా ఆఫీసు. క్లర్క్ శేఖర్ తన సీట్లో కూర్చుని ఫోన్ స్క్రీన్ మీద వేలు కదుపుతున్నాడు. పక్కన ఫైళ్ళు చిందరవందరగా పడి ఉన్నాయి. డెస్క్ మూలన పాత ట్రైనింగ్ మాన్యువల్ మడత పడి ఉంది. గతంలో ఎప్పుడో ప్రాంతీయ కార్యాలయం ద్వారా పంపించబడింది. చదివిన ఆనవాళ్ళు లేవు. అకౌంటెంట్ పద్మ కంప్యూటర్ ఆన్ చేసి, ఇంటి నుండి తెచ్చుకున్న స్టీల్ గ్లాసులో టీ తాగుతూ, లక్ష్మితో ఏదో చర్చ. ”ఆ క్లెయిమ్ రెండు వారాల క్రితం నాటిది కదా?” అని లక్ష్మి అడిగితే, ”రెండు వారాల నాటిదో, మూడు వారాల క్రితందో, చూస్తాలే” అని పద్మ నిరాసక్తంగా చెప్పింది. సీనియర్ అసిస్టెంట్ నరసింహ ఇంకా రానేలేదు.
సుధాకర్ తన క్యాబిన్‌లో కూర్చుని ఈ దశ్యం చూశాడు. కోపం రాలేదు, ఆశ్చర్యం వేసింది. వీళ్ళలో ఎవరికీ పని మీద శ్రద్ధ లేకపోవడం కాదు, పని చేయాలనే తొందర లేదు. మొదటి వారంలోనే సుధాకర్ కొన్ని మార్పులు చేశాడు. వర్క్ రీ డిస్ట్రిబ్యూషన్ చేశాడు. ప్రతి క్లెయిమ్‌కు గడువు నిర్ణయించాడు. రోజువారీ ట్రాకింగ్ మొదలుపెట్టాడు. కానీ పద్ధతి మారింది, మనుషులు మారలేదు. మొదటి స్టాఫ్ మీటింగ్‌లో సుధాకర్ స్పష్టంగా చెప్పాడు. ”మనం ఈ ఆఫీసును మారుద్దాం. టైమ్‌కు రావడం, క్లెయిమ్‌లు పెండింగ్ లేకుండా చూడడం. ఇవి నేను ఆశించే కనీస విషయాలు.” గదిలో నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దం సమ్మతి కాదు, మౌన తిరస్కారం. శేఖర్ పద్మ వైపు చూశాడు. పద్మ కళ్ళు తిప్పుకుంది. నరసింహ తలొంచుకుని కుర్చీ అంచు మీద వేళ్ళు రాస్తూ కూర్చున్నాడు. లక్ష్మి ఏమీ మాట్లాడలేదు.
రోజులు గడిచాయి. శేఖర్ ఫైళ్ళు పుటప్ చేస్తున్నాడు, కానీ తప్పులు తగ్గలేదు. ”సార్, ఇంతవరకూ ఎవ్వరూ నాకు సరిగా నేర్పించలేదు” అనేవాడు. సుధాకర్ విసుగ్గా ”ట్రైనింగ్ కోసం ఇంకెంత కాలం ఎదురుచూస్తావ్? పాత ఫైళ్ళు చదువు, నేర్చుకో” అనేవాడు. పద్మ పని చేస్తుంది, కానీ తన తీరులో తను. ”సార్, నేను ఈ సీట్లో పదేళ్ళుగా ఉన్నాను. వేగంగా చేసి తప్పులు చేయడం కంటే, నిదానంగా కరెక్ట్‌గా చేయడం మంచిది కదా సార్” అనేది. నరసింహ… ఇతనే అసలు సవాలు. ప్రతిరోజూ ఆలస్యం. నంద్యాల నుండి డెబ్భై కిలోమీటర్లు. భార్యకు కీళ్ళ నొప్పులు. పిల్లల్ని స్కూల్లో వదిలి వచ్చాకే బయలుదేరతాడు. ఆఫీసుకు వచ్చాక కుర్చీలో కూర్చునేటప్పుడు మోకాళ్ళు నొక్కుకునేవాడు. టీ తాగేటప్పుడు చేతులు వణికేవి. సుధాకర్ ఇవి చూశాడు, కానీ చూడనట్లు ఉన్నాడు.
