చీమ – గడ్డి వాము

పుణ్యగిరి అటవీ ప్రాంతంలో పెద్ద ఏనుగుల గుంపు ఉండేది. అందులో ఉన్న ఒక గున్న ఏనుగు విపరీతమైన అల్లరి చేసేది. ఏ జంతువునూ ఖాతరు చేసేది కాదు. దాని ప్రవర్తనకు మిగతా జంతువులన్నీ ఇబ్బంది పడేవి. ఒక రోజు గున్న ఏనుగు చెట్లను పెరికింది. చీమలపుట్టలను ద్వంసం చేసింది. చాలా చీమలు గున్న ఏనుగు కాళ్ళకింద పడి చచ్చిపొయాయి. మిగతా చీమలన్నీ తలో వైపుకు పరుగులు తీశాయి. కొంత సమయం తర్వాత అన్నీ ఒక చోట కలిశాయి. గున్న ఏనుగు బాధ పడలేక అడవిని వదిలి వెళ్ళిపోవాలని నిశ్చయించుకున్నాయి. పిల్లాపాపలతో కలిసి అడవిని వదిలి గ్రామం బాట పట్టాయి. దారిలో ఒక పశువుల కొట్టం కనిపించింది. అక్కడ ఒక గడ్డి వాము ఉంది. కాసేపు గడ్డివాము ప్రక్కన విశ్రమించాయి చీమలు. పుంఖాను పుంఖాలుగా వస్తున్న చీమల దండుని చూసి గడ్డివాము ఆశ్చర్యపోయింది. ”మిత్రులారా ఏమైంది అలా విచారంగా ఉన్నారు” అని అడిగింది.
”ఏం చెప్ప మంటావు? మేం అల్ప ప్రాణులం. గున్న ఏనుగు ఆగడాలు భరించలేకపోయాం” అని జరిగినదంతా చెప్పాయి. అంతా విని గడ్డివాము ఫక్కున నవ్వింది.
”ఎందుకలా నవ్వావు?” అని అడిగాయి చీమలు.
”విషపూరితమైన పాముని చంపగలిగిన మీకు ఏనుగు ఒక లెక్కా!” అంది గడ్డివాము.
”అంటే” అని సందేహించాయి చీమలు.
”గాలి వేస్తే గడ్డిపరకలమైన మేం ఎగిరిపోతాం. కానీ కుప్పగా పెడితే ఇదిగో ఇలా స్థిరంగా ఉంటాం. మేమంతా కలిస్తే గాలిని సైతం అడ్డుకుంటాం.” అంది గడ్డివాము.
ముసలి చీమకి తళుక్కున ఒక ఆలోచన తట్టింది. గండు చీమలతో ఒక సైన్యం ఏర్పాటు చేసింది. వాటికి ఏమి చెయ్యాలో చెప్పింది. ముసలి చీమ చెప్పినట్లు గున్న ఏనుగు ఎక్కడ ఉందో వెతకనారంభించాయి గండు చీమలు. ఒకచోట హాయిగా నిద్రపోతూ గున్న ఏనుగు కనిపించింది. గండు చీమలదండు మొత్తం ఏనుగు పైకి పాకి కుట్టడం ప్రారంభించింది. చీమలు ముక్కు చెవుల్లోకి దూరాయి. ఒళ్ళంతా కుట్టాయి. గున్న ఏనుగుకు కాసేపటికి వొళ్ళంతా మంట పుట్టింది. అది భరించలేక ఘీంకరిస్తూ దగ్గరలో ఉన్న ఒక నీటి మడుగులోకి దిగింది. చీమలన్నీ నీటిపై తేలియాడు ఆకుల సాయంతో ఒడ్డుకు చేరుకున్నాయి. గున్న ఏనుగు మాత్రం బురదలో కూరుకుపోయింది. బయటకు రాలేక గోల గోల పెట్టింది. గున్న అరుపులు విన్న ఏనుగులన్నీ పరుగు పరుగున మడుగు వద్దకు చేరుకున్నాయి. ”బుద్ధిగా ఉండమంటే ఉన్నావు కాదు. పీకల మీదకి తెచ్చుకున్నావు” అని తల్లి ఏనుగు తిట్టిపోసింది. అన్ని ఏనుగులు కలిసి అతికష్టం మీద గున్న ఏనుగును బయటకి తీసుకువచ్చాయి.
”నేనే గొప్ప అనుకుని మీ మాటలు పెడచెవిన పెట్టాను. బాధపడితేనే కానీ బోధపడలేదు” అని వాపోయింది గున్న.
”ఇక మీదట ఏ జీవినీ బాధపెట్టకు. బుద్ధిగా మసలుకో” అన్నాయి ముసలి ఏనుగులు.
”సరేనమ్మా బుద్ధిగా ఉంటాను” అంది గున్న.
”మనకి ధైర్యాన్ని, స్థైర్యాన్ని ఇచ్చి ఒక ఆలోచన కలిగించిన గడ్డి వాముకు కృతజ్ఞతలు తెలియచేద్దాం పదండి” అంది ముసలి చీమ. పొలోమని గడ్డివాము దగ్గరికి చేరుకుని ధన్యవాదాలు తెలియచేసి అడవికి పయనమయ్యింది చీమలదండు.

– కాశీ విశ్వనాథం పట్రాయుడు, 9494524445

Spread the love