ఓరుగల్లు బాలల కథల కొండ

కవి, రచయిత, కార్టునిస్టు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల బాధ్యుడు, అనేక వికాస, విస్తార కార్యక్రమాల కార్యకర్త ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు చెందిన బాల సాహితీవేత్త, బాలల వికాసం, విజ్ఞానం కోసం అనేక వ్యాసాలు వ్రాసిన వ్యాసకర్త మెండు ఉమామహేశ్వర్‌. మెండు ఉమామహేశ్వర్‌ 18 ఆగస్ట్‌, 1965న ఉమ్మడి వరంగల్‌ జిల్లా నాగారంలో పుట్టారు, విద్యాబ్యాసం, పెరిగి పెద్దయ్యింది పరకాలలో, నివాసం ఉంటున్నది హనుమకొండలో. శ్రీమతి మెండు రాజమ్మ-శ్రీ రాజయ్య వీరి అమ్మానాన్నలు.
ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయాల నుండి ఎం.ఎ., ఎం.ఎడ్‌తో పాటు పి.జి డిప్లమా ఇన్‌ గైడెన్స్‌, టిటిసి డ్రాయింగ్‌లు పూర్తిచేసిన వీరు రచయిత, కవిగానే కాక కార్టునిస్టుగా, సైకాలజిస్టుగా, కౌన్సిలర్‌గా ప్రసిద్ధులు. ఉపాధ్యాయ వృతిలోకి ప్రవేశించే ముందు ప్రముఖ పత్రికల్లో విలేకరిగా పనిచేశారు. చిత్రకారుడుగా అనేక సందేశాత్మక చిత్రాలను అందించారు. రచయితగా, కవిగా అనేక రచనలు వివిధ పత్రికల్లో అచ్చయ్యాయి. బాలల కథా రచయితగా బాలమిత్ర, బాల రంజని, బాలజ్యోతి మొదలగు పత్రికల్లో అరవైకిపైగా కథలు అచ్చయ్యాయి. 1980 ప్రాంతంలో బాల వికాసం కోసం వీరు రాసిన వ్యాసాలు మార్గదర్శి వంటి పత్రికల్లో అచ్చయ్యాయి.
ఉపాధ్యాయులుగా తొలినుండి పిల్లల వికాసం సాహిత్యం ద్వారా జరుగుతుందని ప్రగాఢంగా నమ్మే మెండు ఉమామహేశ్వర్‌ గ్రామీణ విద్యార్థుల ప్రగతి కోసం బాల వికాస్‌ వంటి స్వచ్చంధ సంస్థలు చేసిన సాహతీ యజ్ఞంలో పాల్గొని కథా రచన చేశారు. ఈ నేపథ్యంగా వచ్చిన ‘బాల వికాస కథలు’ పుస్తకంలో ప్రముఖలుందరితో పాటు వీరి కథ ‘సత్యాగ్రహం’ మెండు ఉమామహేశ్వర్‌ ఉపాధ్యాయులుగా ఎంత నిబద్ధతతో పాఠాలు చెబుతారో, రచయితగా అలాగే పనిచేస్తున్నారు. అందులోనూ వైజ్ఞానిక, హేతువాద దృక్పథాలను పిల్లల్లో కలిగించేందుకు తొలినుండి పనిచేస్తున్నారు. 1988 ప్రాంతం నుండి ఈ దిశగా ఆయన పనిచేస్తున్నారు. పరకాల సాహితీ మిత్ర మండలి ద్వారా నిర్వహించిన ‘శాస్త్రీయ దృక్పథం-అవసరం’ వంటి సదస్సులకు ఆధ్యక్ష్యం వహించడం అందుకు ఉదాహరణ. సర్వశిక్షా అభియాన్‌ వెలువరించిన వరంగల్‌ జిల్లా బాల సాహితీ మాస పత్రిక ‘పోతన’ అయిదు సంవత్సరాలపాటు వీరి సంపాదకత్వంలో వెలువడింది. ఈ సమయంలో బాలలతో చేయించిన సాహితీ సృజన ఎన్నదగింది. వీరి బాల వికాసకార్యక్రమాలకు గుర్తింపుగా బాల చెలిమి తెచ్చిన వరంగల్‌ జిల్లా కథల పుస్తకానికి ముందుమాట రాసే గౌరవం లభించింది.