ఒకరోజు లంచ్ టైమ్‌లో నరసింహ వరండాలో ఫోన్‌లో మాట్లాడుతూ వినిపించాడు. ”అమ్మా, మందు వేసుకున్నావా? తల తిరుగుడు కొద్దిగానైనా తగ్గిందా? సాయంత్రం వచ్చి డాక్టరు దగ్గరకు తీసుకెళ్తాను…” ఆ గొంతులో ఆఫీసులో ఎప్పుడూ వినిపించని మెత్తదనం ఉంది. సుధాకర్ విన్నాడు. రాయి మీద నీటి చుక్క పడినట్లు. కానీ ”అందరికీ కష్టాలుంటాయి. పని పనే” అనుకున్నాడు. ఆ నీటి చుక్క ఆవిరైపోయింది. ఈ ఆఫీసులో ఇంకో పేరు దినచర్యలో భాగమైపోయింది. ”రంగనాథ్ సార్.” సుధాకర్‌కు ముందు ఈ ఆఫీసులో ఉన్న అధికారి. ”రంగనాథ్ సార్ గ్రేట్ సార్. ఎవర్నీ ఏమనేవారు కాదు.” శేఖర్ మాటల్లో గౌరవం ఉంది, కానీ ఒక విధమైన జిత్తు కూడా ఉంది. ”ఆయన దగ్గర ప్రశాంతంగా పని చేసేవాళ్ళం” పద్మ నిట్టూర్పు. సుధాకర్‌కు ఈ మాటలు చెవిన పడ్డప్పుడల్లా లోపల అసహనం రేగేది. కానీ పైకి చూపించేవాడు కాదు.
ఆ నెలలో కొత్త జోనల్ హెడ్ వచ్చారు. మహేశ్వరన్ సార్. ప్రమోషన్ తీసుకుని బదిలీ మీద వచ్చారు. మరో రాష్ట్రంలో తన ఆఫీసును దేశంలోనే అత్యుత్తమంగా తీర్చిదిద్దిన రికార్డ్ ఆయనది. తొలి సమావేశంలోనే శైలి స్పష్టమైంది. ”ప్రజల డబ్బుకు మనం ట్రస్టీలుగా ఉన్నాం. క్లెయిమ్ చేసినవారికి సకాలంలో అందాలి. ఈ విషయంలో రాజీ ఉండదు” అన్నారు. సుధాకర్‌కు ఆ మాటలు నచ్చాయి. కానీ ఆ సంతోషం ఎక్కువ రోజులు నిలవలేదు. మొదటి రివ్యూలో మహేశ్వరన్ సార్ అడిగారు. ”మీ ఆఫీసులో పెండింగ్ క్లెయిమ్‌లు ఇంత ఎక్కువగా ఎందుకున్నాయి?” సుధాకర్.. ”సార్, స్టాఫ్ కోఆపరేషన్…” అని మొదలుపెట్టాడు. ”స్టాఫ్ కోఆపరేషన్ రాబట్టుకోవడం ఆఫీసర్ బాధ్యత.” మహేశ్వరన్ సార్ గొంతులో కనికరం లేదు, కఠినత్వమూ లేదు. నిజం ఉంది.
