రేషన్‌ మ్యుటేషన్స్‌ కోసం పడిగాపులు..!

– కార్డుల్లో పేర్ల నమోదుకు ఆఫీసుల చుట్టూ జనం
– హైదరాబాద్‌ జిల్లాలోనే 80వేలకుపైగా దరఖాస్తులు..
– నెలనెలా రేషన్‌ కోటా, సంక్షేమ పథకాలకు దూరమవుతున్న నిరుపేదలు
– తమ చేతిలో ఏమీ లేదంటున్న అధికారులు
– రాష్ట్ర వ్యాప్తంగా ఇదే సమస్య
– ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటేనే అవకాశం

నవతెలంగాణ-సిటీబ్యూరో
హైదరాబాద్‌ నగరంలోని అడిక్‌మేట్‌ ప్రాంతానికి చెందిన నగేష్‌(పేరుమార్చాం) ఓ ప్రయివేటు సంస్థలో పనిచేస్తున్నాడు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. రేషన్‌ కార్డులో ఇద్దరు పిల్లల పేర్లను చేర్చాలని పౌరసరఫరాల శాఖ అధికారులను సంప్రదించగా.. వారి సూచన మేరకు మీ-సేవలో దరఖాస్తు చేసుకున్నాడు. కానీ ఆయనకు రెండునర్నేండ్లుగా ఎదురుచూపులే మిగిలాయి. ఇప్పటివరకు రేషన్‌ కార్డులో వారి పిల్లల పేర్లు నమోదు కాలేదు. వాస్తవానికి ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాల లబ్ది పొందాలంటే అతని ఇద్దరు పిల్లల పేర్లు తప్పనిసరిగా ఉండాలి. అలా లేకపోవడంతో ప్రతి నెలా కొడుకుల కోటాకు సంబంధించిన రేషన్‌ బియ్యం పొందలేకపోతున్నాడు. ఓ సాధారణ ఉద్యోగి పరిస్థితే ఇలావుంటే.. రోజువారి కూలీ పనిచేసుకునే కుటుంబాల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇది ఒక్క నగేష్‌కు ఎదురవుతున్న సమస్యే కాదు. రాష్ట్రంలోని వేలాది మంది సమస్య. అలాగే, ఐదేండ్లలోపు ఉన్న పిల్లల పేర్లు కార్డుల్లో ఎక్కినా రేషన్‌ బంద్‌ చేసిన ప్రభుత్వం.. ఆ పిల్లలకు 9 ఏండ్లు వచ్చినా పునరుద్ధరించకపోగా కార్డులో నుంచి పేర్లనే తొలగించింది. ఇదేమని సంబంధిత అధికారులను అడిగితే.. ”మేమైతే తీయలేదు.. పేరు ఎలా
రేషన్‌ మ్యుటేషన్స్‌ కోసం పడిగాపులు..!పోయిందో మాకూ తెలియదు.. పేరు చేర్చడం కోసం మళ్లీ దరఖాస్తు చేసుకోండి..” అనే సమాధానం వస్తోంది.తెలంగాణ ప్రభుత్వం సుదీర్ఘకాలం తర్వాత జులై 2021లో కొత్త రేషన్‌ కార్డులు జారీ చేసిన విషయం తెలిసిందే. కానీ పాత కార్డుల్లో మార్పులు చేర్పులు, పేర్లు చేర్చడం చేయలేదు. ప్రస్తుతం పౌర సరఫరాల శాఖకు హైదరాబాద్‌ జిల్లాలోని తొమ్మిది సర్కిళ్ల పరిధిలో 613 పౌరసరఫరాల షాపుల్లో అన్ని రకాల రేషన్‌ కార్డులు కలిపి 6.36లక్షలు ఉన్నాయి. అయి తే, పాత కార్డుల్లో ఎవరైనా కుటుంబ సభ్యుల పేర్లను చేర్చాలంటే ఆ శాఖ ఆమోదం తెలపడం లేదు. ఫలితంగా ఎంతో మంది సంక్షేమ పథకాలకు అర్హత కోల్పోతున్నారు. ప్రధానంగా ముఖ్యమంత్రి సహాయ నిధి, ఉపకార వేతనాలు, కల్యాణలక్ష్మి, షాదిము బారక్‌, ఆసరా పింఛన్లు, విద్యాసంవత్సరం సమయంలో కుల, ఆదాయ, ఈబీసీ సర్టిఫికేట్స్‌ వంటి దరఖాస్తులకు ఆహార భద్రత కార్డునే ప్రామా ణికంగా తీసుకోవడంతో నానా అవస్థలు పడాల్సి వస్తోంది. పాత రేషన్‌ కార్డుల్లో అదనంగా కుటుంబ సభ్యులను చేర్పించడానికి పౌర సరఫరాల శాఖకు తొమ్మిది సర్కిళ్ల పరిధిలో ఏడేండ్ల కాలంలో దాదాపు లక్షకుపైగా దరఖాస్తులు రాగా.. 82-85వేల మధ్యలో దరఖాస్తులు పెండింగ్‌ లోనే ఉన్నాయి.
రేషన్‌ కార్డుల్లో పేర్ల నమోదు నిరంతర ప్రక్రియగా..
ఇదిలావుంటే ఆహారభదత్ర కార్డు కలిగిన కుటుంబాల్లో ఎవరైనా మరణిస్తే వారి పేర్లను రేషన్‌ కార్డుల నుంచి వెంటనే తొలగించేస్తున్నారు. నెలనెలా వారికి వచ్చే కోటా బియ్యాన్ని కూడా ప్రభుత్వం మినహాయిస్తోంది. కానీ కొత్త సభ్యులను చేర్చే విషయంలో మాత్రం సానుకూలమైన నిర్ణయం తీసుకోవడం లేదు. కొత్త సభ్యులను చేర్పించడానికి మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తులను స్వీకరిస్తున్నా.. కార్డుల్లో నమోదు చేయడానికి పౌరసరఫరాల శాఖ ఆమోదం తెలపడం లేదు. దీనివల్ల ఎంతో మంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ చెప్పులరిగేలా తిరుగుతున్నా ఉపయోగం లేదు. ముఖ్యంగా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వలస వెళ్లిన వారు కార్డు బదిలీ కోసం, పెండ్లి చేసుకొని పిల్లలు పుట్టిన వారి పేర్లు నమోదు చేసుకోవడం కోసం, పెండ్లి చేసుకొని అత్తవారింటికి వచ్చిన వారి పేర్ల నమోదు కోసం, మొదటి నుంచి కార్డులో పేర్లు నమోదు కాని వారు, విడిపోయిన కుటుంబాల వారు.. ఇలా వివిధ కారణాలతో దరఖాస్తు చేసుకున్న వారున్నారు. వీటన్ని పరిష్కారానికి ప్రభుత్వ ఆదేశాలు వచ్చే వరకు ఆగాల్సిందేనని అధికారులు చెబుతున్నారు. మరణించిన వారి పేర్లును రేషన్‌కార్డు నుంచి తొలగించినట్టుగానే.. కుటుంబంలో ఎవరైనా సభ్యులు చేరితే వారి పేర్లను ఎప్పటికప్పుడూ చేర్చడం నిరంతర ప్రక్రియగా కొనసాగాలని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు.

Spread the love