
– సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ డిమాండ్
– జిపి సమ్మెకు మద్దతుగా సిఐటియు ఆధ్వర్యంలో రాస్తారోకో
నవతెలంగాణ- కంటేశ్వర్
పంచాయతీ సిబ్బంది న్యాయమైన సమ్మె పట్ల వివక్ష తగదు అని సమస్యలను పరిష్కరించి సమ్మెను విరమింపజేయాలని సిఐటియు నిజామాబాద్ జిల్లా కార్యదర్శి నూర్జహాన్ డిమాండ్ చేశారు.ఈ మేరకు సోమవారం సీఐటీయు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ధర్నా చౌక్ వద్ద పంచాయితీ సిబ్బంది సమ్మెకు మద్దతుగా రాస్తారోకో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ.. గత 12 రోజుల నుండి గ్రామపంచాయతీ సిబ్బంది సమ్మె చేస్తుంటే ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమైంది. నిజామాబాద్ జిల్లాలో గ్రామాలలో పల్లె ప్రజలకుప్రత్యక్ష సేవలందిస్తున్న వేల మంది పంచాయతీ సిబ్బంది గత 12 రోజులుగా సమ్మె చేస్తున్న కార్మికుల పట్ల వివక్ష తగదు ఎండ, వాన, చలిలో ప్రజలకు ప్రత్యక్ష సేవలందిస్తున్న పంచాయతీ సిబ్బంది పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వివక్ష పాటించడం శోచనీయమన్నారు. నూటికి 80శాతం మంది దళితులే. గ్రామ పంచాయతీ కార్మికులు కావడం వల్లే వివక్ష కొనసాగిస్తున్నారా అని ఆమె విమర్శించారు. కరోన వంటి క్లిష్ట పరిస్థితులలోకూడా తమ ప్రాణాలు ఫణంగా పెట్టి ప్రజలకు సేవలందించారని చెప్పారు. మోడీ స్వచ్చ భారత్ కేసీఆర్ పచ్చదనం పరిశుభ్రత పిలుపును చిత్తశుద్ధి తో అమలు చేశారని చెప్పారు. గ్రామీణ ప్రజల జీవన విధానంలో ముఖ్య భూమిక పోషిస్తున్న పంచాయతీ సిబ్బంది కనీస కనికరం ఉండదా అని ప్రశ్నించారు.ఎన్నికలకు ముందు పంచాయతీ సిబ్బందిని పర్మినెంట్ చేస్తామని సీఎం వాగ్దానం చేసి 9 ఏండ్లు గడిచినా ఎందుకు చేయలేదన్నారు కార్మికులకు కనీస వేతన చట్టం ను డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో రూపొందిస్తే ఆ రాజ్యాంగం పై ప్రమాణం చేసిన సీఎం ఎందుకు రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతున్నారని విమర్శించారు ధరలు బారేడు జీతం జానెడు ఉంటే ఎలా అని ఎద్దేవా. చేశారు వేతనాలు పెంపు కోసం ప్రభుత్వం రూపొందించిన జీవో నెంబర్ 60 ప్రకారంగా గ్రామపంచాయతీ సిబ్బందికి 19వేల రూపాయలు ఇవ్వాలన్నారు. కేవలం 8500రూ. లతో ఎలా జీవిస్తారో ఒక నెల ఇదే జీతంతో ముఖ్యమంత్రి గడిపితేనే గ్రామపంచాయతీ కార్మికుల జీవితాలు అవగతం అవుతాయని చెప్పారు. వేతనాలు పెంచకపోవడంతో సిబ్బంది ఆరోగ్యాలు, పిల్లల చదువులు, సరైన భోజనం చేయలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు వేతనాలు పెంచకుండా పని భారం పెంచడానికి జీవో నెంబర్ 51 ని రూపొందించి ఒకే కార్మికుడు అనేక పనులు చేయాలనే మల్టిపర్పస్ విధానాన్ని ప్రవేశ పెట్టడడం సరికాదన్నారు. గ్రామ పంచాయతీ కార్మికుల సమ్మెలో గొంతెమ్మ కోర్కెలు లేవు న్యాయం, ధర్మం నీతి మాత్రమే ఉందన్నారు ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాల అమలు కోసమే నేడు సమ్మె జరుగుతుందన్నారు కార్మికులను పర్మినెంట్ చేస్తామని వేతనాలు పెంచుతామని ముఖ్యమంత్రి గతంలో అసెంబ్లీ సాక్షిగా చెప్పిన మాటలునిలబెట్టుకోలేదన్నారు ప్రమాదవశాత్తు కార్మికులు మరణించినా కనీస ఎక్స్ గ్రేషియో ప్రభుత్వం ఇవ్వలేకపోవడం సిగ్గుచేటన్నారు. గ్రామ పంచాయతీ సిబ్బందికి పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కల్పించకపోవడం అన్యాయం కాదా?అని ప్రశ్నించారు పంచాయితీ సిబ్బంది అంటే ప్రజా సేవకులు.వారి పట్ల ఈ ఉదాసీనత సరైంది కాదన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి సర్కార్ కార్మికుల హక్కులను కాలరాసే చర్యలకు ఒడిగట్టిందన్నారు బీజేపీ నేతలు నేడు టెంట్ల వద్దకు వచ్చి మద్దతు ఇచ్చినప్పటికీ అసలు కార్మికుల ప్రాథమిక హక్కులను లేకుండా చేస్తున్నది బీజేపీ అనేది మరువకూడదన్నారు . కార్పొరేట్లకు ఉపయోగపడే 4 లేబర్ కోడ్ లను తెచ్చి కార్మికుల పొట్టలు కొడుతుందన్నారు 8 గంటల పని విధానాన్ని 12 గంటలకు పెంచిన ఘనత బిజెపి సర్కార్ దేనని చెప్పారు. ప్రభుత్వం స్పందించకపోవడం విచారకరమన్నారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం జిపి జేఏసీ ని చర్చలకు ఆహ్వానించి సమస్యలు పరిష్కరించి సమ్మెను విరమింప చేయాలని ఆయన ఆమె చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఇవి ఎల్ నారాయణ, సిఐటియు జిల్లా నాయకులు కటారి రాములు, కృష్ణ , నర్సయ్య, గంగామణి, నాగమణి, సాయిలు భాస్కర్ మత్తు రాజు అంజయ్య తదితరులు పాల్గొన్నారు.