ఇప్పుడు ప్రతి వారం రివ్యూ. ప్రతి ఫైల్ లెక్క. రాత్రి పదకొండుకు ల్యాప్‌టాప్ తెరిచి గణాంకాలు చూస్తున్నాడు. భార్య ”భోజనం చేయి” అంటే ”ఉండు” అన్నాడు. ర్యాంకింగ్ తక్కువగా ఉంటే మహేశ్వరన్ సార్ ప్రశ్నలు సూటిగా ఉంటాయి. ఒక రివ్యూలో సుధాకర్ చెప్పాడు. ”సార్, గతం నుంచే ఈ జిల్లా ఆఫీస్ పనితీరు సరిగ్గా లేదు. ట్రైనింగ్ లోపాలున్నాయి. సిబ్బంది పాత పద్ధతికి అలవాటుపడ్డారు…” చెప్తూ ఉండగానే ఆగిపోయాడు. ఈ మాటలు… ఇవి తనవి కావు. ఇవి శేఖర్ మాటలు. పద్మ మాటలు. నరసింహ మాటలు. ఆరునెలలుగా తన చెవిలో పడి విసుగు పుట్టించిన వాక్యాలు, ఇప్పుడు అక్షరం పొల్లు పోకుండా తన నోటి నుండి వస్తున్నాయి.
మహేశ్వరన్ సార్ తల ఊపి ”వచ్చేవారంలో ఇంప్రూవ్‌మెంట్ చూపించండి” అన్నారు.
ఆ రాత్రి సుధాకర్ ల్యాప్‌టాప్ తెరవలేదు. వరండాలో చీకట్లో కూర్చున్నాడు. ఒకరోజు రికార్డ్ రూమ్‌లో పాత ఫైళ్ళు తిరగేస్తుంటే కనిపించిన విషయం గుర్తొచ్చింది. రంగనాథ్ హయాంలో పెండింగ్ క్లెయిమ్‌లు ఏడాదికేడాది పెరిగాయి. కొన్ని ఫైళ్ళలో ”సమాచారం అసంపూర్ణం” అని నోట్ రాసి పక్కన పెట్టి ఉన్నాయి. సిబ్బందికి సౌకర్యం, ప్రజలకు నష్టం.రంగనాథ్ వదిలేశారు. తను ఒత్తిడి చేశాడు, కానీ దారి చూపించలేదు. మహేశ్వరన్ సార్ కూడా అదే చేస్తున్నారు. ముగ్గురిలో ఎవరూ ”రా, కలిసి నడుద్దాం” అనలేదు. ట్రాఫిక్ కదిలింది. సుధాకర్ కారు ముందుకు నడిపాడు. హైవే ఇరువైపులా రాయలసీమ నేల. ఎండిన చేలు, అక్కడక్కడా రేగు చెట్లు. ఈ నేల మీద పుట్టిన మనుషులు కరువునూ తట్టుకుని నిలబడతారు, కానీ లొంగరు.
ఆఫీసుకు చేరుకునేసరికి పదకొండు గంటలయింది. మహేశ్వరన్ సార్ మీటింగ్ అప్పటికే మొదలై అరగంట అయింది. సుధాకర్ గబగబా జూమ్‌లో జాయిన్ అయ్యాడు. ఆయన ఒక్కసారి స్క్రీన్ మీద చూసి, ఏమీ అనకుండా ప్రెజెంటేషన్ కొనసాగించారు. ఆ ”ఏమీ అనకుండా”… కోపం కంటే, విమర్శ కంటే, ఆ నిశ్శబ్దం ఎక్కువ నొప్పించింది. ఆ అపరాధ భావన ఎవరూ చెప్పకుండానే లోపల చేరింది. నరసింహ ప్రతిరోజూ తన క్యాబిన్ తలుపు దగ్గర నిలబడేటప్పుడు, అతని కళ్ళలో ఇదే ఉండేదా?
