ఘనంగా దొడ్డి కొమరయ్య 77వ వర్ధంతి

నవతెలంగాణ – కంటేశ్వర్

దొడ్డి కొమరయ్య 77వ వర్ధంతి తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష – కార్యదర్శులు ఏశాల గంగాధర్ – పెద్ది వెంకట్రాములు, జిల్లా ఉపాధ్యక్షులు నర్ర శంకర్, జిల్లా సహాయ కార్యదర్శి శశికళ, జిల్లా కమిటీ సభ్యులు సాయిలు, నరసయ్య, రాజేశ్వరి, సావిత్రి నర్ర కళ, గోవర్ధన్, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్ది వెంకట్రాములు పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. సభ్యులంతా పుష్ప సమర్పణ చేసి జోహార్లు అర్పించారు. ఈ సందర్భంగా పెద్ది వెంకట్రాములు మాట్లాడుతూ… తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ప్రారంభమైన తొలినాళ్లల్లో జరిగిన విసునూరు దొర రామచంద్రారెడ్డి, జానకమ్మల నియంతృత్వానికి నిరంకుశత్వానికి వ్యతిరేకంగా సాగిన బైరాన్ పల్లి, కడవెండి పోరాటాలలో విసునూరు దొర ముస్కురుల తుపాకీ తూటాలకు బలైన తొలి అమరుడు దొడ్డి కొమరయ్య. దొడ్డి కొమురయ్య 1927లో జన్మించి 1946 జూలై 4న 19 సంవత్సరాల వయసులోనే నైజాం రజాకారు.. వాళ్ళ సంస్థానాధీశుల తుపాకీ తూటాలకు బలి అయ్యాడు. ఆ పోరాట ఫలితమే నేడు తెలంగాణ ప్రజలు పీల్చుకుంటున్న స్వేచ్ఛా వాయువులు. కానీ కొంతమంది మతోన్మాదులు, బిజెపి వాదులు హిందూ ముస్లిం గొడవగా సృష్టిస్తున్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో అడ్రస్ లేని వీళ్లు ఈ పోరాటాన్ని వక్రీకరించి ప్రపంచ చరిత్ర కలిగిన ఈ పోరాటాన్ని అవమానం పాలు చేస్తున్నారన్నారు. దీన్ని తెలంగాణ ప్రజలు సహించరు. తమ బుద్ధి మార్చుకోకపోతే భవిష్యత్తులో మీకే ప్రజలు బుద్ధి చెబుతారని పెద్ద వెంకట్రాములు హెచ్చరించారు. తెలంగాణ ప్రభుత్వం కూడా దొడ్డి కొమురయ్య చనిపోయిన జులై 4వ తేదీని అమరవీరుల సంస్మరణ దినంగా ప్రకటించాలని సూచించారు. అలాగే ఆయన స్ఫూర్తితో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఇతర ప్రజా సంఘాలు అనేక పోరాటాలు చేస్తున్నాయి. అనేక సమస్యలని సాధించుకున్నారు. ప్రస్తుతం పేద ప్రజలు నిలువ నీడ లేని వాళ్ళు ఇళ్ల స్థలాలు వేసుకుంటున్నా గుడ్లపగించి చూస్తున్న ఈ ప్రభుత్వం అందరికీ ఇళ్ల స్థలాల పట్టాలిచ్చి వాళ్లందరికీ ఇల్లు కట్టించి ఇవ్వాలి. అందుకు 15 లక్షల రూపాయలు ఉచిత ఆర్థిక సహాయం అందించాలి. అలాగే పోడుభూముల పట్టాలిస్తామని భాకాలు ఊదుకుంటున్నారు. పోడుభూముల పట్టాలు గిరిజనేతనులకు కూడా ఇవ్వాలని, కబ్జాలో ఉన్న వాళ్ళందరికీ నిబంధనలు లేకుండా పట్టాలిచ్చి అన్ని ప్రభుత్వ పథకాలను వర్తింపజేసే విధంగా చూడాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేస్తున్నది. దొడ్డి కొమరయ్య అలాగే ప్రాణ త్యాగం చేసిన తెలంగాణ సాయుధ పోరాట నాలుగువేల మంది అమరవీరుల ఆశయ సాధన కోసం తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని ప్రతిజ్ఞ చేశారు. ఇట్లు…. పెద్ది వెంకట్రాములు తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి.
Spread the love