బాలల వికాసం దిశగా ఈయన రాసిన కథల్లో కొన్నింటిని విశాలాంధ్ర ‘పందెం’ పేరుతో బాలల బొమ్మల కథల సంపుటిని ప్రచురించింది. మెండు ఉమామహేశ్వర్‌ కథలన్నీ విలక్షణ అంశాలను ఆధారం చేసుకుని పిల్లలకు సులభంగా అర్థం అయ్యేలా రాశారు. వాటిలో ‘మంచివారు’ కథ ఒక రాజ్యంలోని రాజు అడిగిన ఒక ప్రశ్నకు రాజాస్థానం లోని విధూషకుడు తెలివిగా ఎలా సమాధనం చెప్పి మెప్పించాడో తెలిపేది. మరోకథ ‘పందెం’ కూడా అటువంటిదే. ఇద్దరి మిత్రులు ఒక చిత్రకారునితో వేసుకున్న పందెం కథ యిది. ఇది పిల్లలకు నచ్చడమే కాక, నర్మగర్భంగా జరిపే సంభాషణలలను తెలుపుతుంది. ఒకరిని మించిన తెలివి మరొకరిదని తెలిపే మంచి కథ. ‘మోసపోయిన దొంగలు’ కథ. రంగడు, గంగులు యిద్దరు గజదొంగలు. ఒకనాడు ఒక నగల దుకాణంలోని ఒక వజ్రాల హారాన్ని దొంగిలించాలని వాళ్ళు పథకం వేసుకుని వెళ్తారు. అయితే సమయం వస్తే ఒకరిని మోసం చేయాలని మరొకరు ఎప్పటినుండో ఎదురుచూస్తున్నారు. అనుకున్నట్టే నగల దుకాణం వద్దకు వచ్చారు. రంగడు దుకాణం లోపలికి వెళ్ళి నగను చాకచక్యంగా దొంగిలించాడు. ఇదే అదను అనుకుని గంగులు వెళ్ళిపోయాడు, కొద్ది సేపటికి రంగడు నగతో రాగానే పహరా హుషార్‌ అంటూ కొత్వాల్‌ అక్కడికి వస్తాడు. రంగడిని పట్టుకుని నీవేందొంగిలించావని అడగగా, అతడు కొత్వాల్‌ కాదని గ్రహించి తాను దొంగిలించిన హారానికి బదులుగా నకిలీ హారాన్ని దొంగ కొత్వాల్‌కు యిస్తాడు. మరునాడు దొంగ కోత్వాల్‌ రూపంలోని గంగులు మరునాడు ఆ హారాన్ని అమ్మబోగా అది నకిలీ హారమని తెలుస్తుంది. రంగడు తాను దాచి పెట్టుకున్న హారాన్ని అమ్మబోగా అదీ నకీలిదని తేలుస్తాడు హారం కొనుగోలుదారు. వీళ్ళిద్దరు ఒకరిని మోసం చేయాలి అని మరొకరు చూస్తే, దుకాణం యజమాని దొంగలను మోసం చేసేందుకు తన దుకాణంలో నకిలీ హారాన్ని ఉంచి అసలుది తన యింటికి తీసకువెళ్ళాడు. ఇలాంటి సరదా కథలతో పాటు బాలలకు విజ్ఞానం, వినోదం అందించే మరెన్నో కథలు పందెం బాలల కథల సంపుటిలో ఉన్నాయి. రచయితగా, ఉపాధ్యాయునిగా, బాలల కోసం తపించే వ్యక్తిగా చక్కని బాల సాహిత్య సృజనచేస్తున్న మెండు ఉమామహేశ్వర్‌కు అభినందనలు. జయహో! బాల సాహిత్యం.

– డా|| పత్తిపాక మోహన్‌
9966229548

Spread the love