మీటింగ్ అయిన తర్వాత కొద్దిసేపటికి నరసింహ హడావిడిగా వచ్చాడు. చెమటతో తడిసిన చొక్కా, కాళ్ళకు దుమ్ముకొట్టుకున్న చెప్పులు, ఆయాసంతో ఊపిరి తీసుకుంటూ. సుధాకర్ క్యాబిన్ తలుపు దగ్గర ఆగి ”సార్, బస్సు ఆలస్యం…” అని చెప్పబోయాడు. సుధాకర్ అతని వైపు చూశాడు. ఏదో అనబోయాడు. ఆగాడు.
”రా, కూర్చో” అన్నాడు. నరసింహ ఆశ్చర్యంగా చూశాడు. ”చెప్పు, నంద్యాల నుండి ఇక్కడికి రావడానికి ఎంత సమయం పడుతుంది?” నరసింహ చెప్పాడు. ప్రతిరోజూ గంటన్నర పైగా ప్రయాణం. ”ఆరున్నరకు లేస్తాను సార్. ఎనిమిదింటి బస్సు పట్టుకుంటే తొమ్మిదిన్నరకు చేరుకుంటాను. ఆ బస్సు తప్పితే…” ఆగాడు.
సుధాకర్ వింటున్నాడు. మొదటిసారి నిజంగా వింటున్నాడు.
”నీ పరిస్థితి అర్థమైంది. రేపటి నుండి పది గంటలకు రా. ఆ అరగంట సాయంత్రం పూర్తి చేయి. ఒక నెల ఇలా చేద్దాం. పెండింగ్ తగ్గితే కొనసాగిద్దాం.”
నరసింహ సుధాకర్ కళ్ళలోకి చూశాడు. ఆ కళ్ళలో ఇంతకు ముందు కనిపించిన కాఠిన్యం లేదు. ”అలాగే సార్” అన్నాడు. ఆ ”అలాగే”లో ఆరునెలల్లో లేని ఏదో ఉంది. కొద్దిసేపటికి శేఖర్ ఒక ఫైల్ తెచ్చాడు. అకౌంటింగ్ తప్పులు కనిపిస్తున్నాయి. సుధాకర్ ”ఇవి తప్పు”అని చెప్పబోయి ఆగాడు. ”ఏ రూల్ ప్రకారం ఈ లెక్క వేశావ్?” అని అడిగాడు. శేఖర్ తెల్లమొహం వేశాడు. ”ఆగు, ఆ మాన్యువల్ తీసుకురా, కలిసి చూద్దాం” అని సుధాకర్ చెప్పాడు. శేఖర్ ఆశ్చర్యంగా చూశాడు. ఈ ఆఫీసర్ ”కలిసి చూద్దాం” అనడం ఇదే మొదటిసారి.
సుధాకర్ కిటికీ బయటికి చూశాడు. మామిడి చెట్టు మీద ఉదయపు ఎండ పడి ఆకులు మెరుస్తున్నాయి. ఫోన్‌లో మహేశ్వరన్ సార్ నుండి రేపటి టార్గెట్ రివ్యూ మెసేజ్ వచ్చింది. ఛాతీలో మళ్ళీ బిగుతు. అది పోలేదు. ానీ ఈసారి సుధాకర్ ఆ మెసేజ్‌కు రిప్లై ఇచ్చాడు. ”సార్, రేపటి మీటింగ్‌లో నా ఆఫీసు ఇంప్రూవ్‌మెంట్ ప్లాన్ ప్రెజెంట్ చేయడానికి అనుమతి ఇవ్వగలరా?” మామిడి ఆకుల సందుల్లోంచి ఎండ నేల మీద చిన్న చిన్న వెలుగు బొట్లుగా పడుతోంది. వెలుగు, నీడ. కలిసే ఉన్నాయి. నదిలో నిలబడితే గానీ ప్రవాహం బలం తెలియదు. కానీ నిలబడ్డ తర్వాత, తడిసిన తర్వాత, ఒడ్డుకు ఎలా చేరాలో… అది ఎవరూ చెప్పరు. అది తనే నేర్చుకోవాలి.
కొమ్మెర వెంకట సుబ్బయ్య, 8778099283



